AKSHARA SHAKTHI
Date of Publish : 11 November 2026, 3:12 am Posted by : AKSHARA SHAKTHI

భట్టి పర్యటన.. బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు

– ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

– అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

– బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హనుమకొండ జిల్లా పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు ముందస్తు అరెస్టుల పర్వానికి తెరలేపారు. బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్, మాజీ కార్పొరేటర్ సోదా కిరణ్, బీఆర్ఎస్వీ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షుడు, జిల్లా కోఆర్డినేటర్ బైరపాక ప్రశాంత్‌లను హనుమకొండ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా పులి రజనీకాంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను ముందస్తు అరెస్టులతో అణచివేయాలని చూడటం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు.

ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం కాకుండా, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. అరెస్టులతో బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను భయపెట్టలేరని, ప్రజా సమస్యలపై తమ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగిస్తామని పులి రజనీకాంత్ స్పష్టం చేశారు.