అక్షరశక్తి, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల హోలీ వేడుకల సందర్భంగా బహిరంగంగా అనుచరులకు మద్యం తాగించి తీవ్ర విమర్శలపాలయ్యారు. తాజాగా.. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మానుకోట జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన రైతు నిరసన దీక్షలో ఆయన వ్యవహరించిన తీరు గులాబీపార్టీలో దుమారం రేపుతోంది. భారత పార్లమెంట్ సభ్యురాలు.. ఆపై అధికార టీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు.. అందులోనూ ఒక మహిళ అన్న విషయాన్ని మరిచిపోయి.. ఆమె చేతిలో ఉన్న మైక్‌ను ఒక్కసారిగా గుంజుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక మహిళ పట్ల కనీస గౌరవ మర్యాదలు లేవని, సభలో ఒక ప్రజాప్రతినిధి ఇలాగేనా ప్రవర్తించేది.. అంటూ సొంతపార్టీ శ్రేణలతోపాటు నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ కవిత చేతిలో ఉన్న మైక్‌ను శంకర్‌నాయక్ లాక్కున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శంకరా.. ఇవేం పనులు.. అంటూ ప్రజలు మండిపడుతున్నారు.
మొదటి నుంచీ వివాదాస్పదమే…
మానుకోట ఎమ్మెల్యేగా శంకర్‌నాయక్ గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు. అప్పట్లో మానుకోట జిల్లా మహిళా కలెక్టర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ పెద్ద దుమారం లేచింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కలకలం రేపింది. ఈ క్రమంలో ఆయన క్షమాపణ చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. ఆ తర్వాత ఓ సభలో నేనేం ఎర్రబస్సు ఎక్కి రాలేదు.. అంటూ మహిళా మంత్రిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలా అనేక సందర్భాల్లో తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలోనే మానుకోట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మందుబాటిల్ పట్టుకుని చిందులేయడం, అంతేగాకుండా, పార్టీ కార్యకర్తలకు బహిరరంగంగా మద్యం తాగించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. చాంబర్‌లోకి పిలిపించుకుని పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని సీఎం కేసీఆర్ హెచ్చరించినట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటనతో సొంత పార్టీ కార్యకర్తలే ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే కష్టమంటూ పలువురు అనుచరులు తమ అసహనం ఎమ్మెల్యే ముందే వెల్లడించినట్లు తెలిసింది.
మహిళా అధ్యక్షురాలిని అవమానించేలా…
మానుకోట జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు నిరసన దీక్షలో ఎంపీ కవిత, మానుకోట టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు కవితను అవమానపర్చేలా శంకర్‌నాయక్ ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మహబూబాబాద్ టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆధ్యక్షరాలు ఎంపి మాలోత్ కవిత రైతు దీక్షలో మాట్లాడుతుండగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాక్కున్నారు. బిత్తరబోయిన కవిత సంయమనం పాటిస్తూ సైలెంట్‌గా కూర్చుండిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే పార్టీ అధిష్ఠానం దృష్టికి కూడా పోయినట్లు తెలుస్తోంది. అయితే, వేదికపై శంకర్‌నాయక్ ప్రవర్తించిన తీరును చూసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇదేం పద్ధతంటూ లోలోపల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. శంకర్‌నాయక్‌లో ఎందుకింత అసహనం అన్నదానిపై పార్టీవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మానుకోట జిల్లా అధ్యక్షురాలిగా కవితను నియమించడం శంకర్‌నాయక్‌కు ఏమాత్రం ఇష్టం లేదని, అప్పటి నుంచి ఇద్దరి మధ్య మరింత గ్యాప్ పెరిగిందని పార్టీవర్గాలు చర్చించుకుంటున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు కార్యక్రమంలో ఇలా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు ముందుముందు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో చూడాలి మరి.