* ఔట్ సోర్సింగ్ నియామకాల్లో అక్రమార్గం
* ఎంప్యానెల్ మెంట్ లేని ఏజెన్సీ సంస్థకు అప్పగింత
* పారదర్శక విధానానికి ఈఎస్ఐ తూట్లు
* సెక్రటరీ స్థాయిలో చక్రం తిప్పిన కొత్త ఏజెన్సీ
* వరంగల్ ఈఎస్ఐలో నియామకాల భారీ వసూళ్లకు స్కెచ్
అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి: ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో కీలకంగా వ్యవహరించే కొన్ని ఏజెన్సీలు నిబంధనలు విరుద్ధంగా నియామకాలు చేస్తున్నాయి. అధికారం, పలుకుబడి అడ్డు పెట్టుకొని ఏజెన్సీలు పుట్టుకు వస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వరంగ సంస్థల్లో ఉండే అవసరాలను క్యాష్ చేసుకునే విధంగా ఏజెన్సీలు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో హైద్రాబాద్ కేంద్రంగా నక్షత్ర అనే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ వరంగల్ ఈఎస్ఐ ఆసుపత్రిలో పాగావేసినట్టు తెలుస్తున్నది. పైగా ఈ ఏజెన్సీకి ఎలాంటి అర్హతలు కూడా లేవని తెలుస్తున్నది. జిల్లాలో వీరికి ఎంప్యానెల్ మెంట్ లేదని తెలుస్తున్నది. అయినా హైద్రాబాద్ లోని ఈఎస్ఐ సెక్రటరీ స్థాయిలో పలుకుబడి ఉపయోగించి ఇక్కడ భారీ వసూళ్లతో నియామకాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది.
ఎంప్యానల్ మెంట్ లేని ఏజెన్సీకి అనుమతి
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్న ఏజెన్సీకి మాత్రమే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకుంటే అనుమతులు ఇస్తారు. ఏ జిల్లాలో అయినా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నియామకాలు చేపట్టాలి అంటే ఆయా జిల్లాల్లో ఆ ఏజెన్సీ కి ఎంప్యానెల్ మెంట్ ఖచ్చితంగా ఉండాలి. కానీ వరంగల్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకానికి ఇటీవలే ఒక కొత్త ఏజెన్సీ రంగంలోకి దిగింది. హైద్రాబాద్ కి చెందిన నక్షత్ర అనే ఏజెన్సీకి జిల్లాలో ఎలాంటి ప్రాథమిక అనుమతులు లేకుండానే ఇక్కడ సిబ్బంది నియామకాలు చేపడుతున్నట్టు తెలిసింది. దీనికి ఉన్నత స్థాయి అధికారుల హస్తం ఉన్నట్టు చెబుతున్నారు. జిల్లాలో ఒక ఏజెన్సీకి తప్పనిసరిగా ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. వీటితో పాటుగా ఈపీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ సర్టిఫికెట్లు, లేబర్ లైసెన్సు, ప్రొవిజనల్ టాక్స్ సైతం ఉండాలి. వీటి ఆధారంగా వారి గత ఎక్స్పీరియన్స్ ను కూడా పరిగణనలోకి తీసుకొని నియామకాల ప్రక్రియను అప్పగించాలి. కానీ ఇవేవీ పాటించకుండా, నిబంధనలు లేకుండానే కొత్తగా వచ్చిన ఏజెన్సీ నియామకాలు చేపడుతున్నది.
భారీ లాబీయింగ్…
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగ నియామకాలకు థర్డ్ పార్టీగా వ్యవహరించే ఏజెన్సీలు ఉద్యోగుల నియామకాల్లో భారీ అవకతవకలకు పాల్పడుతుంటాయి. అందుకే ఈ ఏజెన్సీలు ఉన్నతాధికారుల అండతో చక్రం చూపుతుంటారు. అదే విధంగా నక్షత్ర ఏజెన్సీ హైద్రాబాద్ లోని ఈఎస్ఐ సెక్రటరీ స్థాయిలో భారీ లాబీయింగ్ చేసినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఉన్న ఏజెన్సీని పక్కన బెట్టి కొత్త వారికి ఇవ్వడమే కాకుండా, కనీసం ఎంప్యానల్ మెంట్ కూడా లేని ఏజెన్సీకి కట్టబెట్టడంలో మతులబు ఏమిటనేది అధికారులకే తెలియాలి. ఉత్తర తెలంగాణలో అతి పెద్దదైన ఈఎస్ఐ ఆసుపత్రిలో కొత్తగా అక్రమ నియామకాలకు ఉన్నత స్థాయిలో పనిచేసే ఒక అధికారి వీరికి అండగా ఉన్నట్టు తెలుస్తున్నది. హైద్రాబాద్ ఈఎస్ఐ కార్యాలయ కేంద్రంగానే వీరికి అనుమతులు లభించాయని తెలుస్తున్నది.