ఈఎస్ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎక్కడ..?
ఆస్పత్రిలో వైద్య సేవలు మృగ్యం
నెలకోసారి చుట్టుపుచూపుగా ఉన్నతాధికారి రాక
ఆస్పత్రి బాధ్యతలు ఓ వైద్యుడికి అప్పగించి ఆన్‌లైన్‌లో పర్యవేక్షణ
వైద్యులు విధులకు రాకున్నా వంద శాతం హాజరు
మొత్తం 10 మంది డాక్టర్లు.. విధుల్లో ఉండేది ఇద్దరే
నర్సులు, అటెండర్లతోనే ఆస్పత్రి నిర్వహణ..
మధ్యాహ్నం తర్వాత వారు కూడా గాయబ్
శస్త్రచికిత్సలన్నీ ఎంజీఎంకు రెఫర్..
ప్రశ్నార్థకంగా కార్మికుల ఆరోగ్య భద్రత
అక్షర శక్తి, నిఘా ప్రతినిధి : కార్మిక రాజ్య బీమా సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరంగల్ ఈఎస్ఐ ప్రాంతీయ వైద్యశాల నిర్వహణ గాడితప్పింది. ఆస్పత్రిని పర్యవేక్షించాల్సిన ఇన్‌చార్జి సూపరింటెండెంట్ కాంతి సాగర్ ఆస్పత్రికి క్రమం తప్పకుండా హాజరు కాకపోవడంతో పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తమైంది. వరంగల్ గొర్రెకుంట ఈఎస్ఐ ఆస్పత్రికి నెలకోసారి వచ్చి చుట్టుపుచూపుగా వెళ్లిపోతున్న సూపరింటెండెంట్ కాంతి సాగర్ ఆస్పత్రి బాధ్యతలను ఓ వైద్యుడికి అప్పగించి ఆన్‌లైన్‌లోనే పర్యవేక్షిస్తున్నారు. దీంతో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులపై నియంత్రణ లేకుండా పోయింది. విధులకు రాని వైద్యులు, సిబ్బందికి సైతం హాజరు రికార్డుల్లో వంద శాతం హాజరు నమోదవుతోంది. నెలనెలా ఉన్నతాధికారులకు మామూళ్లతో వ్యవహారం మేనేజ్ అవుతుండటంతో ఆస్పత్రి నిర్వహణపై ఎలాంటి పర్యవేక్షణ లేకుండా పోయింది. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించాల్సిన ఆస్పత్రిలో ప్రస్తుతం సాధారణ జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులకు గోలీలు ఇవ్వడం మినహా ప్రత్యేక వైద్య సేవలు అందడం లేదు. శస్త్రచికిత్స అవసరమైన రోగులను ఎంజీఎం ఆస్పత్రికి పంపిస్తున్నారు. ఈఎస్ఐ కార్డు ఉన్నా.. వైద్యం కోసం వచ్చిన రోగులకు ఎంజీఎంకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో ఈఎస్ఐ ఆస్పత్రి ఎందుకు? కార్మికుల నుంచి వసూలు చేస్తున్న బీమా సొమ్ము దేనికి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సూపరింటెండెంట్ పర్యవేక్షణ గాలికి..
ఆస్పత్రి నిర్వహణలో సూపరింటెండెంట్ పాత్ర అత్యంత కీలకం. వైద్యులు సమయానికి విధులకు వస్తున్నారా? రోగులకు వైద్య సేవలు అందుతున్నాయా? మందులు అందుబాటులో ఉన్నాయా? నర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారా? ఆస్పత్రిలో పారిశుద్ధ్యం, అత్యవసర సేవలు ఎలా ఉన్నాయి? అనే అంశాలను ప్రతిరోజూ పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ గొర్రెకుంట ఈఎస్ఐ ఆస్పత్రిలో ఈ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఇన్‌చార్జి సూపరింటెండెంట్ నెలకోసారి ఆస్పత్రికి వచ్చి చుట్టుపు చూపుగా పరిశీలించి వెళ్లిపోతున్నారు. ఆస్పత్రిలో రోజువారీ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రత్యక్ష తనిఖీలు చేయడం లేదు. ఆస్పత్రి బాధ్యతలను ఓ వైద్యుడికి అప్పగించి.. అక్కడి నుంచే ఆన్‌లైన్‌లో పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో సూపరింటెండెంట్ హాజరు, పర్యవేక్షణ, పరిపాలనా బాధ్యతలపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆస్పత్రికి అధికారి అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఎవరికి వారు విధులు నిర్వహిస్తున్నారు. రోగుల సమస్యలు వినే అధికారి లేకపోవడం, వైద్య సేవలపై ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్థ పనిచేయకపోవడం, సిబ్బంది హాజరును పరిశీలించే పర్యవేక్షణ లేకపోవడం రోజువారీ పరిస్థితిగా మారింది. ఆస్పత్రి నిర్వహణను ఓ వైద్యుడికి అప్పగించి సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నకు ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి.
10 మంది డాక్టర్లు.. విధుల్లో ఇద్దరే
ఈఎస్ఐ ప్రాంతీయ వైద్యశాలలో మొత్తం 10 మంది వైద్యులు విధులు నిర్వహించాల్సి ఉంది. కానీ ఆస్పత్రిలో ప్రతిరోజూ విధుల్లో కనిపించేది ఇద్దరు వైద్యులు మాత్రమే. మిగతా వైద్యులు విధులకు రాకున్నా హాజరు రికార్డుల్లో మాత్రం వంద శాతం హాజరు నమోదవుతోంది. వైద్యుల గైర్హాజరు కారణంగా రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. వైద్య పరీక్షలు సక్రమంగా జరగడం లేదు. రోగుల సమస్యలను పూర్తిగా తెలుసుకోకుండానే మందులు ఇచ్చి పంపిస్తున్నారు. వైద్య సేవల కోసం వచ్చే కార్మికులకు జ్వరం, జలుబు, సాధారణ నొప్పులకు మాత్రమే మందులు అందుతున్నాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నా, ప్రత్యేక వైద్యుడి అవసరం ఉన్నా, శస్త్రచికిత్స చేయాల్సి వచ్చినా ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. ఈఎస్ఐ ఆస్పత్రిలోనే అందాల్సిన వైద్య సేవలు అందకపోవడంతో కార్మికులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీమా సౌకర్యం ఉన్నప్పటికీ వైద్యం కోసం అదనపు ఖర్చులు చేయాల్సి వస్తోంది.
మధ్యాహ్నం తర్వాత నర్సింగ్ సిబ్బంది గాయబ్
వైద్యుల గైర్హాజరుతో పాటు నర్సింగ్ సిబ్బంది హాజరు కూడా సక్రమంగా లేదు. ఉదయం వేళ కొంతమంది నర్సులు ఆస్పత్రిలో కనిపించినా.. మధ్యాహ్నం తర్వాత సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. మధ్యాహ్నం తర్వాత ఆస్పత్రిలో ఇద్దరు అటెండర్లు, నలుగురు నర్సులు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. వారిలోనూ వారానికి ఒకసారి చొప్పున వంతుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగుల బాధ్యత నర్సులు, అటెండర్లపైనే పడుతోంది. ఇంజెక్షన్లు, డ్రెస్సింగ్, మందుల పంపిణీ, రోగుల పర్యవేక్షణ వంటి పనులను పరిమిత సిబ్బందే నిర్వహించాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో వైద్యుడు అందుబాటులో లేకపోవడం రోగులకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. సిబ్బంది కొరత ఉన్నా అదనపు నియామకాలు చేపట్టడం లేదు. విధులకు రాని సిబ్బందిపై చర్యలు తీసుకోకుండా హాజరు నమోదు చేయడం ఆస్పత్రి నిర్వహణలోని లోపాలను స్పష్టం చేస్తోంది.
హాజరు రికార్డులపై సమగ్ర విచారణ అవసరం
వైద్యులు, సిబ్బంది విధులకు రాకున్నా హాజరు రికార్డుల్లో వంద శాతం హాజరు ఎలా నమోదవుతోందనే ప్రశ్నకు సమాధానం లేదు. హాజరు పుస్తకాలు, బయోమెట్రిక్ వివరాలు, విధుల పట్టికలు, జీతాల బిల్లులను ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించాలి. విధులకు హాజరుకాని వారికి జీతాలు చెల్లించారా? హాజరు నమోదు చేస్తున్నది ఎవరు? సూపరింటెండెంట్ పర్యవేక్షణ లేకుండా రికార్డులు ఎలా నిర్వహిస్తున్నారు? అనే అంశాలపై విచారణ జరపాలి. ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వం, కార్మిక రాజ్య బీమా సంస్థ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి. ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. ఉదయం మాత్రమే కాకుండా మధ్యాహ్నం, రాత్రి వేళల్లోనూ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది హాజరును పరిశీలించాలి. సూపరింటెండెంట్ విధులకు హాజరవుతున్న తీరుపైనా విచారణ జరిపి బాధ్యతలు సక్రమంగా నిర్వహించే అధికారిని నియమించాలి. కార్మికుల ఆరోగ్య భద్రత కోసం ఏర్పాటు చేసిన ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్లక్ష్యానికి వదిలేయకుండా.. పూర్తిస్థాయి వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలి అని అంటున్నారు.