* సిబ్బందిపై ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ దాడులు
* జీతం అడిగినా, ప్రశ్నించినా కొట్టుడే
* ఇటీవల ఓ హాస్పిటల్ గార్డుపై దాష్టీకం
* కారులో తిప్పుకుంటూ దాడి, పైగా కేసు నమోదు?
* హద్దులు దాటుతున్న రంజిత్తులమారి ఆగడాలు
అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి: ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎస్4ఎస్ గూండాగిరి చేస్తోంది. సిబ్బందిపై రౌడీయిజం ప్రదర్శిస్తోంది. జీతం అడిగినా.. ప్రశ్నించినా.. కక్షగట్టి దాడులు చేస్తోంది. పైగా, బాధితులపైనే కేసులు కూడా బనాయిస్తూ దందా చేస్తోంది. ఇటీవల సదరు ఏజెన్సీ కింద ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న గార్డుపై దారుణంగా దాడికి పాల్పడింది. కక్షగట్టి, లేనిపోని ఆరోపణలు చేస్తూ.. కారులో తిప్పుకుంటూ కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరిగి.. బాదిత సిబ్బందిపైనే కేసు నమోదు చేయించిన రంజిత్తులమారి దందాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. అయినా.. నిబంధనలు పాటించకున్నా.. ఏజెన్సీని రెన్యువల్ చేయించకున్నా.. కేవలం అతికొద్ది సిబ్బంది పరిమితితో జిల్లా కార్మిక శాఖలో రిజిస్ట్రేషన్ పొంది, వందలమందిని నియమించుకొని, దారుణంగా దోపిడీ చేస్తున్నా.. చివరకు ఏజెన్సీని రెన్యూవల్ చేయించకుండా దందా చేస్తున్నట్లు బలమైన ఆరోపణలు వస్తున్నా.. సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
గార్డులను అతిహీనంగా చూస్తూ…
సెక్యూరిటీ గార్డుల జీవితాలతో ఆడుకుంటున్న S4S ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రతినిధుల మరో కోణం బహిర్గతం అయింది. జీతాలు తక్కువ ఇస్తూ, వారి చెమటను దోచుకోవడం తోనే ఆగలేదు. గార్డులను అతి హీనంగా చూస్తూ, హక్కులు అడిగితే ఉద్యోగం పీకేయడం, ఎదురు మాట్లాడితే చితకబాదడం వారి నైజం. మానవహక్కులు ఎగతాళి చేసేలా ఒక గార్డును కారులో తిప్పుతూ తీవ్రంగా కొట్టడం వరంగల్ నగరంలో సంచలనంగా మారింది. నిజంగా తాను తప్పు చేస్తే.. పీఎస్‌లో అప్పగించాల్సింది పోయి.. తనను అకారణంగా కొడుతూ.. తిడుతూ.. తిప్పారని, మరో ఏజెన్సీ నుంచి ఇందులోకి ఎందుకొచ్చావురా..అంటూ తిట్టారని తెలుస్తోంది. S4Sలో ఒక గూండాగిరి బ్యాచ్‌ను రంజిత్తులమారి మేపుతూ ఈ ఆగడాలకు పాల్పుడుతున్నాడని, దీనికి కొంత మంది పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గార్డుపై దాష్టీకం…
వరంగల్ నగరంలో ఒక “వెల్” నోటెడ్ ఆసుపత్రిలో జరిగిన ఘటన దిగజారిన సామాన్య మానవుని హక్కుల ఘటనగా మిగిలిపోతుంది. గత శనివారం ఒక ఆసుపత్రిలో సూపర్వైజర్ గా పని చేస్తున్న సెక్యూరిటీ గార్డ్ ఆసుపత్రి ఆయమ్మతో అమర్యాదగా ప్రవర్తించాడని, దూషించాడని ఆరోపిస్తూ.. గార్డ్ పై సదరు ఏజెన్సీ గూండాగిరి బ్యాచ్ దాడికి పాల్పడింది. అమానవీయంగా ప్రవర్తించింది. సదరు గార్డ్ ను కారులో తిప్పుతూ మూడు గంటల పాటు నరకం చూపించారు. పైగా బూతుల పురాణం విప్పారు. దాహం వేస్తున్నా నీళ్ళు ఇవ్వకుండా దారుణంగా హింసించారని తెలిసింది. వారు కొట్టిన దెబ్బలకు గార్డ్ చెయ్యి విరిగింది. హన్మకొండ అదాలత్, సుబేదారి ప్రాంతంలో తిప్పుతూ మాటలతో, చేతలతో హింసించారు అని తెలిసింది. పైగా పోలీసులు అంతా మనవాళ్ళే….నేను చూసుకుంటా అని రంజిత్తులమారి అభయం ఇస్తున్నాడట. పైగా, మట్టేవాడ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేయించినట్లు సమాచారం.
కొట్టడానికో బ్యాచ్…
మాకు ఈపీఎఫ్, ఈఎస్ఐ కూడా కట్టడం లేదు… కనీసం జీతం అయినా సరిగా ఇవ్వండి అని అడిగడమే వారు చేసిన మహాపాపం. మాట్లాడుదాం.. అని, ఇంటికి రమ్మని పిలిచి, కొట్టాడని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ బాధితులు పోసులకు ఫిర్యాదు చెయ్యడానికి భయపడుతున్నారు. వారితో పెట్టుకుంటే ఉన్న ఉద్యోగం కూడా పోతుందని అంటున్నారు. ఇదే బలహీనత చూసుకొని చాలా మంది గార్డులను ఏజెన్సీ నిర్వాహకులు రంజిత్తులమారి మోసం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. దీనికి కొంత మంది పోలీసుల పేరు చెప్పి రంజిత్తులమారి బెదిరింపులకు పాల్పడుతున్నాడని సమాచారం. కార్మికుల శ్రమ దోపిడీ, బెదిరించడం, కొట్టడంలో ఈ బ్యాచ్ ఆరితేరింది. ఐతే కొన్ని విషయాలు పోలీసులకు తెలిసినా చర్యలు తీసుకోలేదని తెలుస్తున్నది. వీరికి మట్టేవాడ, సుబేదారి, హన్మకొండ పోలీస్ స్టేషన్ లలో కొందరు పోలీసుల సహకారం ఉందని, దీనితో ఇష్టారాజ్యంగా దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.