AKSHARA SHAKTHI
Date of Publish : 20 August 2026, 12:51 pm Posted by : AKSHARA SHAKTHI

ఆమె వ్యాఖ్యలకు నేనెలా బాధ్యత వహిస్తా

*ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం

*క్రమశిక్షణ కమిటీ నోటీసుపై కొండా సురేఖ వివరణ

 

అక్షరశక్తి హైదరాబాద్: తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఆమె తన వివరణను సమర్పించారు.

ఆగస్టు 19న తన జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కొండా కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు, జన్మదిన వేడుకలు నిర్వహించారని సురేఖ తెలిపారు. ఇందులో భాగంగా తన స్వస్థలమైన గీసుకొండ లో అభిమానులు, కార్యకర్తలు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో తన కుమార్తె కొండా సుస్మిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారని పేర్కొన్నారు. ఆ సందర్భంగా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలకు సంబంధించినవేనని సురేఖ స్పష్టం చేశారు. కుటుంబ బంధం ఉన్నంత మాత్రాన ఒకరి రాజకీయ అభిప్రాయాలకు మరొకరు బాధ్యత వహించాలని, అందుకు వివరణ ఇవ్వాలని కోరడం సమంజసం కాదన్నారు. తన కుమార్తె వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణ నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని సురేఖ తెలిపారు. వాస్తవ పరిస్థితులు, ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని గుర్తించి, తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణ కమిటీని ఆమె కోరారు.