అక్షరశక్తి, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎపూర్ గ్రామంలో ఓ దివ్యాంగ యువతి ప్రమాదవశాత్తు చేతిబావిలో పడిపోగా.. అక్కడే ఉన్న కానిస్టేబుల్ దిలీప్ క్షణం కూడా ఆలోచించకుండా ఆమె ప్రాణాలను కాపాడేందుకు బావిలోకి దిగి సాహసోపేతంగా రక్షించారు. విధి నిర్వహణలోనే కాదు.. ఆపదలో ఉన్న ఓ నిండు ప్రాణానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదవశాత్తు యువతి బావిలో పడిపోయిన విషయం తెలుసుకున్న దిలీప్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. బావి లోతుగా ఉండటంతో ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బావిలోకి దిగారు. లోతులో ఉన్న యువతి వద్దకు చేరుకుని ధైర్యం చెప్పడంతో పాటు, తాళ్ల సహాయంతో ఆమెను జాగ్రత్తగా పైకి తీసుకొచ్చారు.
సకాలంలో స్పందించిన కానిస్టేబుల్ దిలీప్ చాకచక్యంగా వ్యవహరించడంతో యువతి ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఒకవైపు ప్రమాదకర పరిస్థితి.. మరోవైపు నిస్సహాయ స్థితిలో ఉన్న యువతి.. అయినా వెనుకడుగు వేయకుండా రక్షణ చర్యలకు దిగిన దిలీప్ తీరును గ్రామస్థులు అభినందించారు.
“పోలీసు అంటే కేవలం విధులు నిర్వర్తించడం మాత్రమే కాదు.. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడం కూడా బాధ్యతే” అన్నట్లుగా దిలీప్ వ్యవహరించిన తీరు స్థానికుల మనసులను గెలుచుకుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి ఓ యువతి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ దిలీప్‌పై గ్రామస్థులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు రావడం, కర్తవ్యాన్ని మానవత్వంతో మేళవించడం ద్వారా కానిస్టేబుల్ దిలీప్ పోలీసు శాఖకు గౌరవం తీసుకొచ్చారని పలువురు పేర్కొన్నారు.
