జెన్‌జీ యువత ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమించాలి
: తీగల జీవన్‌కుమార్
అక్షరశక్తి, హనుమకొండ, అక్టోబరు 8: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నికల సంఘం, ఈడీ, సీబీఐ, న్యాయవ్యవస్థ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు తీగల జీవన్‌కుమార్ ఆరోపించారు. ప్రజాస్వామ్య, లౌకిక వ్యవస్థ పరిరక్షణకు విద్యార్థులు, యువత చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హనుమకొండలోని శ్రీ శార్వాణి డిగ్రీ కళాశాలలో కామ్రేడ్ దుస్సా చేరాలు నగర్ పేరుతో నిర్వహిస్తున్న పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవన్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను విద్యార్థి, యువత ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రశ్నించాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువత ప్రజా సమస్యలపై చర్చా వేదికలను ఏర్పాటు చేసుకుని ఉద్యమించాలని అన్నారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
‘మార్క్స్–భగత్‌సింగ్ జీవితాల పరిచయం’ అంశంపై పీడీఎస్‌యూ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రవి తరగతి నిర్వహించారు. ‘నిర్మాణం–పనివిధానం’ అంశంపై పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ బోధించారు. అంతకుముందు పీడీఎస్‌యూ బిగిపిడికిలి జెండాను జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి అజయ్ ఆవిష్కరించారు. విద్యార్థి అమరవీరులను స్మరిస్తూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. నరసింహరావు నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు పి. అనూష, డి. వినయ్, సహాయ కార్యదర్శులు అలువాల నరేష్, వంశీ, జిల్లా కోశాధికారి కె. సంగీత, జిల్లా నాయకులు కె. రాజు, వికాస్‌కుమార్, సిద్ధార్థ్, విఘ్నేష్, స్టీవెన్, కార్తీక్, అజయ్, చరణ్, సాయి, పూజీత, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
