AKSHARA SHAKTHI
Date of Publish : 27 August 2026, 6:51 am Posted by : AKSHARA SHAKTHI

ఏసీబీ వలలో మైన్స్ అధికారి

భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇళ్లపై ఏసీబీ సోదాలు

 

అక్షరశక్తి,భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ బొజ్జ జయరాజు నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. భూపాలపల్లి, ములుగు, వరంగల్, హైదరాబాద్‌లోని బోడుప్పల్‌తో పాటు సూర్యాపేట, తాండూరు తదితర ప్రాంతాల్లో సుమారు 12 చోట్ల ఏసీబీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలతో పాటు బ్యాంకు ఖాతాలు, లాకర్లు, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. బొజ్జ జయరాజు గతంలో ములుగు జిల్లా మైన్స్ ఏడీగా పనిచేసిన సమయంలో ఇసుక, మట్టి క్వారీల వ్యవహారాల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏసీబీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న తనిఖీల్లో కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. అయితే సోదాలు ఇంకా కొనసాగుతున్నందున స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, ఆస్తుల విలువ తదితర పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. ఏసీబీ అధికారుల ప్రకటన అనంతరం ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.