- ఇష్టపడి పనిచేసా
- నాకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరు
- నా పనితీరే నా ఎదుగుదలకు కారణం
- రాజకీయాల్లో కుట్రలు సహజం
- భూపాలపల్లితోనే రాజకీయ అనుబంధం
- రేవంత్ సర్కారుపై ప్రజలలో అసహనం
- కేసీఆర్ రాజకీయ మేధావి
- భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
అక్షరశక్తి, వరంగల్ : వ్యవసాయం, వ్యాపారం, రాజకీయం…ఈ మూడు ఆయన జీవితంలో ప్రధాన అంశాలు. ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో నుండి వచ్చిన ఆయన ఇప్పటికీ వ్యవసాయాన్ని మరిచిపోలేదు. వ్యాపారం ఆయన సహజ లక్షణాలను బహిర్గతం చేస్తే.. రాజకీయాలతో తిరుగులేని గుర్తింపు, విజయాలను వెంట తెచ్చుకున్నాడు. ఎప్పుడైనా
ప్రజల కోసం చేసిన పనులు, ఎదుర్కొన్న పోరాటాలే తన రాజకీయ ప్రస్థానానికి, భవిష్యత్తుకు పునాది అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నా, చిన్నప్పటి నుండే రాజకీయ ఆలోచనలతో, స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు నడిచాడు. ఈ బాటలో ఎన్నో ముళ్ళు, పూలు. ఎన్నో కుట్రలు ఎదురైనా వెనక్కి తగ్గలేదని, తన పనితీరే తన ఎదుగుదలకు కారణమైందని చెప్పారు.
తనకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరని సూటిగా చెప్తూ…భూపాలపల్లి నియోజకవర్గాన్ని కుటుంబంగా భావించి అభివృద్ధి కోసం పనిచేశానని, వారితోనే నా భవిష్యత్తు అని తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తన వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన ఆసక్తికర అంశాలను గండ్ర వెంకటరమణారెడ్డి వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
తొలి నాళ్లలో వ్యవసాయం, వ్యాపారం
పోరాటాల పరకాల గడ్డపై పుట్టి వ్యాపారంలో విజయాలు సాధించాను. చదువు మీద పెద్దగా ఇష్టం లేదు. హన్మకొండ సెయింట్ జోసఫ్ స్కూల్‌లో పదో తరగతి వరకు చదివి, హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ పూర్తి చేశాను. చిన్నప్పటి నుంచే ఉద్యోగం చేయాలనే ఆలోచన నాకు లేదు. ఏదైనా అడ్వెంచర్ చేయాలనే ఆలోచన ఉండేది. అందుకు అనుగుణంగానే నా అడుగులు పడ్డాయి. వ్యవసాయం అంటే చిన్నప్పటి నుంచే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ ఖాళీ సమయం దొరికితే పొలాల దగ్గరకు వెళ్తాను. వ్యవసాయ పనులన్నీ నాకు తెలుసు. మా కుటుంబానికి చిన్నప్పటి నుంచే భూములు ఉన్నాయి. అప్పట్లో కూలీలు మా ఇంటికి వచ్చి తిండికి అడిగితే జొన్నలు ఇచ్చేవాళ్లం. పని సీజన్‌లో వచ్చి కూలీ తీసుకోకుండా కూడా పనిచేసేవాళ్లు. అప్పట్లో ఆ నియత్ ఉండేది. ఇప్పుడు ఒకరికి తిండిపెట్టాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. అటుపై వ్యాపారం కూడా ఇష్టంగా చేశాను.
విద్యార్థిగా రాజకీయాలు
పాలిటెక్నిక్ చదువుతున్న సమయంలోనే విద్యార్థి నాయకుడిగా పనిచేశాను. పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులకు బీటెక్ సెకండియర్‌లో అడ్మిషన్లు వచ్చేలా చేసిన పోరాటాలు మా ఉద్యమాల వల్లే జరిగాయి. ఆ ఉద్యమాల కారణంగా నేను అకాడమిక్ ఇయర్ లాస్ అయ్యాను. ‘ఊ అంటే ఉద్యమాలు చేస్తున్నావు’ అంటూ నన్ను ట్రాన్స్‌ఫర్ చేశారు. నేను చదువుకున్న కాలేజీలోనే దివంగత పీజేఆర్ కూడా చదువుకున్నారు. మా కాలేజీ ప్రిన్సిపాల్ నా దూకుడు చూసి.. ‘పీజేఆర్ మన కాలేజీలోనే చదువుకున్నాడు.. ఆయన లీడర్ అయ్యాడు.. నువ్వు కూడా లీడర్ అవుతావు. తొందరపడకు’ అని చెప్పేవారు. ఆ మాట ఇప్పటికీ గుర్తుంది. ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి తొలగించినప్పుడు అన్యాయం జరిగిందనే ఆలోచనతో బస్సు టైర్లలో గాలి తీశాం. ఇలా ఎన్నో ఉద్యమాలు చేశాం. అప్పట్లో చాలా దూకుడుగా ఉండేవాడిని. ఒకసారి హయగ్రీవాచారి దగ్గరకు వెళ్లినప్పుడు.. ‘నీ అనుభవం అంతా నా వయస్సు లేదు నీకు.. ఇంత దురుసు ఎందుకు?’ అంటూ ఆయన కన్నెర్ర చేశారు.
పూర్తిస్థాయి రాజకీయాల వైపు….
1989 నుంచి పూర్తిస్థాయి నాయకుడిగా పనిచేశాను. యూత్ కాంగ్రెస్‌లో జిల్లా స్థాయిలో పనిచేశాను. ఆ రోజుల్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండేది. మా ఇల్లు రోడ్డుకు ఉండేది. రాజకీయాల్లో యాక్టివ్‌గా తిరుగుతుంటే నన్ను తీసుకెళ్లారు. మా ఇంటిని పేల్చేశారు. నాన్న రాజకీయాలు వద్దనేవారు. కానీ నా పట్టుదల, పోరాటం చూసి తర్వాత నాకు అండగా నిలిచారు. 1999లో అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నించాను. కానీ రాలేదు. 2001లో ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడినయ్యాను. 13 ఏళ్ల పాటు సుదీర్ఘంగా, రికార్డు స్థాయిలో పనిచేశాను. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో కష్టపడ్డాను. అప్పట్లో సోషల్ మీడియా ఎక్కడిది? టీవీలు, పేపర్లే ఉండేవి. రోజూ కార్యక్రమాలు చేస్తూ ప్రజల కోసం కొట్లాడేవాళ్లం. 2004లో ప్రభుత్వం రావడంలో కీలకంగా పనిచేశాను. 2014 వరకు డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగాను. ఆ సమయంలో నన్నెవరూ తీసేయలేదు. నేనే తప్పుకున్నాను. అప్పట్లో ఏ న్యూస్ చానల్ పెట్టినా నేను కనిపించేవాడిని. అంతగా కష్టపడ్డాను.
టీడీపీ టికెట్ వచ్చినా వెళ్లలేదు
2004లో టీడీపీ నుంచి నాకు టికెట్ ఆఫర్ వచ్చింది. కానీ నేను చేసిన పోరాటం అంతా టీడీపీకి వ్యతిరేకంగానే. అలాంటి పార్టీలోకి వెళ్లి టికెట్ తెచ్చుకోవడం సరికాదని భావించి వెళ్లలేదు. ఎన్టీఆర్ అంటే నటుడిగా నాకు అభిమానం. ఆయన కొన్ని పాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. నా తరం చూసినంత మార్పును ఇంకే తరం చూసి ఉండదు.. చూడదు కూడా. చాలా వేగంగా మార్పులు జరిగాయి. అన్ని మార్పులను ఆస్వాదించాల్సిందే. నేను కరువును రెండుసార్లు చూశాను.
నాకు గాడ్ ఫాదర్ లేడు
నా పనితీరే నా ఎదుగుదలకు కారణం. నాకు రాజకీయాల్లో ఎవరు గాడ్ ఫాదర్ లేడు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే ఈ స్థాయికి ఎదిగాను. అప్పట్లో కొంతమంది హవా నడిచేది. వారిని ఓవర్‌కమ్ చేసి ఎదిగాను. ఎంతో కష్టపడ్డాను. నా ఫర్మామెన్సే నా ఎదుగుదలకు కారణం. రాజకీయాలంటేనే కుట్ర. తడిగుడ్డతో గొంతు కోస్తారు. నవ్వుతూనే ప్రాణం తీస్తారు. నన్ను తొక్కేందుకు, నాకు అవకాశాలు రాకుండా చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నించారు. నేను కడక్‌గా ఉండేవాడిని. భయపడేవాడిని కాదు. అందుకే నెట్టుకొచ్చాను.
ఎమ్మెల్సీగా గెలుపు.. అదీ ఓ రాజకీయ కుట్రే
2007లో ఎమ్మెల్సీగా అవకాశం రావడం కూడా ఒక రాజకీయ కుట్రే. కానీ గెలిచి చూపించాను. హనుమకొండ నుంచి నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని వైఎస్ ఆలోచించారు. అక్కడ అవకాశం లేకపోవడంతో వరంగల్ ఎంపీగా పోటీ చేయాలని అన్నారు. నాకు టికెట్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. నేను కూడా పోటీకి సిద్ధమయ్యాను. అప్పుడు కుట్రలు జరిగాయి. నేను పోటీ చేస్తానని తట్టుకోలేక పొత్తులో భాగంగా రెండు ఎంపీ టికెట్లను అప్పటి టీఆర్ఎస్‌కు ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలు ఉండేవి. అయితే అందులో అప్పటికే ఓ రెడ్డికి టికెట్ ఖరారైంది. దీంతో నేను వద్దనుకున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వెళ్లాను. అప్పుడు కాంగ్రెస్ బలం తక్కువ. ఓడిపోతారని అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు పొత్తులో టీఆర్ఎస్ సంపూర్ణంగా సహకరించింది. 115 ఓట్లతో నేను గెలిచాను.
మంత్రి పదవి పోయినా బాధపడలేదు…
2011లో మంత్రి అయ్యే అవకాశం మిస్ అయింది. పార్టీ అధిష్ఠానం నుంచి నా పేరు వచ్చింది. కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ‘డన్.. నీ పేరు వచ్చింది’ అన్నారు. మరుసటి రోజు గవర్నర్ వద్ద ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పారు. నేను ఇంటికి వచ్చాను. ఉదయం నాకు ఫోన్ రాలేదు. అక్కడ ప్రమాణ స్వీకారం అయిపోయింది. హటాహుటిన అక్కడికి వెళ్తే రోశయ్య ‘గండ్ర.. నీ పేరు కేబినెట్‌లో ఎలా మిస్ అయింది?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంత్రి వర్గ విస్తరణ సమయంలోనూ అలాగే కుట్రలు జరిగాయి. రెండోసారి కూడా మంత్రి పదవి మిస్ అయింది. అయినా బాధపడలేదు. హైకమాండ్ నుంచి ప్రెషర్ ఉన్నా స్థానిక కుట్రలతో అవకాశం రాలేదు. కానీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. 2012లో చీఫ్ విప్ అయ్యాను.
2019లో బీఆర్ఎస్‌లోకి..
2019లో అప్పటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్‌లో చేరాను. కేటీఆర్‌తో ఉద్యమ సమయం నుంచే పరిచయం ఉంది. కేసీఆర్‌తో మంచి అనుబంధం ఉంది. ఆయన వర్కింగ్ సిస్టమ్ వేరే. కేసీఆర్ కలవడం లేదు.. కలవడం లేదు అంటారు. కానీ కలిసిన రోజు సమస్యలన్నీ తీరిపోతాయి. పెండింగ్ పనులన్నీ క్లియర్ అవుతాయి. 30 నిమిషాలో, గంట సమయమో అనుకుంటే ఒక్కోసారి రోజు, ఓ పూట అంతా ఆయనే సమయం తీసుకుంటారు. కేసీఆర్‌కు ప్రతి విషయంలో అవగాహన ఉంది. ఏ విషయంపైనైనా, ఏ సమస్యపైనైనా అనర్గళంగా మాట్లాడుతారు.
డబ్బే రాజకీయాల్లో ప్రధాన సమస్య
చిన్నప్పటి నుంచి కొంత ఉన్న కుటుంబం కావడంతో పెద్దగా ఇబ్బందులు పడలేదు. డబ్బులే రాజకీయాల్లో ప్రధాన సమస్య. అవి ఉంటే రాజకీయ ప్రయాణం సాఫీగానే సాగుతుంది. రాజకీయం అంటే డబ్బులతో ముడిపడిన అంశం. అందుకే బిజినెస్ వైపు కూడా అడుగులు వేశాను. రిజర్వేషన్ కలిసి రావడంతో 2005లో నా భార్య గండ్ర జ్యోతిని వరంగల్ మేయర్ చేయాలనుకున్నాను. నాకు టికెట్లు మిస్ కావడంతో వైఎస్‌తో మాట్లాడి బరిలో నిలిచాం. కానీ గెలిచిన తర్వాత జరిగిన కుట్రలతో అదీ మిస్ అయింది. రాజకీయంలో ఎదగకుండా కుట్రలు సైలెంట్‌గా చేస్తుంటారు.
భూపాలపల్లి తోనే అనుబంధం
భూపాలపల్లి కి చాలా చేశాను. నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఎన్నో కార్యక్రమాలు చేశాను. అప్పట్లో భూపాలపల్లి సమస్యలకు కేరాఫ్‌గా ఉండేది. డిగ్రీ, ఇంటర్ కాలేజీలు తీసుకొచ్చాను. మొదట్లో ప్రాథమిక వైద్య కేంద్రం మాత్రమే ఉండేది. ఇప్పుడు మెడికల్ కాలేజీ, 100 పడకల ఆస్పత్రితో మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చాను. సింగరేణి కార్మికుల కోసం 2 వేల క్వార్టర్స్ కట్టించాం. చెక్‌డ్యామ్‌లు, లిఫ్ట్ ఇరిగేషన్, రోడ్ల వెడల్పు.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు అనేక పనులు చేశాం. బైపాస్ రోడ్డు మంజూరైంది కానీ పూర్తికాలేదు. మొత్తం సమస్యలన్నీ పోయినయని కాదు. ఇంకా కొన్ని మేజర్ సమస్యలు ఉన్నాయి. పబ్లిక్‌ను సాటిస్‌ఫై చేయడం అంత ఈజీ కాదు. నేను నిధుల కోసం బారాబర్‌గా నిలదీసి తెచ్చేవాడిని. భూపాలపల్లి పట్టణం సమ్మిళితం. ఇక్కడ కార్మికులు ఎక్కువ. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు ఉంటారు. నా ప్రయాణం అంతా భూపాలపల్లితోనే. నా కుటుంబమే భూపాలపల్లి. భూపాలపల్లి డెవలప్‌మెంటే నా లక్ష్యం. మళ్లీ ఆశీర్వదిస్తే రాష్ట్రంలో నంబర్‌వన్‌గా చేసేందుకు ప్రయత్నిస్తాను.
భూకబ్జాలంటూ నిందలు వేస్తున్నారు
నా మీద భూకబ్జాలంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, సీఎంపై పరువు నష్టం కేసు వేశాను. ఎకో పార్క్ పెట్టిందే నేను. వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశాను. భూమిని కాపాడాలని కోర్టుకు వెళ్లి పోరాడిన నేను భూకబ్జా చేశానంటూ కుట్రలు చేస్తున్నారు. బట్టకాల్చి మీద వేయాలని చూస్తున్నారు. నాకు భూకబ్జాలు చేయాల్సిన అవసరం లేదు. భూపాలపల్లిలో ఆధ్యాత్మిక వాతావరణం కోసం గుడి కడితే దాన్ని కూడా రాజకీయం చేశారు. ప్రభుత్వ భూమిలో కట్టిన గుడిపై కేసులు వేశారు. నిర్మాణంలో అడుగడుగునా ఇబ్బంది పెట్టారు.
రిజర్వేషన్ వస్తే గండ్ర జ్యోతి బరిలో
గండ్ర జ్యోతి నుంచి నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మహిళలతో ఆమెకు మంచి అటాచ్‌మెంట్ ఉంటుంది. మహిళా రిజర్వేషన్ వస్తే తప్పకుండా ఎమ్మెల్యే బరిలో గండ్ర జ్యోతి ఉంటుంది. ఇప్పటికే వరంగల్ జెడ్పీ చైర్మన్‌గా చేశారు. భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జ్‌గా కూడా పనిచేసింది. మహిళల్లో ఆమెకు ఉన్న అనుబంధం, రాజకీయ అనుభవం ఉపయోగపడతాయి.
రేవంత్ సర్కార్‌ను ఎవరూ నమ్మడం లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కింది. ప్రభుత్వ పాలన తీరు ఎలా ఉందో సగటు రైతులే చెబుతారు. పెన్షన్, రైతు భరోసా, బీమా, ఆడబిడ్డలకు రూ.2,500, యూరియా కష్టాలు.. ఇలా ఒక్కటేమిటి.. అన్ని సమస్యలే. అన్ని మోసాలే. ప్రజలంతా మాయ నుంచి తేరుకున్నారు. రేవంత్ సర్కార్‌ను అనాస్థీషియా ఇచ్చి మళ్లీ పడుకోబెట్టే కాలం దగ్గర్లోనే ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే దీపం ఉండగానే సక్కబెట్టుకోవాలనే చందంగా పనిచేస్తున్నాడు. తమ్ముడు, కుటుంబ సభ్యులకు వసూళ్ల కోసం శాఖలను పంచిండు. ఆయన తీరుతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
పనికి గుర్తింపు లేకుండా పోయింది
ప్రస్తుత రాజకీయంలో గెలుపు, ఓటములకు పనులకు సంబంధం లేకుండా పోయింది. గతంలో పని చేసే వ్యక్తిని గుర్తించి ఎన్నుకునేవారు. ఇప్పుడు ఎంత పని చేసినా ఓటు వేసే వరకు భయపడే పరిస్థితి వచ్చింది. గతంలో ప్రజలు విలువలున్న రాజకీయ నాయకులను ఎన్నుకునేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మళ్లీ నియోజకవర్గమంతా పాదయాత్ర చేస్తాను. జరిగిన మోసాలను ప్రజలకు వివరిస్తాను. నేను చేసిన పనులను కూడా ప్రజలకు చెబుతాను. ప్రజలతో నాకు ఉన్న అనుబంధమే నా బలం. భూపాలపల్లి అభివృద్ధి కోసం నేను చేసిన పనులను, ఇంకా చేయాల్సిన పనులను ప్రజల ముందుంచుతాను.
రాజకీయాలు…. గౌతమ్ ఇష్టం
నా కొడుకు గండ్ర గౌతమ్ రాజకీయ ప్రవేశం అనేది ఆయన ఇష్టం. ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా వద్దనేది లేదు. తనకు నచ్చిన సమయంలో రాజకీయాల్లోకి రావచ్చు. అయితే రానున్న రోజుల్లో ఆయన కేటీఆర్ టీంలో ఉంటారు. యువత రాజకీయాల్లోకి రావాలి. గౌతమ్ కూడా తనకు నచ్చిన సమయంలో రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం పనిచేయాలని నేను కోరుకుంటాను.