AKSHARA SHAKTHI
Date of Publish : 23 November 2026, 1:06 pm Posted by : AKSHARA SHAKTHI

దమ్ముంటే.. వరంగల్‌ పశ్చిమలో పోటీ చేయ్‌!

– కేటీఆర్‌కు ఎమ్మెల్యే నాయిని సవాల్‌

– బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో అప్పుల తెలంగాణ.. అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారు

– పదేళ్ల అభివృద్ధి.. కాంగ్రెస్‌ రెండున్నరేళ్ల పనులపై బహిరంగ చర్చకు సిద్ధం

– హనుమకొండ చౌరస్తాలో ఆధారాలు, జీవోలతో చర్చిద్దాం

– వరంగల్‌ పశ్చిమలో చేపట్టిన పనులపై ప్రజల ముందే లెక్కలు చెబుతా

– కాళోజీ కళాక్షేత్రం నుంచి విమానాశ్రయం వరకు గత ప్రభుత్వ వైఫల్యాలపై నాయిని ధ్వజం

అక్షరశక్తి, హనుమకొండ: అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో వరంగల్‌కు ఒరిగిందేమిటో ప్రజలకు వివరించగలరా? శిలాఫలకాలు, శంకుస్థాపనలతోనే కాలం గడిపిన గత పాలకులు ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. గత పాలనలో అసంపూర్తిగా వదిలేసిన పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తుంటే విమర్శలు చేయడం రాజకీయ దిగజారుడుతనమే. నిజంగా మీ హయాంలో అభివృద్ధి జరిగి ఉంటే.. ఆ ధైర్యంతోనే కేటీఆర్‌ వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయాలి!… అంటూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణను అప్పులపాలు చేసి, అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటి పరిస్థితి.. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన పనుల వివరాలను జీవోలు, నిధుల కేటాయింపులు, ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.

సోమవారం హనుమకొండలోని డీసీసీ భవన్‌లో వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో నాయిని రాజేందర్‌రెడ్డి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ వంద అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారని, ప్రజలు వందసార్లు ముక్కు నేలకు రాసినా ఆయనను క్షమించే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలన కొబ్బరికాయలు కొట్టడం, శిలాఫలకాలు వేయడానికే పరిమితమైందని విమర్శించారు. నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు ఆ పార్టీని ఎందుకు ఓడించారని ప్రశ్నించారు.

కాళోజీ కళాక్షేత్రం.. గత పాలన వైఫల్యానికి నిదర్శనం

కాళోజీ కళాక్షేత్రం నిర్మాణాన్ని ఉదాహరణగా చూపుతూ నాయిని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం సుమారు రూ.20 కోట్లతో పిల్లర్లు, స్లాబ్‌ పనులు చేపట్టి నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేసిందని ఆరోపించారు. నిర్మాణ నాణ్యతపై అనుమానాలు రావడంతో ఎన్‌ఐటీ నిపుణులతో పరిశీలన చేయించాల్సి వచ్చిందన్నారు. భవనం పటిష్టత కోసం మరో రూ.10 కోట్లు కేటాయించినప్పటికీ, ఆ నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనిపై విజిలెన్స్‌ విచారణ కొనసాగుతోందని తెలిపారు.
తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి, కుడా, పర్యాటక శాఖల సమన్వయంతో పనులను ముందుకు తీసుకెళ్లామని వివరించారు. కళాక్షేత్రం పూర్తి కోసం సుమారు రూ.80 కోట్ల నిధులు సమకూర్చి పనులు చేపట్టినట్లు తెలిపారు. గతంలో అసంపూర్తిగా వదిలేసిన పనులను పూర్తి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కాళోజీ కళాక్షేత్రం విషయంలో గత, ప్రస్తుత ప్రభుత్వాల పనితీరుపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

రింగ్‌రోడ్డు జీవో రద్దు.. విమానాశ్రయానికి అదనపు భూమి

వరంగల్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం హడావుడి చేసి శంకుస్థాపనలు చేసినప్పటికీ, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన జీవోనే రద్దయిందని నాయిని విమర్శించారు. వరంగల్‌ విమానాశ్రయానికి గతంలో 696 ఎకరాల 14 గుంటల భూమి మాత్రమే ఉండగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 253 ఎకరాలు సేకరించిందని తెలిపారు. ఇందుకోసం రూ.205 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు. విమానాశ్రయ అభివృద్ధిపై గత ప్రభుత్వం చేసిన ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో జరిగిన పనులకు పొంతన లేదని వ్యాఖ్యానించారు.
నగర తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.550 కోట్లతో వాటర్‌ వర్క్స్‌ ఆధునీకరణ పనులు చేపట్టామని తెలిపారు. నాలుగు అంగుళాల పైపుల స్థానంలో ఎనిమిది అంగుళాల పైపులు ఏర్పాటు చేస్తున్నామని, పనులు ప్రారంభమై యూనివర్సిటీ పరిసర ప్రాంతాలకు కూడా పైపులైన్లు చేరుకున్నాయని వివరించారు. పాలిటెక్నిక్‌, ఐటీఐ, మడవీధుల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు చెప్పారు. వరంగల్‌ అభివృద్ధిపై మాట్లాడే బీఆర్‌ఎస్‌ నాయకులు ఈ పనుల వివరాలనూ పరిశీలించాలని సూచించారు.

ఆధారాలతో చర్చకు సిద్ధం.. వేదిక మీరే నిర్ణయించండి!

వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో తాను చేపట్టిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు సిద్ధమని నాయిని ప్రకటించారు. హనుమకొండ చౌరస్తాలోనే చర్చకు రావాలని బీఆర్‌ఎస్‌ నాయకులకు సవాల్‌ విసిరారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఎన్ని నిధులు తీసుకొచ్చారు? ఏయే పనులు పూర్తి చేశారు? కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఖర్చు చేసింది? అనే వివరాలను జీవోలు, నిధుల కేటాయింపులు, ఇతర ఆధారాలతో ప్రజల సమక్షంలో వివరిస్తానన్నారు. వరంగల్‌ పశ్చిమలో అభివృద్ధి చేశామని చెప్పుకునే బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజల తీర్పును ఎందుకు ఎదుర్కోలేకపోయారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మాస్టర్‌ ప్లాన్‌ను కూడా సక్రమంగా అమలు చేయలేని గత పాలకులు ఫ్యూచర్‌ సిటీ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ప్రాజెక్టులను ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసి, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిందలు వేయడం బీఆర్‌ఎస్‌ నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు.

అప్పుల తెలంగాణను అభివృద్ధి బాట పట్టిస్తున్నాం

ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అందించలేకపోయారని విమర్శించారు. నిరుపయోగంగా, శిథిలావస్థకు చేరిన ఇళ్లకు కాంగ్రెస్‌ ప్రభుత్వం నిధులు వెచ్చించి మరమ్మతులు చేపట్టి లబ్ధిదారులకు అందజేస్తోందన్నారు. గత ప్రభుత్వం విద్యావ్యవస్థపై సరైన సమీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. తెలంగాణను సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన గత పాలకులు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి అదే పరిస్థితి ఎదురవుతుందని వ్యాఖ్యానించారు. వరంగల్‌ విమానాశ్రయానికి సంబంధించి కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండున్నరేళ్లలో కీలక ముందడుగు వేసిందని, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిందని తెలిపారు. హనుమకొండలో ఐటీ టవర్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, స్థల పరిశీలన చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారని వెల్లడించారు. కాళోజీ కళాక్షేత్రం రెండో అంతస్తులను కమర్షియల్‌ కాంప్లెక్స్‌కు అద్దెకు ఇచ్చేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే జీవోలు జారీ చేసిందని గుర్తుచేశారు. ఈ సమావేశంలో కుడా చైర్మన్‌ గుండు సుధారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అజీజ్‌ఖాన్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ సంగ వెంకట్రాజం, హనుమకొండ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పులి ప్రియాంక, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.