AKSHARA SHAKTHI
Date of Publish : 09 October 2026, 5:41 am Posted by : AKSHARA SHAKTHI

రామప్పకు ముప్పు!

– రామ‌ప్ప ఆల‌యానికి స‌మీపంలో సింగ‌రేణి ఓపెన్‌కాస్ట్ గ‌ని

– ఐదు కిలోమీటర్ల దూరంలో 300 మీటర్ల లోతు బొగ్గు తవ్వకాలు

– యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక ఆలయంపై ఓపెన్‌కాస్ట్‌ నీడ

– భూగర్భజలాల మార్పులతో చెరువు కట్టకు ప్రమాదం?

– పునాదుల్లో ఇసుక కొట్టుకుపోతే ఆలయ స్థిరత్వానికి ముప్పు

– 80 వేల ఎకరాల సాగు.. వేలాది కుటుంబాల జీవనాధారంపై ఆందోళన

– రానున్న కాలంలో కంటికి క‌నిపించ‌ని జీవ‌న విధ్వంస‌మే..

– ప్రభుత్వాలు స్పందించాలి.. గనిని నిలిపివేయాలి

– తెలంగాణ డిజిట‌ల్ మీడియాతో ప్రొఫెసర్‌ పాండురంగారావు

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేటలో కాకతీయులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప (రుద్రేశ్వ‌ర ఆల‌యం). కాక‌తీయులు నిర్మించిన ఆల‌యాల్లో రామ‌ప్ప అత్య‌ద్భుతం. ఆ నాటి ఇంజినీరింగ్‌, శిల్ప క‌ళా నైపుణ్యానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం. సుమారు క్రీస్తు శకం 1213 సంవ‌త్స‌రంలో ప్రారంభించి, 40 ఏళ్ల‌పాటు దీనిని నిర్మించారు. రామ‌ప్ప ఆల‌యం యునెస్కో(UNESCO) గుర్తింపు పొంది, మ‌న ఓరుగ‌ల్లు కీర్తిని విశ్వ‌వ్యాప్తం చేసింది. ఆల‌యానికి స‌మీపంలోనే నిర్మించిన‌ రామ‌ప్ప చెరువు 8 శ‌తాబ్దాలుగా సాగునీరు అందిస్తోంది. ప్ర‌త్య‌క్షంగా 30వేల ఎక‌రాలు, ప‌రోక్షంగా మ‌రో 50వేల ఎక‌రాలు.. అంటే మొత్తం సుమారు 80వేల ఎక‌రాల‌కు సాగునీరు అందిస్తోంది. ఇంత గొప్ప వార‌స‌త్వ సంప‌ద నేడు ప్ర‌మాదంలో ప‌డిపోతోంది. సింగ‌రేణి కాల‌రీస్ చేప‌డుతున్న ఓపెన్ కాస్ట్ గ‌నితో ధ్వంస‌కాబోతోంది. చూస్తుండ‌గానే రామ‌ప్ప ఆల‌యం, రామ‌ప్ప చెరువు క‌నుమ‌రుగ‌య్యే ప‌రిస్థితుల్లో ప‌డిపోతోంది.. అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు కాక‌తీయ హెరిటేజ్ ట్ర‌స్టీ, ఇన్‌టాక్‌(INTACH) వ‌రంగ‌ల్ చాప్ట‌ర్ క‌న్వీన‌ర్‌, వ‌రంగ‌ల్ నిట్(NITW) రిటైర్డ్ ప్రొఫెస‌ర్ ఎం. పాండురంగారావు. ఆల‌యానికి కేవ‌లం ఐదు కిలోమీట‌ర్ల దూరంలోనే సింగ‌రేణి కాల‌రీస్ చేప‌డుతున్న ఓపెన్‌కాస్ట్ మైన్‌తో రామ‌ప్ప ఆల‌యంతోపాటు రామ‌ప్ప చెరువుకు ప్ర‌మాదం పొంచి ఉందంటూ ఆయ‌న హెచ్చ‌రిస్తున్నారు. ఓపెన్ కాస్ట్ మైన్ ఆపివేయాలంటూ 85ఏళ్ల వ‌య‌స్సులోనూ ఆయ‌న పోరాడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే డిజిట‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌తో పాండురంగారావు ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ఆ వివ‌రాలు ఆయ‌న మాట‌ల్లోనే…

అన్ని అనుమ‌తులు ఉన్నా..

సింగ‌రేణి కాల‌రీస్ ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలో ఓపెన్ కాస్ట్ మైన్ చేప‌ట్ట‌బోతోంది. సుమారు 300 మీటర్ల లోతు వరకు తవ్వకాలు చేపట్టాలని ప్రతిపాదించిన ఈ గని, రామప్ప చెరువు, రామప్ప దేవాలయానికి దిగువన సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మేర‌కు అన్ని ప్ర‌క్రియ‌లు పూర్తి చేసుకుంటోంది. ఈ ఓపెన్ కాస్ట్ మైన్‌కు అవ‌స‌ర‌మైన అన్ని అనుమ‌తులు తీసుకున్న‌ట్లు సింగ‌రేణి యాజ‌మాన్యం చెబుతోంది. ఇందుకోసం క‌ర్ణాట‌క‌లోని సూర‌త్‌క‌ల్ నిట్ వారు (NIT- National Institutes of Technology) అధ్య‌య‌నం చేసి, ఓపెన్ కాస్ట్ మైన్‌తో రామ‌ప్ప ఆల‌యానికి పెద్ద‌గా ప్ర‌మాదం లేద‌ని రిపోర్టు ఇచ్చిన‌ట్లు సింగ‌రేణి యాజ‌మాన్యం చెబుతోంది. అలాగే, పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా ఎన్‌వోసీ(No Objection Certificate – NOC) తీసుకున్నామ‌ని అంటోంది. అంతేగాకుండా, భూగర్భాన్ని భూమి పొరలనూ సర్వే చేసేందుకు నెలకొల్పిన సంస్థ Geological Survey of India (GSI) నుంచి కూడా అనుమ‌తి పొందిన‌ట్లు సింగ‌రేణి యాజ‌మాన్యం చెబుతోంది. ఇదే స‌మ‌యంలో కొన్ని హెచ్చ‌రిక‌లు కూడా చేసింది.

జీఎస్ఐ హెచ్చ‌రిక‌లు..

అయితే.. ఇక్క‌డ ఒక విష‌యాన్ని మ‌నం గ‌మ‌నినంచాల్సి అవ‌స‌రం ఉంది. జీఎస్ఐ(Geological Survey of India – GSI) అనుమ‌తులు ఇచ్చినా.. కొన్ని కీల‌క‌మైన‌ హెచ్చ‌రిక‌లు కూడా చేసింది. ఈ హెచ్చ‌రిక‌లు చాలు.. మ‌న వార‌స‌త్వ సంప‌ద రామ‌ప్ప ఆల‌యంతోపాటు రామ‌ప్ప చెరువు ఎంత‌టి ప్ర‌మాదంలో ప‌డిపోతున్నాయో..! ** రామప్ప చెరువులోని నీటి మట్టం, ఈ భౌగోళిక చీలికలు, రాతి పొరల మధ్యనున్న జాయింట్ల ద్వారా భూగర్భజలాలు ప్రవహించే తీరుపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల నీటి ప్రవాహానికి సంబంధించిన హైడ్రాలిక్ గ్రేడియంట్‌లో మార్పులు చోటుచేసుకోవచ్చు. వెంకటాపూర్ గ్రామంలో ప్రతిపాదించిన 300 మీటర్ల లోతైన ఓపెన్‌కాస్ట్ గని వరకు ఈ ప్రభావం విస్తరించే అవకాశం ఉంది** అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) త‌న నివేదిక‌లో పేర్కొంది. రెండు కొండలను కలుపుతూ మట్టి కట్టతో రామప్ప చెరువును నిర్మించారు. ఈ చెరువు కట్టలోకి నీటి చొరబాటును అడ్డుకునే కట్ ఆఫ్ ట్రెంచ్‌ (సీవోటీ) లేదు. రామప్ప చెరువుకు దిగువన 300 మీటర్ల లోతుతో ఓపెన్‌కాస్ట్ గనిని తవ్వడం వల్ల భూగర్భంలో నీటి పీడన పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది. గని ప్రాంతంలో నీటి పీడనం(హైడ్రాలిక్ గ్రేడియంట్) తక్కువైతే, చెరువు నుంచి భూగర్భంలోని పగుళ్లు, రాతి పొరల మధ్య ఖాళీల నుంచి నీరు ఆ వైపునకు వేగంగా ప్రవహించే ప్ర‌మాదం ఉంది. దీనివ‌ల్ల ఏర్ప‌డిన బుంగ‌ల‌తో క్ర‌మంగా చెరువు క‌ట్ట దెబ్బ‌తింటుంది. ఇది మ‌న క‌ళ్ల‌కు క‌నిపించ‌కుండా జ‌రిగే భ‌యంక‌ర‌మైన జీవ‌న‌ విధ్వంసం.

ప్ర‌మాదంలో ఆల‌య పునాది…

రామప్ప దేవాలయ పునాది నిర్మాణంలో శాండ్‌బాక్స్(ఇసుక పెట్టె) ప‌ద్ధ‌తి ఉప‌యోగించారు. అంటే ఇక్క‌డ‌ పరిమిత ఇసుక మాత్ర‌మే ఉంటుంది. ఓపెన్ కాస్ట్ మైన్‌తో చెరువు దిగువ‌కు భూగ‌ర్భ జ‌లాల ప్ర‌వాహం పెరుగుతుంది. **భూగర్భ జలాల ప్రవాహం కారణంగా ఆల‌య‌ పునాదుల్లోని ఇసుక, మట్టి రేణువులు కొట్టుకుపోయి (పైపింగ్ ఫినామినా – Piping Phenomenon) అంతర్గత ఖాళీలు ఏర్పడుతాయ‌ని, దీనివ‌ల్ల రామప్ప దేవాలయ పునాది స్థిరత్వానికి ముప్పు ఏర్పడే ప్ర‌మాదం ఉంది** అని జీఎస్ఐ త‌న నివేదికలో హెచ్చ‌రించింది. అంటే రామప్ప చెరువు, దేవాలయం గుండా పరస్పరం అనుసంధానమై విస్తరించిన భౌగోళిక చీలికల వెంట నీరు ప్రవహించడం వల్ల రామ‌ప్ప ఆల‌య పునాదిగా ఉన్న‌ ఈ ఇసుక పెట్టె నిర్మాణం బ‌ల‌హీన ప‌డుతుంది. రామప్ప దేవాలయంపై పేలుళ్ల ప్రభావం ప్రస్తుతం తక్కువగానే ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నప్పటికీ, దీర్ఘకాలంలో పదేపదే సంభవించే ప్రకంపనలు దేవాలయంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ప్ర‌మాదం ఉంది. నిరంతర పేలుళ్ల‌తో కాలక్రమేణా తీవ్ర‌ నష్టం జ‌రుగుతుంది. అలాగే, ఓపెన్‌కాస్ట్ గ‌నితో ఏర్ప‌డే కాలుష్యంతో ఆల‌యంపై తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంది. ఓపెన్ కాస్ట్ గ‌ని ప్ర‌క్రియ‌తో ఏర్ప‌డే ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో ఆల‌య గుర్తింపును యునెస్కో ర‌ద్దు చేసే అవ‌కాశ‌మూ లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలోనే ఓపెన్‌కాస్ట్ గ‌నిని ఆపివేయాలి. ఈ మేర‌కు ప్ర‌భుత్వాలు చొర‌వ‌తీసుకోవాలి.

కంటికి క‌నిపించ‌ని విధ్వంసం..

రామ‌ప్ప ఆల‌యం, చెరువుకు స‌మీపంలో చేప‌డుతున్న సింగ‌రేణి ఓపెన్ కాస్ట్ గ‌నితో మ‌న కంటికి క‌నిపించ‌ని జీవ‌న విధ్వంసం జ‌ర‌గ‌బోతోంది. ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా సుమారు 80వేల ఎక‌రాల‌కు సాగునీరు అందిస్తున్న రామ‌ప్ప చెరువు, ఓరుగ‌ల్లు కీర్తిని విశ్వ‌వ్యాప్తం చేసిన రామ‌ప్ప ఆల‌యం ధ్వంసం కాబోతున్నాయి. స‌మారు 20 గ్రామాల ప్ర‌జ‌లు, వారి జీవ‌నాధారం ప్ర‌మాదంలో ప‌డిపోతున్నాయి. మొత్తంగా ఓ అద్భ‌త‌మైన జీవ‌న‌చిత్రం క‌నుమ‌రుగు కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ఈ ప్రాంత ప్ర‌జ‌లు కూడా ఓపెన్‌కాస్ట్ గ‌నిని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. త‌మ బ‌తుకులు ఛిద్ర‌మైపోతాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ వార‌స‌త్వ సంప‌ద ప‌రిర‌క్ష‌ణ‌ కోసం మేం కూడా ద‌శాబ్దాలుగా ప‌రిశోధ‌న చేస్తున్నాం. ఇప్పుడు ఉద్య‌మిస్తున్నాం.

ప్ర‌భుత్వాలు స్పందించాలి..

సింగరేణి వెంకటాపురం వద్ద ఓపెన్‌కాస్ట్‌ గని ప్రారంభించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్ప‌టి నుంచే మేము తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాం. 2023 మార్చి 1న ములుగు జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశం, 2023 మార్చి 28న కలెక్టర్‌ నుంచి వచ్చిన లేఖ, అదే ఏడాది ఏప్రిల్‌ 1న మేము పంపిన లేఖ, 2024 డిసెంబరు 19న జరిగిన సమావేశం వంటి అంశాలను 2025 జనవరి 27న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డికి పంపిన లేఖలోనూ ఓపెన్‌కాస్ట్‌తో జ‌రిగే ప్ర‌మాదాల‌ను వివరించాం. రామప్ప ఆలయం, సరస్సుకు గని వల్ల కలిగే ప్రమాదాలపై మా అభ్యంతరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాం. 2026 అక్టోబరు 3న సింగరేణి సీఎండీకి కూడా కూడా లేఖ రాసి, గని ప్రతిపాదన ప్రభావాలను వివరించేందుకు వ్యక్తిగతంగా కలిసే అవకాశం ఇవ్వాలని కోరాను. రామప్ప ఆలయం, రామ‌ప్ప చెరువు భద్రతకు ముప్పు కలిగించే ఈ ప్రతిపాదనపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. కాకతీయులు అందించిన వార‌స‌త్వ సంపదను కాపాడడానికి ప్ర‌భుత్వాలు ముందుకు రావాలి. రామప్ప ఆలయానికి, సరస్సుకు ముప్పు తెచ్చే ఓపెన్‌కాస్ట్‌ గనిని ఆపివేయాలి.

భావిత‌రాల‌కు అందిద్దాం..

ఈ ఓపెన్ కాస్ట్ మైన్‌, మ‌న‌కు కాక‌తీయులు అందించిన గొప్ప వార‌స‌త్వ సంప‌ద రామ‌ప్ప ఆల‌యానికి, రామ‌ప్ప చెరువుకు కేవ‌లం ఐదు కిలోమీట‌ర్ల దూరంలోనే ఉంది. దీంతో రామ‌ప్ప ఆల‌యంతోపాటు చెరువు ప్ర‌మాదంలో ప‌డిపోతున్నాయి. ఓపెన్ కాస్ట్ మైన్‌లో బొగ్గు త‌వ్వ‌కాల కోసం చేప‌ట్ట‌బోయే భారీ పేలుళ్ల‌తో రామ‌ప్ప ఆల‌యం, చెరువు ధ్వంస‌మ‌య్యే ప్ర‌మాదం ఉంది. ఇది ఒక్క‌రోజే.. ఒకేసారి జ‌ర‌గ‌దు. భారీ పేలుళ్ల‌తో మొద‌ల‌య్యే విధ్వంసం రోజులు, నెల‌లు, సంవ‌త్స‌రాలు గ‌డిచేకొద్దీ మ‌న‌కు అర్థం అవుతుంది. మొద‌ట్లోనే మ‌నం మేల్కోక పోతే.. మ‌న క‌ళ్ల‌ముందే జ‌ర‌గాల్సిన విధ్వంసం జ‌రిగిపోతుంది. మ‌న ప్ర‌జ‌ల‌కు, మ‌న భావిత‌రానికి ఊహ‌కంద‌ని న‌ష్టం జ‌రుగుతుంది. అందుకే.. ఓపెన్ కాస్ట్ మైన్ ప్రారంభం కాక‌ముందే.. మ‌నం మేల్కోవాలి. జాగ్ర‌త్త‌ప‌డాలి. అద్భుత‌మైన వారస‌త్వ సంప‌ద‌ను కాపాడుకోవాల్సిన‌ బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంది. మ‌న భావిత‌రాల‌కు అందించాల్సిన అవ‌స‌రం ఉంది. లేదంటే.. ఆ సంప‌ద‌ను, ఆ ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని, ఆ శిల్ప‌క‌ళావైభ‌వాన్ని మ‌న భావిత‌రాలు చూడ‌లేవు. ఈ విష‌యాన్ని మ‌నం గుర్తుంచుకొని ముందుకు వెళ్లాలి. క‌లిసి క‌ద‌లాలి..!