AKSHARA SHAKTHI
Date of Publish : 11 November 2026, 2:38 am Posted by : AKSHARA SHAKTHI

పీఓకు పెద్దవాటా!

* మహదేవ్‌పూర్‌ ఇసుక క్వారీల్లో అదనపు వసూళ్లకు అధికారిక అండ?

* సాధారణ లోడింగ్‌కే ఒక్కో లారీ నుంచి రూ.2,500 అదనం

* కాంట్రాక్టర్ల జీరో దందాకు పీవో వత్తాసు

* అదనపు బకెట్‌ వసూళ్లకూ కొత్త పీఓ రవీందర్‌ స్కెచ్

* మితిమీరుతున్న కాంట్రాక్టర్ల ఇసుక ఆగడాలు

* వసూళ్ల వెనుక వాటాలు

* పీఓ గేమ్ తో అధికారులకు పెరిగిన ఆదాయం

అక్షరశక్తి, నిఘా ప్రతినిధి: ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ఇసుక క్వారీలో అధికారులే అండగా ఉండి అందినకాడికి దోచుకుంటున్నారు. మహదేవ్‌పూర్‌ ఇసుక క్వారీల్లో కాంట్రాక్టర్ల అక్రమాలకు టీజీఎండీసీ పీఓ రవీందర్‌ అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్వారీల్లో సాధారణ లోడింగ్‌కే ఒక్కో లారీ నుంచి రూ.2,500 అదనంగా వసూలు చేస్తుండగా, ఈ వ్యవహారంలో పీఓకు అంత తెలిసే జరుగుతున్నదని, ఆయనకు అందాల్సిన వాటా చాలానే ఉంటోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే కాంట్రాక్టర్ల సిబ్బంది సాగిస్తున్న అదనపు వసూళ్లను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని, అక్కడ జరుగుతున్న అక్రమ తవ్వకాలను ఆయన ప్రశ్నించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారిగా రవీందర్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జీరో దందా, అదనపు బకెట్‌ దందా సైతం తిరిగి ఊపందుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. క్వారీల నిర్వహణలో పారదర్శకతకు బదులు అక్రమ వసూళ్లకు ప్రాధాన్యం పెరుగుతుండటం, వాటిపై పీఓ వ్యవహరిస్తున్న తీరు ఈ మొత్తం వ్యవహారంలో ఆయన పాత్రపై తీవ్ర సందేహాలు రేకెత్తిస్తోంది.

*అదనపు వసూళ్ల దందా..

మహదేవ్‌పూర్‌ పరిధిలోని ఇసుక క్వారీల్లో సాధారణ లోడింగ్‌ చేయించుకోవడానికే ఒక్కో లారీ నుంచి రూ.2,500 అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తాలను కాంట్రాక్టర్లకు చెందిన సిబ్బంది వసూలు చేస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నిర్ణీత రుసుములకు అదనంగా ఈ సొమ్ము వసూలు చేయడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయన్నది కీలకంగా మారింది. ఈ వసూళ్ల వ్యవహారంలో పీఓకు వాటా ఉంటోందనే ఆరోపణల నేపథ్యంలో కాంట్రాక్టర్ల సిబ్బందికి ఆయన నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఎదురుకావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

*పీవో రవీందర్‌ రాకతో జీరో దందాకు రెక్కలు?

కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉండే అధికారి మారగానే అక్కడ సీన్ మారింది.
కొత్త పీఓ రవీందర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత క్వారీల్లో జీరో దందా, అదనపు బకెట్‌ దందా మళ్లీ సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ లోడింగ్‌కే అదనపు వసూళ్లు ఒకవైపు కొనసాగుతుండగా, కాంట్రాక్టర్లు, లారీ యజమానుల కుమ్మక్కుతో ఓవర్‌లోడింగ్‌ కూడా జరుగుతోంది. ఈ వ్యవహారాలన్నింటిలో కాంట్రాక్టర్లకు అనుకూలంగా పీఓ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు క్వారీల నిర్వహణ తీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పీఓ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే కాంట్రాక్టర్ల దందాకు అధికారిక అండ ఉందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

*ఆరోపణలు వచ్చినా డోంట్ కేర్

ఇసుక క్వారీల్లో జరుగుతున్న అదనపు వసూళ్లు, ఇతర అక్రమాలపై జర్నలిస్టులు ప్రశ్నించినా పీఓ రవీందర్‌ స్పందిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్టర్ల సిబ్బంది వసూళ్లపై బాధ్యతాయుతంగా స్పందించి చర్యలు తీసుకోవాల్సింది పోయి, తప్పేమీ లేనట్లు సమాధానాలు ఇస్తుండటం ఆయన వైఖరిపై విమర్శలకు తావిస్తోంది. కాంట్రాక్టర్ల అక్రమాలకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఎదురవుతున్నప్పటికీ, వాటిని ఖండించడానికో, పారదర్శకతకు భరోసా ఇవ్వడానికో బదులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దందాలో పీవో కు పెద్ద మొత్తంలో వాటాలు, లారీల సంఖ్య ను బట్టి కమీషన్లు అందుతున్నాయి అని తెలుస్తున్నది.

*క్వారీల అక్రమాల్లో పీఓ పాత్రపై విచారణ ఏదీ?

సాధారణ లోడింగ్‌కు వసూలు చేస్తున్న అదనపు మొత్తాలు, జీరో దందా, అదనపు బకెట్‌ వసూళ్లు, ఓవర్‌లోడింగ్‌ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిగితే కాంట్రాక్టర్లతో పాటు పర్యవేక్షణ వ్యవస్థలోని బాధ్యుల పాత్ర కూడా వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా పీఓ రవీందర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ వ్యవహారాలు ఎలా సాగుతున్నాయి? కాంట్రాక్టర్ల అక్రమ వసూళ్లపై ఆయన ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? ఈ వసూళ్లలో ఆయనకు, పై స్థాయి అధికారులకు వాటా ఉందనే ఆరోపణల్లో వాస్తవమెంత? అనే అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. కాంట్రాక్టర్ల సిబ్బందిపై చర్యలతోనే వ్యవహారాన్ని ముగించకుండా, మొత్తం దందాలో పీఓ పాత్రను కూడా నిష్పాక్షికంగా తేల్చాల్సిన అవసరం ఉంది.