AKSHARA SHAKTHI
Date of Publish : 11 November 2026, 1:39 pm Posted by : AKSHARA SHAKTHI

30వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె

– సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

– 17 వేల మంది ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి

– రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ, నవంబర్ 11: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరుకుంది. నెల రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 17 వేల మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మెకు ఏఐటీయూసీ సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ.. ఎన్‌హెచ్‌ఎం పరిధిలోని 78 క్యాడర్ల ఉద్యోగులందరినీ తక్షణమే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు దీటుగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ తమ సేవలకు తగిన గుర్తింపు, గౌరవం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా వైద్య, ఆరోగ్య రంగంలో కీలక సేవలందిస్తున్న ఉద్యోగులు నేటికీ ఉద్యోగ భద్రత లేకుండా పనిచేయాల్సి వస్తోందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 17 వేల మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, అప్పటివరకు 100 శాతం గ్రాస్ శాలరీ, హెల్త్ కార్డులు, ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదు శాతం వేతన పెంపును కూడా తక్షణమే అమలు చేసి ఉద్యోగులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఇకనైనా గుర్తించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని రామ రాజేష్ ఖన్నా పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడం, తగిన వేతనాలు అందకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య సేవల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మెకు ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు ప్రకటించడం పట్ల ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఐక్యంగా పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మహేందర్ పుట్ట, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుక్కుద్దీన్, రాష్ట్ర కోశాధికారి మొగిలి నరేష్, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, ఆర్‌బీఎస్‌కే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ జి. రవీందర్, డాక్టర్ రామ్‌రాజ్, డాక్టర్ హరికృష్ణ, బద్రి వేణు, జిల్లా ఉద్యోగులు శ్యామ్, రాజేష్ గౌడ్, వెంకటేష్, రాకేష్, యాదవ్, అన్వేష్, సువర్ణ, వనజ, బైరి అశోక్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.