AKSHARA SHAKTHI
Date of Publish : 02 October 2026, 1:02 pm Posted by : AKSHARA SHAKTHI

తలొంచి కాదు.. ఎదిరించి బతికిన!

– ఉద్యమానికి కరదీపికనైన నేను.. అధికారంలో భాగస్వామ్యానికి పనికిరానా?

– మ్యాజిక్ షోలే నాలో బిడియాన్ని పోగొట్టి ప్రజాక్షేత్రంలో నిలబెట్టాయి

– కోర్టులో నాడు కుల వివక్షను ఎదిరించా.. న్యాయవాదిగా పేదల పక్షాన నిలిచా..

– కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ఉద్యమ కేసులను పైసా తీసుకోకుండా వాదించా

– పార్టీ ఆవిర్భావ దినాన టీఆర్‌ఎస్‌లో చేరిన మొట్టమొదటి న్యాయవాదిని నేనే..

– నా నాయకత్వ పటిమను చూసి ఓర్వలేక.. కుట్రలతో నన్ను అధికారానికి దూరం చేశారు

– 9ఏళ్ల పాలనలో నాకు దక్కింది శూన్యం.. నమ్ముకున్న ఉద్యమకారులకు ద్రోహం

– వరంగల్ జిల్లా చారిత్రక అస్తిత్వాన్ని, పోరాట పటిమను దెబ్బతీశారు

– ఓదార్పు యాత్రలో తెలిసిన చేదు నిజం.. ఉద్యమకారుల కుటుంబాల్లో ఏమాత్రం సంతోషం లేదు!

– తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ళ రవికుమార్

– తెలంగాణ డిజిట‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌తో చిట్‌చాట్‌

అక్షరశక్తి, వరంగల్ ప్రతినిధి : “తలొంచుకొని బతకలేదు.. ఎదురించి బతికిన. నిరంతర సంఘర్షణ నుంచి వచ్చినవాడిని. నా ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టలేదు. ఆత్మాభిమానాన్ని చంపుకొని అవకాశాల కోసం పాకులాడలేదు. అణిచివేతలను, అసమానతలను ధైర్యంగా ఎదిరించి ప్రశ్నించడం వల్లే సమాజంలో ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందాను. ఉద్యమానికి కరదీపికలా పనికొచ్చిన నాలాంటి వాళ్లం.. స్వరాష్ట్రం సిద్ధించాక అధికారంలో భాగస్వామ్యానికి పనికిరాలేదా? తొమ్మిదేళ్ల పాలనలో ఉద్యమకారుల బతుకులు అంధకారమయ్యాయి. అందుకే మలిదశ ఉద్యమానికి నడుం బిగించాం” అని స్పష్టం చేశారు ప్రముఖ న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్. తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక చిట్‌చాట్‌లో ఆయన తన బాల్యం, విద్యార్థి దశ, న్యాయవాద ప్రస్థానం, ఉద్యమ అనుభవాలు మరియు సమకాలీన రాజకీయాలపై మనసు విప్పి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

పోరాటాల గడ్డపై జననం.. సమాజమే నా పాఠశాల

మాది వరంగల్. నేను పుట్టింది వరంగల్‌లోనే అయినా, పెరిగింది మాత్రం రంగంపేటలో. అమ్మానాన్నలు గుడిమళ్ళ పుష్పలీల – రాఘవేందర్‌రావులది ఆదర్శ కులాంతర ప్రేమవివాహం. అమ్మ ఎంజీఎంలో నర్సుగా బాధ్యతలు నిర్వర్తిస్తే, నాన్న ఫార్మసిస్ట్‌గా పనిచేశారు. సమాజంలో తీవ్ర వివక్షకు గురైన దళిత, బడుగు బలహీన వర్గాల మధ్య పెరిగాను. వరంగల్‌‌లో చదివి, ఎస్వీ యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశాను. చిన్నతనం నుంచే సామాజిక స్పృహ మెండుగా ఉండేది. 1982లో దాదాపు 120 మంది మిత్రులతో కలిసి ‘మూన్‌లైట్ యూత్’ ఏర్పాటు చేసి వ్యాయామశాల నడిపాం. ఆ తర్వాత 1994లో ‘నవచైతన్య అసోసియేషన్’ పేరిట యువత ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాం; అప్పటి కలెక్టర్ శాలినీ మిశ్రా దానిని ప్రారంభించారు. మహిళా పాలిటెక్నిక్ విద్యార్థినులకు ఎలాంటి ఆకతాయిల వేధింపులు లేకుండా రక్షణగా నిలవడం, వరదలు వచ్చినప్పుడు సహాయక చర్యల్లో పాల్గొనడం వంటి సామాజిక సేవలు అందించాం.

మ్యాజిక్ షోలే నా టర్నింగ్ పాయింట్

మెజీషియ‌న్ ఉమాపతి వద్ద మేజిక్ నేర్చుకున్నాను. వందలాది ప్రదర్శనలు ఇచ్చాను. అది నా జీవితానికే పెద్ద టర్నింగ్ పాయింట్. పది మంది ముందుకు వచ్చి ప్రదర్శన ఇవ్వడం వల్ల నాలో బిడియం, భయం పూర్తిగా పోయాయి. సమాజంలోని విభిన్న వర్గాల మనస్తత్వాలు, సమస్యలపై సమగ్ర అవగాహన ఏర్పడింది. ధైర్యంగా మైకు పట్టి గళమెత్తే వాగ్ధాటి, నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. మండల్ కమిషన్ పోరాటాల్లోనూ చురుగ్గా పాల్గొన్నాను.

నెత్తురోడిన నేలను చూసి రగిలిన గుండె

1980–2000 కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నక్సలైట్ ప్రాబల్య ప్రాంతంగా ఉండేది. ఎక్కడ చూసినా రక్తపాతమే. నిత్యం ఎన్‌కౌంటర్లు, మందుపాతరల పేలుళ్లు, అమాయకుల మరణాలు నా హృదయాన్ని తీవ్రంగా కలచివేశాయి. ఈ నెత్తుటి ధారలకు ప్రధాన కారణం తెలంగాణ తీవ్ర వెనుకబాటుతనమేనని బలంగా గ్రహించాను. ఈ రక్తసిక్త తెలంగాణ శాంతియుత, ప్రజా తెలంగాణగా మారాలంటే ప్రత్యేక రాష్ట్ర సాధన ఒక్కటే మార్గమని నమ్మాను. రాష్ట్ర ఆవశ్యకతను లోతుగా అధ్యయనం చేయడానికి 1988–90 నుంచే ప్రయత్నించాను. ఆ క్రమంలోనే రామన్నపేటలోని ఆర్యవైశ్య సత్రంలో జరిగిన ‘తెలంగాణ ప్రజా సమితి’ సదస్సుకు హాజరయ్యాను. నా అదృష్టం కొద్దీ ఉద్యమ ప్రస్థానంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు, గాంధేయవాది భూపతి కృష్ణమూర్తి, ఆచార్య బి. జనార్ధన్ రావు, ఆచార్య కూరపాటి వెంకటనారాయణ వంటి మహామహులతో కలిసి ఉద్యమ వేదికలను పంచుకునే అరుదైన గౌరవం దక్కింది.

కోర్టులో కుల వివక్షపై తిరుగుబాటు

1995లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించినప్పుడు కోర్టు సముదాయంలో తీవ్రమైన వర్గ పోరాటంతో (Class Struggle) పాటు కుల వివక్షను (Caste Struggle) సైతం ఎదుర్కొన్నాను. వకాలత్ అనేది కొద్దిమంది ఆధిపత్య వర్గాల గుప్పిట్లోనే బందీగా ఉండేది. కానీ నేను ఎక్కడా తలదించలేదు. చట్టాలపై పూర్తి పట్టు, ఆంగ్ల-హిందీ భాషా నైపుణ్యం ఉండడం వల్ల నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను. ‘మెజీషియన్ రవికుమార్’ కాస్తా ‘అడ్వకేట్ గుడిమళ్ళ రవికుమార్‌గా గుర్తింపు పొందారు. క్రాస్ ఎగ్జామినేషన్‌లో తిరుగులేని వాదనలతో 99.9 శాతం కేసులు గెలిచాను. వందలాది మంది పేదలకు, ఉద్యమకారులకు పైసా తీసుకోకుండా ఉచితంగా వాదించాను. 1998లో ‘యువ న్యాయవాదుల సంఘం’ ఏర్పాటు చేసి వారిలో వృత్తి నేపుణ్యాన్ని పెంపొందించే సభలు, సమావేశాలు, సెమినర్స్ నిర్వహించం.

జలదృశ్యంలో తొలి న్యాయవాదిని..

1998-99 ప్రాంతంలో కొత్త పార్టీ అవసరాన్ని జయశంకర్ సార్ వద్ద ప్రస్తావించినప్పుడు, కేసీఆర్ కూడా ఉద్యమబాట పడుతున్నారని సార్ చెప్పారు. అలా 2001లో కేసీఆర్ నేతృత్వంలో పార్టీ ఆవిర్భవించిన నాడు, హైదరాబాద్ జలదృశ్యంలో ఏడుగురు లాయర్లతో కలిసి గులాబీ కండువా కప్పుకున్న మొట్టమొదటి న్యాయవాదిని నేనే. పార్టీలో నన్ను ఒక స్టాక్ లీడర్‌గా వినియోగించుకున్నారు. ఎక్కడ అత్యవసరమైనా నన్ను పిలిచేవారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులతో పాటు ఎందరో ముఖ్య నేతలపై నమోదైన కేసులను నయాపైసా తీసుకోకుండా వాదించి బెయిళ్ళు ఇప్పించాను. కేసీఆర్ స్వయంగా వరంగల్ కోర్టుకు వచ్చినప్పుడు పూర్తి బాధ్యత నాపైనే ఉంచారు.

ప‌ల్లెప‌ల్లెనా తిరిగిన‌…

యువజన విభాగం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా రాత్రింబవళ్ళు పనిచేశాను. పల్లెపల్లెనా పార్టీ జెండాలు పాతాను, గద్దెలు కట్టించాను. ఉమ్మడి జిల్లాలోని సుమారు 50 వేల మంది ఆటోడ్రైవర్లను ‘తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్’ కింద ఏకం చేసి ఉద్యమంలోకి నడిపించాను. పూల వర్తకులను ఐక్యం చేశాను. స్వరాష్ట్రం సిద్ధించాక టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రతిపాదన వచ్చినప్పుడు, కేసీఆర్ సమక్షంలోనే ఆ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో నేను ముందున్నాను.

కుట్రలతో నన్ను అధికారానికి దూరం చేశారు

పార్టీ కోసం అన్నీ ధారపోసిన నాకు వరంగల్ ఎంపీ టికెట్ దాదాపు ఖరారైంది. నాకున్న చట్ట పరిజ్ఞానం, వాగ్ధాటి, భాషా నైపుణ్యం ఢిల్లీ వేదికగా ఉపయోగపడుతుందని కేసీఆర్ భావించారు. అయితే, బీఆర్‌ఎస్‌లోని కొంతమంది కుహానా ఉద్యమకారులు నా ప్రతిభ (Caliber), సామర్థ్యం (Capability), నిబద్ధత (Conviction), ఆత్మవిశ్వాసం (Confidence), నాయకత్వ లక్షణాలను (Leadership) చూసి ఉలిక్కిపడ్డారు. గుడిమళ్ల రవికుమార్ గెలిచి వస్తే తమ రాజకీయ మనుగడకే ప్రమాదమని భయపడి, కేసీఆర్‌కు తప్పుడు నివేదికలు ఇచ్చి తీవ్ర కుట్రలు పన్ని చివరకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు. ఉద్యమానికి కరదీపికలా పనికొచ్చిన నన్ను ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యానికి పనికిరాకుండా చేశారు. గడచిన తొమ్మిదేళ్ల పాలనలో పార్టీ నుంచి నాకు దక్కింది ఒక్క పైసా లేదు. చేసిపెట్టిన ఒక్క పని లేదు. నన్ను నమ్మి, నా ప్రేరణతో పార్టీలోకి వచ్చిన వందలాది మంది కార్యకర్తలు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురయ్యారు. తెలంగాణ కోసం సర్వస్వం త్యాగం చేసిన మేము, చివరకు మా మలి అస్తిత్వం కోసం మళ్లీ పోరాడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.

వరంగల్ ఆత్మను చంపేశారు

తెలంగాణ ఉద్యమాల్లో గర్జించిన చారిత్రక ఓరుగల్లు గడ్డ స్వరాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ దారుణంగా వెనుకబడిపోయింది. హైదరాబాద్ తర్వాత రెండో రాజధాని కేవలం మాటలకే పరిమితమైంది. కొందరు స్వార్థపరుల రియల్ ఎస్టేట్, ఆర్థిక ప్రయోజనాల కోసం జిల్లాను విచక్షణారహితంగా ముక్కలు చేశారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు జిల్లా అభివృద్ధికి నిధులు రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. అధిష్టానం వద్ద మోకరిల్లడంలో, కాళ్ళు మొక్కడంలోనే పోటీపడ్డారు తప్ప ప్రజల గొంతుకగా నిలవలేదు. వరంగల్ తన సహజ పోరాట పటిమను, ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయేలా పాలకులు దెబ్బతీశారు.

ఉద్యమకారుల ఓదార్పు యాత్ర..

తెలంగాణ సాధన కోసం ప్రాణాలను, భవిష్యత్తును త్యాగం చేసిన ఉద్యమకారుల కుటుంబాలు నేడు వీధిన పడ్డాయి. అందుకే ‘తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక’ ఆధ్వర్యంలో రంగంలోకి దిగాం. 2026 సెప్టెంబర్ 17న వరంగల్ నగరంలో తొలిదశ ఉద్యమ అమరవీరుల స్తూపం సాక్షిగా ఉద్యమకారుల మొదటి విడత ‘ఓదార్పు యాత్ర’ ప్రారంభించాను. 4 రోజుల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సాగిన ఈ యాత్రలో 126 మంది ఉద్యమకారుల కుటుంబాలను స్వయంగా కలిసి వారి స్థితిగతులను అధ్యయనం చేశాం. ఆ పర్యటనలో నన్ను కలచివేసిన చేదు నిజం ఏమిటంటే… మేము కలిసిన ఆ 126 కుటుంబాలలో ఒక్క కుటుంబం ముఖంలో కూడా ‘తెలంగాణ వచ్చింది’ అన్న ఇసుమంత సంతోషం కనిపించలేదు. రక్తమోడ్చి స్వరాష్ట్రాన్ని సాధించిన ఉద్యమకారులు ఇంతటి దుర్భర దారిద్య్రంలో, తీవ్ర నిరాశలో జీవించడం స్వరాష్ట్రానికే తీరని దౌర్భాగ్యం.

మా పోరాటం ఆగదు.

ఉద్యమకారుల హక్కుల సాధన కోసం మా పోరాటం ఆగదు. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల నివాస స్థలం, రూ.10 వేల కోట్లతో సంక్షేమ కార్పొరేషన్, బాధిత కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ఐక్యవేదిక పక్షాన గళమెత్తుతూనే ఉంటాం. తలొంచే ప్రసక్తే లేదు.. తెలంగాణ ఆకాంక్షలు నిజమయ్యే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం..