డైరెక్ట్ సీడింగ్ వరి సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులకు తీవ్ర నష్టం
నర్సంపేట ప్రాంతంలో ఎండిపోతున్న వరి పొలాలు
గురిజాల గ్రామంలోనే సుమారు 200 ఎకరాల్లో దెబ్బతిన్న వరి
రెండున్నర ఎకరాలకు రూ.60 వేల పెట్టుబడి.. చేతికందని దిగుబడి
ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్
వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఆదుకోవాలని వేడుకోలు
అక్షరశక్తి, నర్సంపేట: కళ్లముందే ఎండిపోతున్న వరి.. పంట పొలాల్లో పశువుల మేత.. చేతికొస్తుందనుకున్న పంట కళ్లెదుటే బూడిదవుతుంటే అన్నదాత గుండె చెరువవుతోంది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వస్తుందన్న ఆశతో ప్రభుత్వ సూచన మేరకు వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసిన రైతులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో సుమారు 200 ఎకరాల్లో సాగైన వరి పంట వర్షాభావంతో ఎండిపోవడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి నేలపాలవుతుండగా.. పంట చేతికందకముందే పొలాలు పశువులకు మేతగా మారుతున్న దుస్థితి నెలకొంది. డైరెక్ట్ సీడింగ్ సాగు విధానాన్ని ప్రోత్సహించిన ప్రభుత్వం.. ఇప్పుడు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేసి తక్షణ పరిహారం అందించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
ప్రోత్సాహం ఇచ్చారు.. ఆదుకునేదెవరు?
గత రెండేళ్లుగా తక్కువ పెట్టుబడితో వరి సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు. దీంతో ఈ ఏడాది కూడా నర్సంపేట ప్రాంతంలోని పలువురు రైతులు డైరెక్ట్ సీడింగ్ పద్ధతిని ఎంచుకున్నారు. నర్సంపేట మండలం గురిజాల గ్రామ రెవెన్యూ పరిధిలోనే సుమారు 200 ఎకరాల్లో వరి సాగు చేశారు. అయితే పంట కీలక దశకు చేరుకున్న సమయంలో వర్షాలు కురవకపోవడంతో పొలాల్లో తేమ తగ్గి పంటలు ఎండిపోతున్నాయి. సాగు కోసం అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అయితే, నర్సంపేటను కరువు మండలంగా ప్రకటించినా.. ఇప్పటివరకు ఎలాంటి సర్వే చేయలేదని, తమకు పరిహారం విషయంలో భరోసా కల్పించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి మొత్తం నేలపాలు
గురిజాల గ్రామానికి చెందిన ఓ రైతు రెండున్నర ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేశాడు. విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చుల కోసం సుమారు రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు లేకపోవడంతో పొలంలోని వరి పూర్తిగా ఎండిపోయింది. నెలల తరబడి కష్టపడినా ఫలితం దక్కకపోవడంతో ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఒక్క రైతు పరిస్థితి మాత్రమే కాదు.. గ్రామంలో ఇదే పద్ధతిలో సాగు చేసిన అనేకమంది రైతులు ఇలాంటి దుస్థితినే ఎదుర్కొంటున్నారు.
క్షేత్రస్థాయిలో సర్వే చేయాలి
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు సమయంలో అధికారులు సూచించిన పద్ధతిని అనుసరించి పంటలు వేసిన తమకు ఇప్పుడు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే గురిజాల గ్రామంలో పర్యటించి పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయాలని కోరుతున్నారు. ఎండిపోయిన పొలాలను పరిశీలించి, సాగు చేసిన విస్తీర్ణం, పెట్టుబడి, పంట నష్టాన్ని నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలి
ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, వ్యవసాయ అధికారులతో సమగ్ర సర్వే చేయించి ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సాగు విధానాన్ని ప్రోత్సహించిన ప్రభుత్వం, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్నప్పుడు కూడా రైతులకు అండగా నిలవాలని కోరుతున్నారు. పంట నష్టం అంచనాలో జాప్యం జరిగితే పరిహారం అందే అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా వ్యవసాయ అధికారులు, ఉన్నతాధికారులు గురిజాల గ్రామాన్ని సందర్శించి రైతుల గోడు వినాలని, ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.
ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలి
– మోటూరి రవి, బీఆర్‌ఎస్ పార్టీ క్లస్టర్ ఇన్‌చార్జి
గత రెండేళ్లుగా వ్యవసాయ అధికారులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని సూచించడంతో రైతులు డైరెక్ట్ సీడింగ్ పద్ధతిలో వరి సాగు చేశారు. ఈ ఏడాది గురిజాల గ్రామ రెవెన్యూ పరిధిలో సుమారు 200 ఎకరాల్లో పంట వేశారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. రైతులు పెట్టిన పెట్టుబడిని కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో సర్వే చేయించి, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించి ఆదుకోవాలి.
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి
– అల్లి రవి, రైతు – గురిజాల
నేను రెండున్నర ఎకరాల్లో విత్తనాలు వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేశాను. పంట సాగు కోసం ఇప్పటివరకు సుమారు రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాను. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు లేక ఎల్‌నినో ప్రభావంతో పంట మొత్తం ఎండిపోయింది. ఎంతో కష్టపడి సాగు చేసిన పంట కళ్లముందే ఎండిపోతుంటే బాధగా ఉంది. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగొచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం స్పందించి పంట నష్టాన్ని పరిశీలించి మాలాంటి రైతులను ఆదుకోవాలి.
మూడున్నర ఏకరాల్లో వరి ఎండిపోయింది
– బండారి చిన్న వెంకటేశ్వర్లు – రైతు
విత్తనాలు చల్లే పద్ధతిలో మూడున్నర ఎకరాలలో వరి సాగు చేసిన సుమారు 90 వేల వరకు పెట్టుబడి ఖర్చు అయింది. పంట చేతికి వచ్చే సమయంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పంట మొత్తం ఎండిపోయింది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. పరిహారం ఇవ్వాలి.