- రెండేళ్లకే తండ్రి మరణం..
- కూలీ పనులకెళ్తూ ఉన్నత చదువులు
- మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 2 కొలువు
- ఆదివారాలు, సెలవుల్లో సామాజిక సేవా కార్యక్రమాలు
- తండ్రి సర్వర్ పేర చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు
- వందలాది వలస కూలీలకు ఆపన్నహస్తం
- కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు
- ఓ పక్క బాధ్యత గల అధికారిగా ప్రజల మన్ననలు
- మరోపక్క సేవా కార్యక్రమాలతో సమాజంపై తనదైన ముద్ర
- ఆదర్శంగా నిలుస్తున్న మలుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్
- మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
అక్షరశక్తి, వరంగల్ : అడగందే అమ్మయినా అన్నం పెట్టదు అంటుంటారు.. కానీ, సమాజాన్ని కుటుంబంగా భావించే ఆమె మాత్రం ఎక్కడ ఆకలి కేకలు వినిపించినా, ఎవరి కంట కన్నీరు కనిపించినా అక్కడ ప్రత్యక్షమవుతారు. నీనున్నానంటూ గుండెలకు హత్తుకుంటారు. కన్నీళ్లు తుడిచి కడుపు నింపుతారు. అందుకే ఆమె అన్నార్థులకు అమ్మయింది, అభాగ్యుల పాలిట అభయహస్తంగా మారింది. ప్రేమకు నిలువెత్తు రూపంగా నిలిచింది. గ్రామీణ పేద ముస్లిం కుటుంబంలో పుట్టిన తస్లీమా మహ్మద్ కన్నీళ్లు, కష్టాల మధ్యే పెరిగారు. తన రెండేళ్ల వయస్సులోనే నక్సలైట్ల చేతిలో తండ్రి హత్యగావించబడగా, కుటుంబ భారాన్ని తల్లి భుజానికెత్తుకుంది. కూలీ చేయగా వచ్చిన డబ్బులతో కష్టపడి చదివించింది. ఉన్నత విద్యను అభ్యసించిన తస్లీమా గ్రూప్ -2 పరీక్షలు రాసి ఉన్నతస్థాయి అధికారిణిగా నిలిచారు. ప్రస్తుతం ములుగు సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కమ్యూనిస్టు నాయకుడైన తన తండ్రి పేరుతో ట్రస్ట్ ఏర్పాటుచేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు తస్లీమా. కరోనా సమయంలో వందలాది వలస కుటుంబాలకు సాయంచేసి ఆదర్శంగా నిలిచారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోడానికి, కష్టాల్లో ఉన్నవాళ్ల కన్నీళ్లు తుడవడానికి కులం, మతంతో పనిలేదంటున్న తస్లీమా తన తండ్రి సేవాగుణం, తల్లి ధైర్యమే తనలో స్ఫూర్తినింపాయంటున్నారు. ఓ పక్క బాధ్యత గల అధికారిగా ప్రజల మన్ననలు పొందుతూనే, మరోపక్క సేవా కార్యక్రమాలతో సమాజంపై తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా తస్లీమాపై అక్షరశక్తి ప్రత్యేక కథనం..
కష్టాలు, కన్నీళ్ల మధ్యే..
తస్లీమా మహమ్మద్ ది ములుగు జిల్లా రామచంద్రపురం. పేదరికంలో పుట్టి పేదరికంలోనే పెరిగింది తస్లీమా. తన రెండు సంవత్సరాల వయసులోనే తండ్రి సర్వర్‌ను నక్సలైట్లు కాల్చి చంపారు. దీంతో తల్లి ఫాతిమా అన్ని తానై కుటుంబాన్ని పోషించింది. తర్వాత వీరి కుటుంబం హన్మకొండలో స్థిరపడింది.
తల్లి కష్టపడి ఐదుగురు పిల్లలను చదివించింది. కూలీ పనులు చేయగా వచ్చిన డబ్బుతోనే తస్లీమా కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ (ఆర్గానిక్ కెమెస్ట్రీ) పూర్తి చేసింది. పట్టుదలతో చదివి గ్రూప్ 2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ప్రస్తుతం ములుగులో సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తోంది. ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ఆ దిశగా అడుగులు వేసి విజయం సాధించిన తస్లీమా.. తన మూలాలు మాత్రం మర్చిపోలేదు. అందుకే తనకు స్ఫూర్తిగా నిలిచిన తన తండ్రి సర్వర్ పేరున చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతోంది. కరోనా సమయంలో వందలాది మంది వలస కూలీలు, గుత్తికోయలను అక్కున చేర్చుకుని అమ్మలా ఆదరించారు తస్లీమా. పేదవారు ఎలాంటి కష్టాలు అనుభవిస్తారో తెలుసు కాబట్టే వారికి ఏదో విధంగా సహాయపడాలని నిశ్చయించుకున్నానని ఆమె చెబుతున్నారు.
సెలవుల రోజుల్లో కూలీగా..
ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినాలు, ఆదివారాలు వచ్చాయంటే చాలు తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు ఇష్టపడతారు. కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగి మాత్రం అందుకు భిన్నం. ప్రభుత్వ సెలవులు, ఆదివారాలు వచ్చాయంటే చాలు వ్యవసాయ కూలీగా మారుతుంది, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి, డబ్బులు కూడబెట్టుకుంటున్న ఈరోజుల్లో ప్రభుత్వం నుంచే వచ్చే జీతంలోని సగానికిపైగా పేద ప్రజలకు, అనాథలకు, నిరాశ్రయులకు ఖర్చు పెడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు ములుగు జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్. అంతేగాక ప్రభుత్వ వాహనం ఉన్నప్పటికీ విధి నిర్వహణలో భాగంగా హన్మకొండ నుంచి ములుగుకు ప్రతి రోజు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
అనేక సేవా కార్యక్రమాలు
ములుగు జిలాల్లో స్వచ్చంద సేవ చేస్తూ అనేకమంది అనాథ పిల్లలకు తోచిన సహాయం చేస్తున్నారు తస్లీమా. అందుకే ఆ పిల్లలు ఆమెను తమ సొంత అక్కగా చెప్పుకుంటుంటారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో తమ కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొందని.. ఇతరుల్లో ఆ కష్టాలు చూసినపుడు మనసు చలించి వారికి సహాయం చేస్తున్నట్లు ఆమె వివరించారు. ములుగు పరిసర ప్రాంతాలలో తస్లీమా మహమ్మద్‌ని అధికారిగా పలకరించడం కన్నా, అక్క అని సంబోధించే వారే ఎక్కువమంది ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు తన మంచితనం వారిలో ఎంతగా నాటుకుపోయిందో.