మానుకోట ఏరియా దవాఖానలో చికిత్స
అక్షరశక్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో
ఫుడ్ పాయిజన్ అయి 35 మంది విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో రాత్రి టమాటా కర్రీతో భోజనం చేసిన విద్యార్థినులు ఉదయం అస్వస్థతకు గురైనట్లు సమాచారం. 15 మందికి వాంతులు, విరోచనాలు కావడంతో పరిస్థితిని గమనించిన టీచర్లు.. విద్యార్థినులను జిల్లా దవాఖనకు తరలించారు. విద్యార్థినులను పరీక్షించిన డాక్టర్లు ఫుడ్ పాయిజన్ అయిందని నిర్ధారించారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
నిర్లక్ష్యమే కారణం ?
కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ ఘటనకు సదరు అధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా అప్రమత్తమైన యాజమాన్యం విషయం బయటకు పొక్కొద్దనే ఉద్దేశంతో డాక్టర్లను పిలిపించి పాఠశాలలోనే విద్యార్థినులకు సీక్రెట్‌గా ట్రీట్‌మెంట్ అందించినట్లు సమాచారం. పరిస్థితి విషమిస్తుండటంతో ఆందోళనలకు గురై ఇవాళ ఉదయం ఏరియా దవాఖానకు తరలించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సంఘటనపై పలు విద్యార్థి సంఘాలు భగ్గమంటున్నాయి. దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ పరామర్శించారు. మెరుగైన వైద్య అందించాలని వైద్యులను ఆదేశించారు.