లారీకి రూ.500
*మహదేవ్పూర్ ఇసుక క్వారీలో పీవో వాటా!
*అదనపు బకెట్ దందాతో ప్రభుత్వ ఆదాయానికి గండి
*రోజువారీగా వేలాది రూపాయల వసూళ్ల ఆరోపణలు..
*తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న పీవో రవీందర్ వ్యవహారాలు
అక్షరశక్తి, నిఘా ప్రతినిధి: మహదేవ్పూర్ ఇసుక క్వారీల్లో అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇసుక మాఫియా ఇక్కడ పాతుకుపోయిందని, క్వారీల నిర్వహణలో పారదర్శకత కొరవడటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక తవ్వకాలు, లారీల రాకపోకలు, లోడింగ్ ప్రక్రియను పర్యవేక్షించాల్సిన అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అక్రమాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడ్డగోలుగా ఒక్కో లారీ నుండి వందల రూపాయలు వసూలు చేస్తున్నారని తెలుస్తున్నది. ఈ వ్యవహారం మొత్తం ఇసుక మాఫియా, అధికారుల చుట్టూ తిరుగుతున్నదని తెలిసింది.
*రూ.500 వరకు వసూళ్ల ఆరోపణలు
క్వారీలోకి ఇసుక లోడింగ్ కోసం వచ్చే ఒక్కో లారీ నుంచి రూ.300 నుంచి రూ.500 వరకు పీవో రవీందర్ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో లారీలు ఇసుక కోసం వస్తుండటంతో ఈ వ్యవహారం మరింత విస్తరించిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. లారీల డిమాండ్, లోడింగ్ అవసరాలను బట్టి అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజమైతే రోజువారీగా వేలాది రూపాయలు అక్రమంగా చేతులు మారుతున్నట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
*అదనపు బకెట్‌తో మరో అక్రమ దందా!
ఇసుక లోడింగ్‌లో అదనపు బకెట్ వ్యవహారం మరో వివాదానికి కారణమవుతోంది. నిబంధనల ప్రకారం నిర్ణయించిన పరిమాణానికి మించి ఇసుకను అదనంగా లోడ్ చేసేందుకు కొందరు కాంట్రాక్టర్లు ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదనపు బకెట్‌కు సుమారు రూ.3 వేల వరకు చెల్లించి లారీలు ఇసుకను తరలిస్తున్నాయని సమాచారం. లోడింగ్ ఆలస్యం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో లారీ యజమానులు, డ్రైవర్లు ఈ అదనపు మొత్తాలు చెల్లిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలోనూ పీవోకు ఒక్కో లారీ నుంచి రూ.500 వరకు వాటా అందుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
*కాంట్రాక్టర్లతో ఒప్పందం.. జీరో దందాకు ఊతం?
క్వారీల్లో ఇసుక తవ్వకాలు, లోడింగ్ ప్రక్రియకు సంబంధించి కొందరు కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారుల మధ్య అనధికారిక ఒప్పందాలు కుదిరాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలతో మహదేవ్పూర్ కేంద్రంగా జీరో ఇసుక దందా జోరుగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుములు, నిర్ణీత పరిమాణాలు, రవాణా అనుమతుల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక తవ్వకాల నుంచి లారీల తరలింపు వరకు ప్రతి దశలోనూ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నది సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ఉన్నతాధికారుల చర్యలు ఉండేనా??
పీవో రవీందర్ పనితీరుపై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చినట్లు కాంట్రాక్టర్ల వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇసుక కాంట్రాక్టర్లతో చేతులు కలిపి అక్రమ వసూళ్లకు పాల్పడటమే కాకుండా, ఆ మొత్తాల్లో ఉన్నతాధికారులకు సైతం వాటాలు చేరుతున్నాయనే ఆరోపణలను కొందరు కాంట్రాక్టర్లు బహిరంగంగా ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణల వెనుక వాస్తవాలను నిగ్గుతేల్చాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
కలెక్టర్, టీజీఎండీసీ అధికారులు విచారణ ఎందుకు జరపడం లేదు? మహదేవ్పూర్ ఇసుక క్వారీల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. క్వారీల్లోకి వస్తున్న లారీల సంఖ్య, వాటికి కేటాయించిన ఇసుక పరిమాణం, వాస్తవంగా తరలిస్తున్న ఇసుక, అదనపు బకెట్ లోడింగ్ వ్యవహారం, ప్రభుత్వానికి జమ అవుతున్న ఆదాయంపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే గత కొంతకాలంగా జరిగిన లావాదేవీలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలు నిజమా? క్వారీల్లో అక్రమ వసూళ్ల వెనుక ఎవరున్నారు? పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాల్సిన అధికారుల పాత్ర ఏమిటి? అన్న అంశాలపై సమగ్ర విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించి మహదేవ్పూర్ ఇసుక క్వారీల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తాయా? అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాయా? అన్నది వేచి చూడాలి.