AKSHARA SHAKTHI
Date of Publish : 02 September 2026, 2:33 pm Posted by : AKSHARA SHAKTHI

నాకు ఓపిక ఎక్కువ

* అందరి లక్ష్యం ప్రజలకు సేవ చెయ్యడమే
* క్రైమ్ రేటు తగ్గించడానికి కృషి
* మత్తు నియంత్రణలో సవాళ్లు ఉన్నాయి.
* ఏఐతో స్మార్ట్ సేవలు
* పనితోనే గుర్తింపు రావాలి
* డిజిటల్ మీడియా ప్రతినిధులతో సీపీ ఎన్. శ్వేత

అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి: వరంగల్‌ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చారిత్రాత్మక నేపథ్యం తో పాటు హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలో ప్రధాన నగరంగా ఉంది. ఒకవైపు అర్బన్‌ ప్రాంతం, మరోవైపు రూరల్‌ ప్రాంతాలు ఉండటంతో కమిషనరేట్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, దీనిని సంపూర్ణంగా అర్థం చేసుకొని పోలీస్, ప్రజల మధ్య మంచి సేవలు అందించేందుకు కృషి చేస్తానని పోలీస్ కమీషనర్ ఎన్. శ్వేత అన్నారు. తాను ఏ పని చేసినా చట్టాలకు లోబడే పని చేస్తానని, ఆ పనితోనే గుర్తింపు రావాలని అనుకుంటానని తన మనసులో మాటగా చెప్పారు. సహజంగానే నాకు ఓపిక ఎక్కువ ఉంటుంది అని ఇక్కడి పరిస్థితులను పూర్తిగా అర్ధం చేసుకొని ప్రజలకు న్యాయం చెయ్యడమే తన లక్ష్యం అని శ్వేత తెలిపారు. డిజిటల్ మీడియా యూనియన్ ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడిన పోలీస్ కమీషనర్, పోలీసింగ్ లక్ష్యాలు, శాంతి భద్రతలపై తన ఆలోచనలను పంచుకున్నారు.

*మత్తుపై ప్రత్యేక నిఘా…

నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలను పట్టిపీడిస్తున్న గంజాయిపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టినట్లు సీపీ వెల్లడించారు. మత్తు పదార్థాల వినియోగం, సరఫరాను అరికట్టేందుకు పోలీసులతో పాటు సమాజ భాగస్వామ్యాన్ని పెంచుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా మహిళా సంఘాల సహకారం తీసుకుంటున్నామని చెప్పారు. తల్లులుగా మత్తు పదార్థాల వల్ల కుటుంబాలు, యువతపై పడుతున్న ప్రభావాన్ని మహిళలకు బాగా అర్థమవుతుందని, అందుకే వారిని భాగస్వాములను చేస్తున్నామన్నారు. మహిళా సంఘాల సభ్యులకు ‘సంఘమిత్రలు’గా నామకరణం చేసి గంజాయి, ఇతర నేరాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తాజాగా జనగామలో జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించి, గంజాయికి అలవాటు పడిన వారిని గుర్తించడం, మత్తు పదార్థాల ప్రభావం, సమాజంలో జరుగుతున్న నేరాలపై వారికి అవగాహన కల్పించినట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాలు అందుబాటులో ఉండటంతో గంజాయి వినియోగం, సరఫరాపై క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించేందుకు ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

*రౌడీషీట్ ఓపెన్ చేస్తాం..

గంజాయి కేసుల్లో పదేపదే పట్టుబడుతున్న వారిపై నిఘా పెంచడంతో పాటు అవసరమైన చోట రౌడీషీట్లు ఓపెన్‌ చేస్తున్నట్లు సీపీ తెలిపారు. అయితే గంజాయి సరఫరాపై ప్రజల నుంచి పక్కా సమాచారం రావడం లేదన్నారు. ‘ఇక్కడ ఉందట.. వాళ్లు తాగుతున్నారట’ అనే సాధారణ సమాచారం కాకుండా, సరఫరా చేసే వ్యక్తులు, ప్రాంతాలు, వాహనాలు తదితరాలపై పక్కా సమాచారం అందిస్తే తక్షణమే దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

*సైబర్‌ క్రైం.. మిల్స్‌ కాలనీపై ప్రత్యేక దృష్టి

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ నేరాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని సీపీ శ్వేత తెలిపారు. సైబర్‌ కేసులను ప్రాపర్‌గా ఇన్వెస్టిగేట్‌ చేసి, బాధితులకు న్యాయం జరిగేలా కేసుల పరిష్కారంపై దృష్టి సారించామని చెప్పారు. మరోవైపు క్రైం ఇష్యూలు ఎక్కువగా నమోదవుతున్న మిల్స్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌పై ప్రత్యేక ఫోకస్‌ పెట్టినట్లు తెలిపారు. అక్కడ అదనపు ఎస్‌ఐని నియమించి క్రైం కంట్రోల్‌, పెట్రోలింగ్‌, నిఘాను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు.

*రౌడీయిజానికి నో ఛాన్స్‌

రౌడీయిజాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని సీపీ స్పష్టం చేశారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు అవసరమైన చోట చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. నగరంలోని కాలనీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల పనితీరుపైనా దృష్టి సారించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల నిర్వహణ, పనితీరును పరిశీలించే బాధ్యతను సంబంధిత పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలకు అప్పగించామని, కాలనీ సమావేశాలు నిర్వహించి కెమెరాలను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

*ట్రాఫిక్‌ నిరంతర ప్రక్రియ

వరంగల్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సీపీ తెలిపారు. ట్రాఫిక్‌ అనేది నిరంతరం ఉండే సమస్య అని, పోలీసుల చర్యలతో పాటు వాహనదారులు, ప్రజల సహకారం కూడా అవసరమన్నారు. ముఖ్యంగా యూటర్న్‌లు, ఫ్రీ లెఫ్ట్‌లు, రోడ్డు సేఫ్టీ అంశాలపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. కరుణాపురంలో వైన్స్‌కు పెద్ద పర్మిట్‌ రూమ్‌ ఉండటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఎక్సైజ్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మూడు యూటర్న్‌లను మూసివేసినట్లు తెలిపారు. దీంతో ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ సాఫీగా సాగుతోందన్నారు.

*శాఖల సమన్వయంతో చర్యలు…

ప్రజల భద్రత, పోలీసింగ్‌లో ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని సీపీ శ్వేత చెప్పారు. ట్రాఫిక్‌, ఫ్రీ లెఫ్ట్‌లు, ఫుట్‌పాత్‌ ఆక్రమణలు వంటి సమస్యలను ఒక్కసారిగా కాకుండా విడతల వారీగా పరిష్కరించుకుంటూ వెళ్తామన్నారు. పోలీసు శాఖ ఒక్కటే అన్ని సమస్యలను పరిష్కరించలేదని, మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఎక్సైజ్‌, రెవెన్యూ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే కార్పొరేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. అధికారులు చర్యలు తీసుకున్నా ప్రజల భాగస్వామ్యం లేకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యం కాదన్నారు.

*స్టేషన్ల వారీగా క్రైం మ్యాపింగ్‌….
కమిషనరేట్‌ పరిధిలోని ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో నమోదవుతున్న కేసుల స్వభావాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామని సీపీ తెలిపారు. మిల్స్‌ కాలనీ, మట్వాడ, ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో క్రైం కేసులు ఎక్కువగా ఉంటే, కేయూ, హసన్‌పర్తి ప్రాంతాల్లో భూ వివాదాలకు సంబంధించిన కేసులు అధికంగా నమోదవుతున్నాయని చెప్పారు. స్టేషన్‌ వారీగా క్రైం ప్యాటర్న్‌ను గుర్తించి, ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా నివారణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

*భూ వివాదాల్లో ఎస్‌ఓపీనే ప్రామాణికం

భూ సమస్యల పరిష్కారంలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం, పోలీస్‌ శాఖ రూపొందించిన ప్రత్యేక స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)ను పక్కాగా అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు సీపీ తెలిపారు. భూ వివాదాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా జోక్యం చేసుకోకుండా ఎస్‌ఓపీ ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు. తాను కూడా ఎస్‌ఓపీని తప్పనిసరిగా పాటిస్తానని, నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

*సాంకేతిక వినియోగం…

పరిపాలనా, పోలీసింగ్ పటిష్టత కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వినియోగానికి సన్నద్ధం గా ఉన్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయాలను బట్టి ఏఐ వంటి సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి ప్రజలకు విస్తృతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే వాట్సప్ ఎఫ్ఐర్ లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

*పేరు కంటే పని ముఖ్యం..

పోలీసు అధికారిగా తనకు పేరు, ఫేమ్‌ కోసం పనిచేయనని సీపీ శ్వేతారెడ్డి స్పష్టం చేశారు. చట్టాన్ని నమ్మి, దాని ప్రకారమే విధులు నిర్వర్తిస్తానన్నారు. తనకు చట్టపై నమ్మకం ఉందని, అలాగే శిక్ష పడే వరకు వేచి చూసే ఓపిక కూడా ఉందన్నారు. పోలీసింగ్‌ అంటే ప్రభావవంతంగా ఉండటంతో పాటు దాని ఫలితం ప్రజలకు కనిపించాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ప్రజలకు భద్రత కల్పించడం, నేరాలను నియంత్రించడం, సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం చూపించడంపైనే తన దృష్టి ఉంటుందని సీపీ వెల్లడించారు.