AKSHARA SHAKTHI
Date of Publish : 04 November 2026, 1:27 pm Posted by : AKSHARA SHAKTHI

ఉర్సు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ‘ఖల్ నాయక్’ *ప్రభుత్వ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తి హల్‌చల్ *అధికారిక హోదా లేదు.. డాక్యుమెంట్ రైటర్ కానే కాదు *అధికారులకు సైతం బెదిరింపులు *బాధితుల నుంచి వసూళ్ల పర్వం *సిబ్బంది తోడ్పాటుతోనే జీవన్ నాయక్ రాకెట్

ఉర్సు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ‘ఖల్ నాయక్’

*ప్రభుత్వ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తి హల్‌చల్

*అధికారిక హోదా లేదు.. డాక్యుమెంట్ రైటర్ కానే కాదు

*అధికారులకు సైతం బెదిరింపులు

*బాధితుల నుంచి వసూళ్ల పర్వం

*సిబ్బంది తోడ్పాటుతోనే జీవన్ నాయక్ రాకెట్

అక్షరశక్తి, వరంగల్ : ప్రజా సేవ కోసం, పారదర్శకమైన రిజిస్ట్రేషన్ల కోసం ఏర్పాటు చేసిన ఉర్సు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఒక ప్రైవేట్ వ్యక్తికి అడ్డాగా మారింది. ప్రభుత్వ ఉద్యోగి కాదు, కనీసం గుర్తింపు పొందిన డాక్యుమెంట్ రైటర్ అంతకన్నా కాదు.. కానీ ఆ కార్యాలయంలో ఆయనే సర్వస్వం! ఆయనే ‘జీవన్ నాయక్’. గత కొన్నేళ్లుగా ఉర్సు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో తిష్టవేసి, తానో పెద్ద ఆఫీసర్ తరహాలో వ్యవహరిస్తూ “ఖల్ నాయక్” అవతారం ఎత్తాడనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

కార్యాలయంలోనే తిష్ట..

జీవన్ నాయక్ అనే ఈ ప్రైవేట్ వ్యక్తి ఏళ్ల తరబడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోపలే ఉంటూ సిబ్బంది తరహాలో చలామణి అవుతున్నాడు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని, మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నాడు. “మీ పని నేను చేయిస్తా” అంటూ నమ్మబలికి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. కార్యాలయంలో ఏ చిన్న డాక్యుమెంట్ పని కోసం వచ్చిన లోపల ఈయనే దర్శనం ఇస్తాడు. పలకరించి ముగ్గులోకి దించి పని చేయిస్తా అని డీల్ కుదుర్చుకుంటాడు. రెగ్యులర్ గా కనిపించే వ్యక్తి కావడంతో ఈజీ గా నమ్ముతారు. ఇదే అదనుగా ఆఫీసులో అన్ని పనులు చక్కబెడుతాడు.

*బెదిరింపులు.. అక్రమ వసూళ్లు

తనకు ప్రమేయం లేకుండా, నేరుగా లేదా ఇతర మార్గాల్లో డాక్యుమెంట్లు చేసుకొనే బాధితులను సైతం జీవన్ నాయక్ తీవ్రంగా బెదిరిస్తున్నాడని తెలుస్తోంది. “నన్ను దాటి మీ డాక్యుమెంట్ ఎలా బయటకు వస్తుందో చూస్తా” అంటూ బెదిరింపులకు దిగుతున్నాడని ఒక బాధితుడు వాపోయాడు. అంతేకాకుండా, కొన్ని వివాదాస్పద లేదా ముఖ్యమైన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ సమయంలో ఏకంగా విలేఖరుల పేరు చెప్పి సబ్ రిజిస్ట్రార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా భయభ్రాంతులకు గురిచేస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి.

*సిబ్బంది హస్తం ఉందా?

అసలు జీవన్ నాయక్ ఎవరు? ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా, అధికారిక హోదా లేకపోయినా ఏళ్ల తరబడి కార్యాలయంలోపల ఉండి పనులు చక్కబెడుతుంటే అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు?

ఈ అక్రమ వసూళ్ల వెనుక కార్యాలయ సిబ్బంది కుమ్మక్కయ్యారా? అతడిని ముందు పెట్టి వెనుక ఉండి నడిపిస్తున్న ఆ ‘పెద్దలు’ ఎవరు? బ్రోకర్ పనులకు వత్తాసు పలుకుతూ కార్యాలయ ప్రతిష్టను మసకబారుస్తున్న వారిపై చర్యలు ఎందుకు లేవు? అనే ప్రశ్నలు ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ కార్యాలయాన్ని సొంత వ్యాపార కేంద్రంగా మార్చుకుని, ప్రజలను పీడించుకు తింటున్న జీవన్ నాయక్ అక్రమాలపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపించాలి. కార్యాలయంలో తిష్టవేసిన ఇలాంటి దళారులను, వారికి సహకరిస్తున్న సిబ్బందిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, రిజిస్ట్రేషన్ కోసం వచ్చే సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాలని బాధితులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.