AKSHARA SHAKTHI
Date of Publish : 31 October 2026, 10:44 am Posted by : AKSHARA SHAKTHI

కాజీపేట‌లో రైలు బోగీల త‌యారీ

కాజీపేట రైలు మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌కు భారీ ఉత్పత్తి లక్ష్యం
మూడేళ్లలోనే 2,400 బోగీల తయారీకి ప్రణాళిక
ఆరేళ్లలో 3,200 నాన్‌ ఏసీ మెము కోచ్‌ల ఉత్పత్తికి రైల్వే బోర్డు ఆమోదం
2030–31లో అత్యధికంగా 960 బోగీల తయారీ

అక్ష‌ర‌శ‌క్తి, కాజీపేట : గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని కాజీపేట మండలం అయోధ్యపురంలో నిర్మితమవుతున్న రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ (ఆర్‌ఎంయూ)కు రైల్వే బోర్డు భారీ ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ యూనిట్‌లో రానున్న ఆరేళ్లలో ఏకంగా 3,200 నాన్‌ ఏసీ మెము (MEMU) కోచ్‌లను తయారు చేయాలని నిర్ణయించింది. 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి 2031–32 వరకు ఏటా ఎన్ని బోగీలు తయారు చేయాలన్న వివరాలతో కూడిన ఉత్పత్తి ప్రణాళికకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు అక్టోబరు 26న రైల్వే బోర్డు డైరెక్టర్‌ (మెకానికల్‌ ఇంజినీరింగ్‌) జయంత్‌ రామచంద్రన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ భవిష్యత్తులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే కీలకమైన రైలు బోగీల తయారీ కేంద్రంగా ఎదిగేందుకు మార్గం సుగమమైంది.

ఏడాదికేడాది పెరగనున్న ఉత్పత్తి

రైల్వే బోర్డు ఆమోదించిన ప్రణాళిక ప్రకారం 2026–27 ఆర్థిక సంవత్సరంలో 32 కోచ్‌ల తయారీతో ఉత్పత్తి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆ తర్వాతి ఏడాది 2027–28లో 368 కోచ్‌లు, 2028–29లో 480 కోచ్‌లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2029–30, 2030–31 ఆర్థిక సంవత్సరాల్లో అత్యధికంగా ఏడాదికి 960 చొప్పున కోచ్‌లను ఉత్పత్తి చేయనున్నారు. చివరి ఏడాది 2031–32లో మరో 400 కోచ్‌ల తయారీకి ప్రణాళిక రూపొందించారు. ఇలా ఆరేళ్ల కాలానికి కలిపి మొత్తం 3,200 కోచ్‌ల ఉత్పత్తిని ఖరారు చేశారు. ప్రారంభంలో తక్కువ సంఖ్యతో మొదలై, క్రమంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్లేలా ఈ ప్రణాళికను రూపొందించడం విశేషం.

200 రైళ్లకు సరిపడా బోగీలు

కాజీపేట యూనిట్‌లో తయారు చేయనున్న 3,200 కోచ్‌లను 16 బోగీల చొప్పున రేకులుగా (రైలు సెట్లుగా) రూపొందించనున్నారు. ఈ లెక్కన మొత్తం 200 రేకుల తయారీకి ఈ ఉత్పత్తి సరిపోనుంది. ప్రయాణికుల రవాణాలో కీలకమైన నాన్‌ ఏసీ మెము రైళ్లకు అవసరమైన కోచ్‌లను ఈ యూనిట్‌లో తయారు చేయనున్నారు. ఈ ఉత్పత్తి ప్రణాళికకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్థిక డైరెక్టరేట్‌ కూడా ఆమోదం తెలిపినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌కు ఈ ఉత్తర్వులను పంపడంతో పాటు రైల్వే బోర్డులోని సంబంధిత విభాగాలకు సమాచారం అందించారు.

కాజీపేటకు పారిశ్రామిక గుర్తింపు

అయోధ్యపురంలో ఏర్పాటు చేస్తున్న రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌కు భారీ స్థాయిలో ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించడం వరంగల్‌ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి కీలక పరిణామంగా భావిస్తున్నారు. రైల్వే బోగీల తయారీకి సంబంధించిన కార్యకలాపాలు విస్తరించడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అనుబంధ పరిశ్రమలు, విడిభాగాల సరఫరా సంస్థలు, రవాణా, ఇతర సేవారంగాల అభివృద్ధికి కూడా ఈ యూనిట్‌ దోహదపడనుంది. ఆరేళ్లలో 3,200 కోచ్‌ల తయారీ లక్ష్యంతో కాజీపేట రైల్వే యూనిట్‌ తెలంగాణలోనే కీలకమైన రైల్వే పారిశ్రామిక కేంద్రంగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆర్థిక సంవత్సరం కోచ్‌ల తయారీ లక్ష్యం

2026–27 32

2027–28 368

2028–29 480

2029–30 960

2030–31 960

2031–32 400

మొత్తం 3,200