దీక్షా దివస్ చిహ్నం వెనుక జోరిక రమేష్ పోరాట ప్రస్థానం
కేసీఆర్ నిరాహార దీక్షకు మద్దతుగా విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర
2009 నవంబర్ 17న కేయూలో 12 విద్యార్థి సంఘాలతో తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆవిర్భావం
వ్యవస్థాపక కో-కన్వీనర్‌గా జోరిక రమేష్.. ఐదేళ్లపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు
కేసీఆర్ అరెస్టుకు నిరసనగా కేయూ క్రాస్‌రోడ్స్ వద్ద విద్యార్థి జేఏసీ ఆందోళన
కార్పొరేటర్‌గా దీక్షా దివస్ స్ఫూర్తి చిహ్నం ఏర్పాటుకు ప్రతిపాదన.. పాలకవర్గం ఏకగ్రీవ ఆమోదం
రూ.5 లక్షల నిధుల కేటాయింపు.. 2021 ఫిబ్రవరి 7న కార్పొరేషన్ ఆవరణలో ఆవిష్కరణ
అక్షరశక్తి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థి శక్తి పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఉద్యమ నేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ ఉద్యమం కీలక మలుపు తిరిగిన నవంబర్ 29ను దీక్షా దివస్‌గా గుర్తుచేసుకుంటున్న వేళ.. ఆ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు వరంగల్‌లో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ స్ఫూర్తి చిహ్నం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ చిహ్నం ఏర్పాటు వెనుక తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ కృషి ఉంది. విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించి, ప్రజాప్రతినిధిగా దీక్షా దివస్ చరిత్రకు శాశ్వత గుర్తింపు తీసుకురావాలన్న సంకల్పంతో ఆయన చేసిన ప్రయత్నం ఈ నిర్మాణానికి పునాది వేసింది. నవంబర్ 29న దీక్షా దివస్ సందర్భంగా అక్షరశక్తి అందిస్తున్న ప్రత్యేక కథనం.
విద్యార్థి ఉద్యమంలో కీలక అడుగు..
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా 2009 నవంబర్ 17న కాకతీయ యూనివర్సిటీలో 12 విద్యార్థి సంఘాలతో తెలంగాణ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆవిర్భవించింది. తెలంగాణలో ఏర్పాటైన తొలి జాయింట్ యాక్షన్ కమిటీగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉందని ఉద్యమకారులు పేర్కొంటారు. ఈ జేఏసీ ఆహ్వానం మేరకు నవంబర్ 23న కేయూ కాన్వొకేషన్ మైదానంలో ఉద్యమ నేత కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పాల్గొన్న సభ నిర్వహించారు. ఈ సమయంలో జోరిక రమేష్ జేఏసీ వ్యవస్థాపక కో-కన్వీనర్‌గా వ్యవహరించారు. అనంతరం ఐదేళ్లపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థి జేఏసీ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

కేసీఆర్ అరెస్టు.. కేయూలో నిరసన జ్వాలలు
2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరిన కేసీఆర్‌ను అప్పటి పోలీసులు కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తా వద్ద అరెస్టు చేసి, వరంగల్ మీదుగా ఖమ్మంకు తరలించారు. ఈ పరిణామంపై విద్యార్థి జేఏసీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేయూ క్రాస్‌రోడ్స్ వద్ద కేసీఆర్‌ను తరలిస్తున్న కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేసి విద్యార్థులను చెదరగొట్టారు. అనంతరం కేసీఆర్‌ను ఖమ్మం జైలుకు తరలించారు. ఈ ఘటనతో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల భాగస్వామ్యం మరింత ఉధృతమైంది. ఆ సమయంలో జోరిక రమేష్ విద్యార్థి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమంలో భాగంగా కేసులు, నిర్బంధాలను ఎదుర్కొంటూ ముందుకు సాగారు.

ఉద్యమ నాయకుడి నుంచి కార్పొరేటర్‌గా..
విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన జోరిక రమేష్‌కు 2016లో జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అప్పటి టీఆర్‌ఎస్ పార్టీ 34వ డివిజన్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఉద్యమ కాలంలో తాను చూసిన పోరాట స్ఫూర్తిని భావితరాలకు పరిచయం చేయాలన్న ఆలోచనతో దీక్షా దివస్‌కు శాశ్వత గుర్తుగా ఒక స్ఫూర్తి చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో 2020 నవంబర్ 29న జరిగిన మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో దీక్షా దివస్ విశిష్టతను వివరిస్తూ నగరంలో ప్రత్యేక చిహ్నం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ఏకగ్రీవ తీర్మానం.. రూ.5 లక్షల నిధులు
జోరిక రమేష్ ప్రతిపాదనకు మున్సిపల్ పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీక్షా దివస్ పైలాన్ నిర్మాణం కోసం జోరిక రమేష్ కన్వీనర్‌గా నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందుకోసం కార్పొరేషన్ రూ.5 లక్షల బడ్జెట్‌ను కేటాయించింది. రెండు నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి, 2021 ఫిబ్రవరి 7న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో దీక్షా దివస్ స్ఫూర్తి చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అప్పటి మేయర్ గుండా ప్రకాశ్‌రావు, అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, అప్పటి ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

ఉద్యమ చరిత్రకు గుర్తుగా..
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు ఉన్న ప్రాధాన్యాన్ని, విద్యార్థి సంఘాల పోరాటాన్ని భావితరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ స్ఫూర్తి చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలోనే ప్రత్యేకంగా దీక్షా దివస్ స్ఫూర్తిని ప్రతిబింబించే చిహ్నంగా ఇది నిలిచిందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. విద్యార్థి ఉద్యమంలో నాయకత్వ బాధ్యతలు నిర్వహించిన జోరిక రమేష్.. కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో ఆ ఉద్యమ చరిత్రకు ఒక నిర్మాణ రూపం కల్పించేందుకు చేసిన ప్రయత్నం ఈ చిహ్నం ద్వారా గుర్తుండిపోతోంది. ప్రతి నవంబర్ 29న దీక్షా దివస్ సందర్భంగా ఈ చిహ్నం తెలంగాణ ఉద్యమ పోరాట ఘట్టాలను, విద్యార్థుల త్యాగాలను మరోసారి గుర్తుచేస్తోంది.