AKSHARA SHAKTHI
Date of Publish : 05 October 2026, 3:37 pm Posted by : AKSHARA SHAKTHI

మా ల‌క్ష్యం.. జన తెలంగాణ

– ప్రజా సమస్యలే ఎజెండా.. విద్య, వైద్యం, ఉపాధిపై పోరాటం

– తెలంగాణ ఆకాంక్ష‌లు నెర‌వేర‌లేదు.. పాల‌కులు క‌మీష‌న్ ఏజెంట్లుగా మారారు

– కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక

– ఉమ్మ‌డి జిల్లాల కేంద్రంగా స‌న్నాహ‌క స‌మావేశాలు పెడుతున్నాం..

– ప్రజాస్వామికవాదులందరినీ కలుపుకొంటాం

– రెండు మూడు నెలల్లో పార్టీ పేరు ఖరారు

– పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేస్తున్నాం.

– మాజీ మావోయిస్టు నేత‌, తెలంగాణ ఉద్య‌మకారుడ‌ లంకా పాపిరెడ్డి

– తెలంగాణ డిజిటల్‌ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ఒకవైపు స్వాతంత్య్రోద్యమ నేపథ్యం ఉన్న కుటుంబం.. మరోవైపు చిన్నతనం నుంచే వామపక్ష భావజాల ప్రభావం.. అన్న మురళీమోహన్‌రెడ్డి అడుగుజాడల్లో ఉద్యమ బాట.. 14 ఏళ్ల ప్రాయంలోనే అండర్‌గ్రౌండ్‌ జీవితం.. అత్యవసర పరిస్థితుల సమయంలో జైలు జీవితం.. అనంతరం పీపుల్స్‌వార్‌ ఉద్యమంలో దళసభ్యుడి నుంచి సెంట్రల్‌ కమిటీ సభ్యుడి వరకు వివిధ బాధ్యతలు.. అనారోగ్య కారణాలతో 2008లో జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీల భాగస్వామ్యం.. ఇప్పుడు అదే ఉద్యమ నేపథ్యం నుంచి మరో రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నట్లు మాజీ మావోయిస్టు నేత, తెలంగాణ ఉద్యమకారుడు లంకా పాపిరెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజలు ఆశించిన మార్పు పూర్తిస్థాయిలో రాలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ప్రజల మౌలిక సమస్యలైన విద్య, వైద్యం, ఉపాధిని కేంద్రంగా చేసుకుని కొత్త రాజకీయ వేదికను నిర్మించనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రజాస్వామిక పద్ధతిలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నామని, తెలంగాణను లక్ష్యంగా చేసుకుని ‘జన తెలంగాణ’ దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామని, ప్రజాస్వామికవాదులు, వివిధ వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. తెలంగాణ డిజిటల్‌ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో లంకా పాపిరెడ్డి తన ఉద్యమ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమ అనుభవాలు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు లక్ష్యాలు, భవిష్యత్‌ కార్యాచరణపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ వివ‌రాలు ఆయ‌న మాట‌ల్లోనే…

నాన్న స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు

మాది దామెర మండ‌లం త‌క్క‌ళ్ల‌పాడు. పుట్టి పెరిగింది వ‌రంగ‌ల్ ఆజంజాహి మిల్స్ కాల‌నీ ప‌క్క‌న ఉన్న‌ గాంధీన‌గ‌ర్‌. అమ్మానాన్న ల‌క్ష్మీకాంతం – అనంత‌రెడ్డి. నాన్న స్వాతంత్య్ర‌స‌మ‌ర‌యోధుడు. ఆనాడు విద్యార్థి ద‌శ‌లోనే స్వాతంత్య్ర ఉద్య‌మంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ద‌గ్గ‌ర‌గా ఉండేవారు. కానీ, మా చిన్న పెద్ద‌నాన్న క‌మ్యూనిస్టు. క‌మ్యూనిస్టు భావ‌జాలంతో ఉండేవారు. కాంగ్రెస్ నుంచి మా నాన్న‌, క‌మ్యూనిస్టుల నుంచి చిన్న‌పెద్ద‌నాన్న ఇద్ద‌రూ ఆంధ్ర‌మ‌హాస‌భ‌లో ఉన్నారు. మేము ముగ్గురు అన్న‌ద‌మ్ములం. నాతోపాటు పెద్ద‌న్న ముర‌ళీమోహ‌న్‌, త‌మ్ముడు. నేను వ‌రంగ‌ల్‌లోనే వాణినికేత‌న్ స్కూల్‌లో 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకున్నాను. మాది వ్య‌వ‌సాయ కుటుంబం. భూమి కూడా సుమారు 80 ఎక‌రాల దాగా ఉండేది.

చిన్న‌పెద్ద‌నాన్న నుంచే..

అయితే, మా చిన్న‌పెద్ద‌నాన్న నుంచి క‌మ్యూనిస్టు భావజాలానికి మేం ద‌గ్గ‌ర‌య్యాం. ముందుగా 7 వ త‌ర‌గ‌తి నుంచే మా పెద్ద‌న్న ముర‌ళీమోహ‌న్‌రెడ్డి క‌మ్యూనిజం గురించి తెలుసుకోవ‌డానికి వామ‌ప‌క్షాల మీటింగ్‌ల‌కు వెళ్లాడు. విశాలాంధ్ర పుస్త‌కాలు, శ్రామిక‌వ‌ర్గ ప్ర‌చుర‌ణ‌లు చ‌దివేవాడు. కమ్యూనిజం అంటే.. వ‌ర్గ‌ర‌హిత స‌మాజ‌మ‌ని, దోపిడీ, పీడ‌న‌లేని, కులాలుగా, మ‌తాలుగా, పేద‌లుగా, ధ‌నికులుగా కాదు.. ప్ర‌జ‌లంద‌రూ ఒక్క‌టిగా జీవించే అంద‌మైన ప్ర‌పంచ‌మ‌ని తెలుసుకున్నాడు. గ‌ద్ద‌ర్ మీటింగ్‌.. ఇలా అనేక కార్య‌క్ర‌మాల‌తో ఆజంజాహిమిల్స్ నాయ‌కుడు గోలి రాజీరుతో ప‌రిచయం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో 1975లో వ‌రంగ‌ల్ ఎల్బీ క‌ళాశాలలో ఆర్ ఎస్‌యూ ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్ అయ్యాడు. నిర్బంధం ఎక్కువ కావ‌డంతో మా అన్న ముర‌ళీమోహ‌న్‌రెడ్డి 1975 మార్చిలో పార్టీ ఫుల్‌టైమ‌ర్‌గా యూజీ అయ్యాడు. ఈ క్ర‌మంలో ఇదంతా వ‌ద్దంటూ అన్నను మానాన్న ఒక‌టిరెండు సార్లు ఇంటికి తీసుకొచ్చాడు. అయినా తాను న‌మ్మిన దాని కోసం ముందుకు వెళ్లాడు. ఆ త‌ర్వాత కొంత కాలానికే.. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో 1975, జూలై 25న మెద‌క్ జిల్లా గిరాయిప‌ల్లి ఎన్‌కౌంట‌ర్‌లో మా అన్న అమ‌రుడ‌య్యాడు. అప్పుడు ఆయ‌న వ‌య‌స్సు 19 ఏళ్లు.

జ‌న్ను చిన్నాలుతో

అన్న ముర‌ళీమోహ‌న్ ఎన్‌కౌంట‌ర్ త‌ర్వాత మా నాన్న మ‌మ్మ‌ల్ని వ‌రంగ‌ల్ నుంచి ఇంటికి తీసుకెళ్లాడు. ఇక్క‌డే ఉంటే మీరు కూడా ఉద్య‌మాలంటూ వెళ్తారు.. అంటూ తీసుకెళ్లాడు. అయితే.. ముర‌ళీమోహ‌న్‌రెడ్డి త‌మ్ముడు పాపిరెడ్డి కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు.. ప‌నిచేస్తాడు.. అని జ‌న్ను చిన్నాలు తెలుసుకొని, నా కోసం వ‌చ్చాడు. ఇంటి ద‌గ్గ‌ర కాకుండా, మా చెల‌క వ‌ద్ద క‌లిసేవారు. ఎప్ప‌టిక‌ప్పుడు పుస్త‌కాలు తెచ్చి ఇచ్చేవాడు. ఈ పుస్త‌కాల‌ను ఇంట్లో ఎవ‌రికీ కనిపించ‌కుండా దాచిపెట్టి చ‌దుకునేవాడిని. ఒక‌సారి మా అమ్మ ఇల్లు ఊడ్చుతుంటే.. ఆ పుస్త‌కాల‌ను చూసింది. భ‌యంతో నాన్న‌కు చెప్పింది. అయినా.. ఉద్య‌మం వైపే అడుగులు వేసాను. ఈ క్ర‌మంలో 1976లోనే నేను కూడా అండ‌ర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిన‌. అప్పుడు నా వ‌య‌స్సు సుమారు 14 ఏళ్లు. అనేక గ్రామాలు తిరుగుతున్న క్ర‌మంలో 1976 న‌వంబ‌ర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు నెల‌ల పాటు అనేక పోలీస్‌స్టేష‌న్లు తిప్పిండ్లు. హ‌న్మకొండ‌, మ‌ట్టెవాడ‌, గీసుగొండ‌, న‌ర్సంపేట పోలీస్ స్టేష‌న్ల‌లో తిప్పారు. జైళ్లో మూడు నెల‌లు ఉన్నా. న‌న్ను బాల ఖైదీగా, ఉద్య‌మ‌కారుల‌తో కాకుండా మ‌రో బ్యార‌క్‌లో ఉంచారు. అప్పుడు నాకోసం కూడా ఇత‌ర బ్యార‌క్‌లో ఉన్న గ‌ణ‌ప‌తి, కిష‌న్ జీ, న‌ల్ల ఆదిరెడ్డి, మ‌ల్లా రాజిరెడ్డి, సాహు, అల్లం నారాయ‌ణ త‌దిత‌ర నాయ‌కులంద‌రూ డిమాండ్ చేశారు. బాలుడే కావొచ్చుగానీ.. రాజ‌కీయ ఖైదీగా గుర్తించి, త‌మ బ్యార‌క్‌లోకి పంపాల‌ని కోరారు. చివ‌ర‌కు 1977లో ఇందిరాగాంధీ ఓట‌మి త‌ర్వాత విడుద‌ల చేశారు.

1981లో మ‌ళ్లీ యూజీ..

1978లో జ‌గిత్యాల జైత్ర‌యాత్ర‌తో మ‌ళ్లీ ఉద్య‌మం ఊపందుకుంది. విద్యార్థులు, యువ‌త‌ విప్ల‌వోద్య‌మంలో వ‌స్తున్నారు. ఆ స‌మ‌యంలో నేను డైరెక్టుగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసి, ఉత్తీర్ణ‌త సాధించా. అనంత‌రం వ‌రంగ‌ల్ ఎల్బీ క‌ళాశాల‌లో ఇంట‌ర్‌లో చేరిన‌. ఉద్య‌మంలో చురుగ్గా పాల్గొనే క్ర‌మంలో తీవ్ర నిర్బంధం పెరిగింది. దీంతో 1981లో మ‌ళ్లీ అండ‌ర్ గ్రౌండ్‌లోకి వెళ్లిన‌. ఇక అప్ప‌టి నుంచి పీపుల్స్‌వార్ (మావోయిస్టు పార్టీ)లో అనేక ద‌శ‌ల్లో ప‌నిచేసిన‌. ద‌ళ‌స‌భ్యుడిగా, క‌మాండ‌ర్‌గా, జిల్లా కార్య‌ద‌ర్శిగా, సెంట్ర‌ల్ క‌మిటీ మెంబ‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌. 2003 వ‌ర‌కు చ‌త్తీస్‌ఘ‌డ్‌ బ‌స్త‌ర్‌, ఆ త‌ర్వా త హ‌ర్యాన త‌దిత‌ర ప్రాంతాల్లో బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌. అనేక ప్ర‌జాస‌మ‌స్య‌లు, ఉద్య‌మాలపై అధ్య‌య‌నం చేసిన‌. అనారోగ్య కార‌ణాల‌తో 2008లో అప్ప‌టి హోంశాఖ మంత్రి జానారెడ్డి ముందు లొంగిపోయిన‌.

తెలంగాణ ఉద్య‌మంలో…

నేను బ‌య‌ట‌కు వ‌చ్చే ట‌ప్ప‌టికీ తెలంగాణ స్వ‌రాష్ట్ర సాధ‌న ఉద్య‌మం జోరుగా న‌డుస్తోంది. 2009 నుంచి తెలంగాణ ఉద్య‌మంలో నేను కూడా పాల్గొన్నా. క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేసిన‌. అనేక ప్రాంతాలు తిరిగిన‌. మ‌రోవైపు తెలంగాణ‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని అనేక వ్యాసాల రూపంలో ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లిన‌. ఈ క్ర‌మంలో న‌న్నుకూడా ప‌లు పార్టీలు ఆహ్వానించాయి. త‌మ‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని కోరాయి. కానీ.. నేను ఎక్క‌డికీ వెళ్ల‌లేదు. ఎవ‌రితోనూ క‌ల‌వ‌లేదు. స్వ‌రాష్ట్రం వ‌చ్చిన త‌ర్వాత పాల‌కుల తీరువ‌ల్ల తెలంగాణ ప‌రిస్థితిలో పెద్ద‌గా మార్పేమీ రాలేదు. ఏ ఆకాంక్ష‌ల‌తో అయితే.. కొట్లాడి, త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నామో.. అవి నెర‌వేర‌లేదు. ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పేమీ రాలేదు. గ్రామాల్లో భ‌యంక‌ర‌మైన అప్ర‌త్య‌క్ష నిరుద్యోగం ఉంది.

సంక్షోభంలో అనేక రంగాలు

తెలంగాణ‌లో అనేక రంగాలు సంక్షోభంలో ప‌డిపోయాయి. ప్ర‌ధానంగా వ్య‌వ‌సాయం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప‌రిశ్ర‌మ‌లు ఏమాత్ర‌మూ అభివృద్ధి చెందలేదు. విద్య‌, వైద్యం, ఉపాధి ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇక్క‌డ ఉన్న‌ద‌ల్లా కేవ‌లం స‌ర్వీస్ సెక్టార్‌. అది కూడా మ‌న‌దికాదు.. వ్య‌వ‌సాయం, ప‌రిశ్ర‌మ‌లు అభివృద్ధి చెంద‌కుండా కేవ‌లం స‌ర్వీస్ సెక్టార్‌నే చూపుతూ.. అది కూడా మ‌న‌దికాని స‌ర్వీస్ సెక్టార్ చూపుతూ.. దానినే అభివృద్ధి అని చెబుతూ.. ప్ర‌జ‌ల్ని మోసం చేస్తున్నారు. పాల‌కులు క‌మీష‌న్ ఏజెంట్లుగా మారిపోయారు. కార్పొరేట్ల‌కు ఊడిగం చేస్తూ కాలం వెల్ల‌దీస్తున్నారు. ఇంత‌టి దారుణ ప‌రిస్థితుల్లో ఉన్న తెలంగాణ‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంది. దానికోసం ప్ర‌త్యేక‌మైన కార్యాచ‌ర‌ణ‌తో జ‌నంలోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాం.

విద్య‌, వైద్యం, ఉపాధి కావాలి..

ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన అత్యంత మౌలిక రంగాలు విద్య‌, వైద్యం, ఉపాధి. ఈ మూడు రంగాలు కూడా ప్ర‌స్తుతం తెలంగాణ దారుణ‌మైన ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాయి. విద్యారంగాన్ని ఈ పాల‌కులు నాశ‌నం చేశారు. ప్ర‌భుత్వ వైద్య రంగాన్ని గాలికి వ‌దిలేసారు. మొత్తం కూడా కార్పొరేట్‌ మాఫియా చేతిలో ప‌డిపోయింది. ఇక ఉపాధి రంగం మొత్త‌మే దెబ్బ‌తిన్న‌ది. ఈ ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ముప్పై ఏళ్లు వ‌చ్చినా.. యువ‌త‌కు ఉద్యోగం లేదు.. ఉపాధి లేదు. అందుకే ప్ర‌జ‌ల‌ను మ‌ళ్లీ చైత‌న్యం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. విద్య‌, వైద్యం, ఉపాధి కోసం ఉద్య‌మాలు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ మేర‌కు ఒక కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు వెళ్తున్నాం. ఇక్క‌డ డ‌బ్బొక్క‌టే ప్ర‌ధానం కాదు.. మ‌నం నిజాయితీగా ప‌నిచేస్తే.. ప్ర‌జ‌లే కాపాడుకుంటారు. ప్ర‌జ‌లే ఉద్య‌మాలు నిర్మిస్తారు. ఇది చ‌రిత్ర చెప్పిన స‌త్యం.

కొత్త పార్టీ పెడుతున్నాం..

తెలంగాణ‌ను కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బీజేపీలు.. మోసం చేస్తున్నాయి. రాష్ట్రాన్ని అంధ‌కారంలోకి నెడుతున్నాయి. ఈ పార్టీల‌ను ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితిలో లేరు. ఈ నేప‌థ్యంలో రాజ్యాంగ బ‌ద్ధంగా ప్ర‌జ్వాస్వామిక ప‌ద్ధ‌తిలో ఒక రాజ‌కీయ పార్టీ పెడుతున్నాం. ప్ర‌జాస్వామిక‌వాదులంద‌రినీ క‌లుపుకుపోతాం. ఒక ప్రాంతీయ పార్టీగా జ‌న తెలంగాణ మా ల‌క్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ఈ మేర‌కు తెలంగాణ వ్యాప్తంగా స‌న్నాహ‌క స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నాం. ఇప్ప‌టికే ఉమ్మ‌డి ఆదిలాబాద్‌లో స‌మావేశాలు చేప‌ట్టాం. అన్నివ‌ర్గాల‌ ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. వ్య‌వ‌సాయం, ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధితోపాటు విద్య‌, వైద్యం, ఉపాధి ల‌క్ష్యంగా మా కార్యాచ‌ర‌ణ ఉండ‌బోతోంది. ఈ రంగాలు బాగుంటేనే ప్ర‌జ‌ల బ‌తుకులు బాగుప‌డుతాయి. ప్ర‌జ‌ల్ని చైత‌న్య‌ప‌ర్చుతాం. ప్ర‌జా ఉద్య‌మాల‌ను నిర్మిస్తాం. ఏ ఆకాంక్ష‌ల కోస‌మైతే త్యాగాలు చేసి, తెలంగాణ సాధించామో.. వాటిని సాధించే దిశ‌గా అడుగులు వేయ‌బోతున్నాం. రానున్న రెండు మూడు నెల‌ల్లో పార్టీ పేరు కూడా పూర్తిస్థాయిలో ఖ‌రారు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. వ‌చ్చే ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కూడా పోటీ చేసి, ప‌ట్ట‌భ‌ద్రుల‌కు ద‌గ్గ‌ర‌కావాల‌న్న ల‌క్ష్యం ప్ర‌స్తుతం మా ముందున్న‌ది.