AKSHARA SHAKTHI
Date of Publish : 11 November 2026, 2:56 am Posted by : AKSHARA SHAKTHI

వైఎస్సార్ నగర్‌కు న్యాయం చేశాకే కాజీపేటలో అడుగుపెట్టాలి!

– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు జనసేన నాయకురాలు పద్మజాదేవి డిమాండ్‌

– 2005లో వైఎస్సార్ ఇచ్చిన భూ హామీని నిలబెట్టుకోవాలి

– 62వ డివిజన్‌ పేద గుడిసెవాసులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

– విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలి.. ఆక్రమణల ప్రయత్నాలను అడ్డుకోవాలి

– న్యాయం చేయకుంటే భట్టి కాన్వాయ్‌ను అడ్డుకుని శాంతియుత నిరసన చేప‌డుతామ‌ని హెచ్చ‌రిక‌

అక్ష‌ర‌శ‌క్తి, కాజీపేట: ఏళ్ల తరబడి భూమి హక్కుల కోసం ఎదురుచూస్తున్న గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 62వ డివిజ‌న్ కాజీపేట‌ వైఎస్సార్ నగర్ పేదల సమస్యను పరిష్కరించిన తర్వాతే కాజీపేటలో అడుగుపెట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు జనసేన పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి లయన్ డా. పద్మజాదేవి స్పష్టం చేశారు. గ్రేటర్ వరంగల్ 62వ డివిజన్ పరిధిలోని కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు న్యాయం చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం తగదని ఆమె పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బాధిత కుటుంబాల తరఫున ఈ డిమాండ్‌ను బలంగా వినిపించారు.

2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా వైఎస్సార్ నగర్ కాలనీ పేదలకు భూమి విషయంలో ఇచ్చిన హామీని ఇప్పటికైనా అమలు చేయాలని పద్మజాదేవి డిమాండ్ చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆ హామీ అమలు కోసం పేద కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని, ప్రభుత్వాలు మారుతున్నా వారి సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, అనంతరం పేదల సమస్యలను పట్టించుకోకపోవడం పాలకులకు తగదన్నారు.

వైఎస్సార్ నగర్‌లో నివసిస్తున్న గుడిసెవాసుల వద్దకు పద్మజాదేవి నిరంతరం వెళ్లి వారి ఇబ్బందులను తెలుసుకుంటూ అండగా నిలుస్తున్నారు. కాలనీలోని భూమి అత్యంత విలువైనదని, దానిని కొందరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని ఆమె పేర్కొంటున్నారు. పేదలకు చెందాల్సిన ప్రభుత్వ భూమిని కాపాడటంతోపాటు, అర్హులైన నిరుపేద కుటుంబాలకు అదే స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో భాగంగా కాజీపేటకు వస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ నగర్ బాధితుల సమస్యను ఆయన ప‌రిష్క‌రించాల‌ని పద్మజాదేవి అన్నారు. కేవలం హామీలతో సరిపెట్టకుండా, భూమిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని పేదలకు న్యాయం చేయాలని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగకపోతే ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్‌ను శాంతియుతంగా అడ్డుకుని ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. ఈ పోరాటం రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, ఏళ్లుగా హక్కుల కోసం పోరాడుతున్న నిరుపేద కుటుంబాల భవిష్యత్తు కోసమేనని పద్మజాదేవి స్పష్టం చేశారు. వైఎస్సార్ నగర్ ప్రజలకు భూమి హక్కులు కల్పించి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, ప్రభుత్వ భూమిని పరిరక్షించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆమె ప్రకటించారు.