మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొ.జయశంకర్ పేరుపెట్టాలని డిమాండ్
తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు పోతున్నాయి
ఉద్యోగాలు మనవే.. కానీ మార్కులు వేసేది ఆంధ్రావాళ్లు
తెలంగాణ అస్తిత్వమే ప్రశ్నాకర్థంలో పడింది
తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ వీరమళ్ల ప్రకాష్
ఓబీసీ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో
తెలంగాణ అస్తిత్వ వేదిక రాష్ట్రస్థాయి సమావేశం
అక్షరశక్తి, హనుమకొండ : తెలంగాణలో స్వయం పాలన పోయి.. పరాయి పాలన వచ్చిందని, రాష్ట్రo మనదే అయినా.. పాలన మాత్రం అంధ్రా కనుసన్నల్లోనే జరుగుతోందని తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ వీరమళ్ల ప్రకాష్ అన్నారు. ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ అస్తిత్వ వేదిక రాష్ట్రస్థాయి సమావేశాన్ని శుక్రవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని మాస్టర్ జీ డిగ్రీ& పీజీ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించారు… ముఖ్యఅతిథిగా తెలంగాణ ఆస్తిత్వ వేదిక చైర్మన్ వి. ప్రకాష్, విశిష్ట అతిథి తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కారం రవీందర్ రెడ్డి, అతిథులుగా సమన్వయకర్త శ్రీధర్ దేశ్ పాండే పాల్గొన్నారు..ముందుగా మహాత్మగాంధీ, ప్రొఫెసర్ జయశంకర్, నల్ల నరసింహులు చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు…ఈ సందర్భంగా ప్రజా కళాకారుడు, ఉపాధ్యాయ సాహితీవేత్త, జీవిత సాఫల్య పురస్కార గ్రహీత వల్లంపట్ల నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు. అనంతరం తెలంగాణ అస్తిత్వ పరిరక్షణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ ప్రకాష్ రావు మాట్లాడుతూ… కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పాలన మనదే అయినా వెనుక ఉండి నడిపిస్తున్నది చంద్రబాబు నాయుడేనని, అందుకే రాష్ట్రానికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయని అన్నారు. ఇదివరకు పాలనాపరంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే సెక్రటేరియట్ లోనే అన్నీ జరిగిపోయేవని, కానీ ఇప్పుడు ఢిల్లీ నుంచో అమరావతి నుంచో అనుమతి తీసుకోవాల్సి వస్తోంద్నారు. సమైక్య రాష్ట్రంలో, ఉద్యమ సమయంలో జరిగినట్లే ఇప్పుడు రాష్ట్రంలో జలదోపిడీ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతున్నారని, గద్వాల పక్కనున్న జూరాల ప్రాజెక్టు నీళ్లను తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాల్సిందిపోయి పోతిరెడ్డిపాడు ద్వారా నెల్లూరు జిల్లాలోని కండలేరు, సోమశిల ప్రాజెక్టులు నింపారన్నారు. చిత్తూరు, అనంతపురం, ఒంగోలు జిల్లాల్లోని రిజర్వాయర్లు నింపారన్నారు. కోస్తా, రాయలసీమ ప్రాజెక్టులు నింపడానికి మహబూబూబ్ నగర్ నుంచి నీళ్లు తీసుకెళ్తుంటే.. పాలమూరు బిడ్డ, సీఎం రేవంత్ రెడ్డి ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కృష్ణా నీళ్లు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు రాకుండా కుప్పం వరకు ఎలా వెళ్లాయో చెప్పాలన్నారు. కేసీఆర్ హయాంలో కూడా రాష్ట్రానికి కష్టాలుండేవని, కానీ ఆ కష్టాలకంటే ఆయన ఇచ్చిన సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కేసీఆర్ ఆత్మహత్యలు ఆపడంతో పాటు ఇంటింటికీ నీళ్లు, రైతులు, పరిశ్రమలకు కరెంట్ ఇచ్చాడని, ఎన్ కౌంటర్లు ఆపాడని చెప్పుకొచ్చారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక సీన్ రివర్స్ అయ్యిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి అపరిపక్వత, అనుభవం లేమి, చంద్రబాబు ఆదేశాలను ఫాలో అవడం వల్ల తెలంగాణకు న్యాయం చేయలేకపోతున్నాడని అన్నారు. తెలంగాణ నుంచి వెళ్తున్న నీళ్లతో విజయవాడ, రాజమండ్రిలో బంగారు పంటలు పండుతుంటే.. తెలంగాణలో మళ్లీ ఆత్మహత్యలు స్టార్ట్ అయ్యాయని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనే విషయం స్పష్టమవుతోందన్నారు.

మేడిగడ్డను పేల్చేశారని చెబితే ఎవరూ నమ్మలేదు
కాళ్వేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డను బాంబులతో పేల్చేశారని తాను చెబితే ఎవరూ నమ్మలేదని వి.ప్రకాష్ అన్నారు. 2024 జనవరిలో పెద్దపల్లి సమీపంలోని హుస్సేన్ మియా వాగుపై చెక్ డ్యాంలు పేల్చేస్తున్న కాంగ్రెస్ నాయకులను రైతులు రెడ్ హ్యాండెడ్ గా పట్టించారని, ఇంతవరకు దానిపై ఎలాంటి చర్యలు లేవన్నారు. 2026లో మానేరుపై రెండు బ్యారేజ్ లు పేల్చేశారని, సంబంధిత ఈఈ కూడా వాటిని పేల్చేశారని చెప్పినట్లు గుర్తు చేశారు. కానీ అక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు కేసీఆర్ నాసిరకంగా కట్టడం వల్లే కూలిపోతున్నాయని చెబుతున్నారని, వరదలే లేనప్పుడు బ్యారేజీలు ఎలా కూలుతాయని ప్రశ్నించారు. మేడిగడ్డ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం పుణెలోని సీడబ్ల్యూవోపీఆర్ఎస్ అనే ప్రముఖ సంస్థకు అప్పగించిందని, వారు కూడా అన్నీ బ్యారేజీలు, పిల్లర్లు బాగున్నాయని, కేవలం 4 పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్నాయని చెప్పారన్నారు. బాంబులు పెట్టడం వల్లే ఆ నాలుగు పిల్లర్లు దెబ్బతిన్నాయన్నారు. ఎన్ డీఎస్ఏ, ఎన్జీఆర్ఐ, విజిలెన్స్, ఇతర కమిటీలు మేడిగడ్డను పరిశీలించాయని, కానీ పిల్లర్లు ఎందుకు కుంగాయనేది ఏ ఒక్క రిపోర్ట్ లో ఎవరూ రాయలేదని చెప్పారు. వరంగల్ నిట్, బాంబే ఐఐటీ ఇంజినీర్లు సర్వే చేసి కారణాలు ఏంటనేది ఇంతవరకు తేల్చలేదన్నారు. మేడిగడ్డలో నాలుగు పిల్లర్లను కట్టకుండా కాంగ్రెస్ నాయకులు కథలు చెబుతున్నారని మండిపడ్డారు.

ఎయిర్ పోర్టుకు జయశంకర్ పేరుపెట్టాలి
వరంగల్ ఎయిర్ పోర్టుకు జయశంకర్ సార్ పేరు పెట్టాలని తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ వి.ప్రకాష్ డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వ వేదిక పోరాటం చేసే వ్యక్తులకు గురువులా ఉంటుందని, తెలంగాణ అస్తిత్వ పోరాటానికి ఓరుగల్లు నాయకత్వం వహించాలన్నారు. రామప్ప ఆలయాన్ని కాపాడుకునేందుకు అస్తిత్వ వేదిక ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు……గద్దర్, జయశంకర్ విగ్రహాలు ఆంధ్రాలో పెట్టనిస్తరా..?
తెలంగాణ అస్తిత్వం మళ్లీ ప్రశ్నార్థకంగా మారిందని, ప్రత్యేక రాష్ట్రం వచ్చినా అన్ని రంగాల అభివృద్ధి జరగలేదని ఓబీసీ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఆంధ్రా పాలకులు, నేతల విగ్రహాలు పుట్టుకొస్తున్నాయని, అమరావతి నుండి ఆదేశాలు వస్తే, వాళ్ల విగ్రహాలు పెడుతున్నారన్నారు. మరి తెలంగాణ గద్దర్, జయశంకర్ సార్ విగ్రహాలు ఆంధ్రాలో పెట్టనిస్తరా.. అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే గద్దర్, జయశంకర్ సార్ విగ్రహాన్ని విజయవాడలో పెట్టించాలని డిమాండ్ చేశారు. పాలకులు మనవాళ్ళయినా, నడిపించేది ఆంధ్రావాళ్లేనని విమర్శించారు. మన వనరులు మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన స్పూర్తితో అస్తిత్వ వేదిక పనిచేస్తుందని, .వరంగల్ నుండే తెలంగాణ అస్తిత్వ పోరాటం మొదలవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ కల్చర్ ను దుర్మార్గంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, మన అస్తిత్వాన్ని, మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ వనరులు దోపిడీ
తెలంగాణ వనరులు దోపిడీకి గురవుతున్నాయని తెలంగాణ ఆస్తిత్వ వేదిక సమన్వయకర్త శ్రీధర్ దేశ్ పాండే అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉద్యమకారుల ఆలోచనతో రూపుదిద్దుకుందని, కానీ ఆ విగ్రహాంతో పాటు తెలంగాణ గేయం వాణిని మార్చేశారన్నారు. తెలంగాణ రానివ్వనని ప్రమాణం చేసిన రోశయ్య విగ్రహాలు రాష్ట్రంలో పెట్టారని, రైతాంగానికి గోదావరి నీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కృష్ణా జలాలను సైతం ఆంధ్రాకు వదిలేస్తున్నారని, తెలంగాణ వచ్చిందనే తప్ప, వనరుల దోపిడీ పెరిగిపోయిందన్నారు. మేడిగడ్డ గేట్లు రిపేర్లు చేయకుండా కావాలనే నీళ్లను వృథాగా వదులుతున్నారని విమర్శించారు.
తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోంది
తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోందని టీఎన్జీవోస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాధించుకోవడమే లక్ష్యం కాదని, అన్ని రంగాల సమాన అభివృద్ధి కోరుకున్నామన్నారు. పాలకులు మారినా, తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోందని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణను, మేము ఇచ్చిన తెలంగాణ అని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. వరంగల్ లో మాస్టర్జీ కళాశాలలు ఉద్యమానికి కేంద్రంగా ఉందని, తెలంగాణ పోరాట చరిత్రను మార్చే కుట్ర జరుగుతోందని, తమ ఆస్తులను కాపాడుకునే పనుల్లో పాలకులు ఉన్నారన్నారు. తెలంగాణ అస్తిత్వ వేదిక పోరాటానికి సిద్ధమవుతోందని, వరంగల్ నుండే తెలంగాణ అస్తిత్వ పోరాటం మొదలవుతుందని తేల్చిచెప్పారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అస్తిత్వ వేదిక రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవీందర్, ఓబిసి ప్రధాన కార్యదర్శి, ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, సీనియర్ జర్నలిస్ట్ బుచ్చన్న, రాష్ట్ర గెజిటెడ్ వైస్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర సలహాదారులు గంగాపురం వేణుమాధవ్, డాక్టర్ జేఏసీ నాయకులు నాగేంద్రబాబు, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్, గుల్లపల్లి చిరంజీవి, వద్దిరాజు గణేష్, తాడిశెట్టి క్రాంతి, కొక్కొండ విజయబాబు,రాచకొండ ప్రవీణ్, డాక్టర్ శ్రీరామ్ శ్యామ్, డాక్టర్ పాలమాకుల కొమరయ్య, డాక్టర్ వోడితల రాము, రావుల రాజకుమార్, గుండేటి చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.