AKSHARA SHAKTHI
Date of Publish : 20 November 2026, 12:12 pm Posted by : AKSHARA SHAKTHI

*ములుగు మున్సిపల్ పన్నుల పెంపుపై రాజకీయ దుమారం* *కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను ఖండించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు* *పన్నుల తగ్గింపు వరకు పోరాటం ఆగదని స్పష్టం*

*ములుగు మున్సిపల్ పన్నుల పెంపుపై రాజకీయ దుమారం*

*కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను ఖండించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు*

*పన్నుల తగ్గింపు వరకు పోరాటం ఆగదని స్పష్టం*

అక్షరశక్తి, ములుగు: ములుగు మున్సిపాలిటీలో ఇటీవల పెంచిన ఇంటి, వాణిజ్య పన్నుల వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వివాదానికి దారితీసింది. పన్నుల పెంపుపై ప్రతిపక్ష బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తప్పుబట్టగా, వారి వ్యాఖ్యలను బీఆర్ఎస్ కౌన్సిలర్లు తీవ్రంగా ఖండించారు. పన్నుల పెంపు విషయంలో వాస్తవాలను పక్కదారి పట్టిస్తూ తమపై నిందలు మోపుతున్నారని ఆరోపించారు. నవంబర్ 19న మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కాంగ్రెస్ నాయకులు చింతనిప్పుల భిక్షపతి తదితరులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు వివరణ ఇచ్చారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కౌన్సిలర్లు సంతకాలు చేసే హాజరు పట్టీనే సమావేశ వివరాల నమోదు పుస్తకంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. హాజరు పట్టీ, సమావేశ నిర్ణయాల నమోదు పుస్తకాలను వేర్వేరుగా నిర్వహించాల్సి ఉండగా, రెండింటినీ ఒకే రిజిస్టర్‌లో నమోదు చేయడం వల్ల సమావేశంలో వ్యతిరేకించిన అంశాలు సైతం ఆమోదం పొందినట్లు రికార్డుల్లోకి వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు కౌన్సిల్ సమావేశాల్లో ప్రస్తావించి, హాజరు పట్టీ, సమావేశ నిర్ణయాల పుస్తకాలను వేర్వేరుగా నిర్వహించాలని, నెలవారీ ఆదాయ వ్యయాల వివరాలు వెల్లడించాలని, పన్నుల పెంపుపై స్పష్టత ఇవ్వాలని కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు. అయినప్పటికీ అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. కౌన్సిల్‌లో తీర్మానాలు ఆమోదించే మెజారిటీ కాంగ్రెస్‌కే ఉందని, ప్రతిపక్షానికి ఆ స్థాయిలో సంఖ్యాబలం లేదని స్పష్టం చేశారు. పన్నుల పెంపునకు సంబంధించిన నిర్ణయాల బాధ్యతను ప్రతిపక్షంపై నెట్టడం సరికాదన్నారు.

పన్నుల పెంపు తీవ్రత డిమాండ్ నోటీసులు జారీ అయిన తర్వాతే తమ దృష్టికి వచ్చిందని బీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. అనంతరం మున్సిపల్ పరిపాలన సంచాలకుల శాఖ (సీడీఎంఏ) అధికారిక వెబ్‌సైట్‌లో ఇతర మున్సిపాలిటీల పన్నులతో ములుగు పన్నులను పోల్చి పరిశీలించామని చెప్పారు. ఈ పరిశీలనలో అసెస్‌మెంట్ల వారీగా పన్నుల విధానంలో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించామని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

ములుగు పట్టణ ప్రజలు, వ్యాపారులపై అదనపు పన్నుల భారం పడకుండా చూడటమే తమ లక్ష్యమని ప్రతిపక్ష కౌన్సిలర్లు పేర్కొన్నారు. ఒకే రకమైన అసెస్‌మెంట్లకు వేర్వేరు పన్నులు విధించే విధానాన్ని సరిచేయాలని, పెంచిన ఇంటి, వాణిజ్య పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను ప్రజల ముందుంచి, పన్నుల తగ్గింపు జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పన్నుల పెంపు నిర్ణయానికి సంబంధించిన తీర్మానాలు, కౌన్సిల్ సమావేశాల అసలు మినిట్స్, పన్నుల విధింపు వివరాలను అధికారులు బహిర్గతం చేస్తేనే ఈ వివాదంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది.