– 2005 నుంచే గుడిసెల్లో ఉంటున్నారు
– ఇప్పుడు ఖాళీ చేయించే ప్రయత్నం
– కోర్టు వివాదం ఉన్నా.. కాంప్లెక్స్ నిర్మాణానికి ఎన్‌ఓసీ ఎలా ఇచ్చారు?
– దొంగ పత్రాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేయత్నం
– పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది
– మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
అక్షరశక్తి, కాజీపేట : గ్రేటర్ వరంగల్ పరిధి కాజీపేటలోని వైఎస్‌ఆర్ నగర్‌లో ఎన్నో ఏళ్లుగా పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్‌ఎస్ నేత దాస్యం వినయ్‌భాస్కర్ ఆరోపించారు. షాపూర్ ఇరాని కుటుంబ సభ్యులమంటూ కొందరు వచ్చి గుడిసెవాసులను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 2005 నుంచే పేదలు ఇక్కడ గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని, వారికి ఇంటి నంబర్లు, ఆధార్, ఓటర్ కార్డులు కూడా ఉన్నాయని తెలిపారు. సోమవారం నాడు వైఎస్‌ఆర్ నగర్‌లో గుడిసెవాసులను దాస్యం వినయ్‌భాస్కర్ కలిసి సమస్యలను తెలుసుకున్నారు. వైఎస్సార్ నగర్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
కోర్టు వివాదంలో ఉన్న భూమిపై కాంగ్రెస్ ప్రభుత్వం కాంప్లెక్స్ నిర్మాణానికి ఎన్‌ఓసీ ఎలా ఇచ్చిందని వినయ్‌భాస్కర్ ప్రశ్నించారు. దొంగ పత్రాలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎన్‌ఓసీ ఎలా ఇచ్చారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు అనుమానాలున్నాయని పేర్కొన్నారు.

వైఎస్‌ఆర్ నగర్ గుడిసెవాసులను డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామంటూ భయపెడుతున్నారని దాస్యం వినయ్‌భాస్కర్ ఆరోపించారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు నిర్మాణాలకు వినియోగించడం సరికాదన్నారు. ఆ భూమిలో ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని సూచించారు. గుడిసెవాసులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, వారికి అండగా బీఆర్ఎస్ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో రైల్వే రిటైర్డ్ ఉద్యోగుల కోసం భూమి కేటాయించే విషయంలో తమపై కేసులు నమోదు చేశారని తెలిపారు. అయితే ఆ కేసులను కోర్టు కొట్టివేసిందన్నారు. ఇప్పుడు అదే భూమిపై అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఎలా వచ్చాయో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తమపై దౌర్జన్యం చేస్తున్నారని గుడిసెవాసులు ఫిర్యాదు చేస్తే.. ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

పేదల హక్కుల కోసం బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందని వినయ్‌భాస్కర్ స్పష్టం చేశారు. అవసరమైతే ఈ అంశాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. అనంతరం రైల్వే రిటైర్డ్ ఉద్యోగులతోనూ మాట్లాడి భూమికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
