Saturday, September 7, 2024

వ‌రంగ‌ల్‌లో మ‌రో క‌బ్జాబాగోతం

Must Read
  • చారిత్ర‌క కార్మిక భ‌వనాన్ని రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న ఓ నేత‌!
  • ఆ ప‌త్రాల‌తో బ్యాంకు నుంచి పెద్ద‌మొత్తంలో లోన్‌?
  • ఆ త‌ర్వాత ప్ర‌ముఖ షాపింగ్ మాల్‌కు అమ్మ‌కం!
  • 1957లో ఆజంజాహి మిల్స్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ కార్యాల‌యం ఏర్పాటు
  • వ‌రంగ‌ల్ వెంక‌ట్రామ టాకీస్ స‌మీపంలో 1400 గ‌జాల స్థ‌లం
  • ప్ర‌ధాన ర‌హ‌దారి ప‌క్క‌నే అత్యంత విలువైన ప్రాంతం
  • ద‌శాబ్దాలపాటు కార్మికుల కార్య‌క‌లాపాలు
  • యూనియ‌న్ నిర్వీర్యంతో ప‌డావుప‌డిన ఆఫీస్‌
  • తీవ్ర ఆందోళ‌న‌లో కార్మికులు

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంలో మ‌రో బ‌డా భూ క‌బ్జా బాగోతం బ‌య‌ట‌ప‌డింది. ఇన్నిరోజులూ.. వ్యక్తిగ‌త ఖాళీ స్థ‌లాల‌ను మాత్ర‌మే ఆక్ర‌మించిన క‌బ్జారాయుళ్లు.. ఇప్పుడు ఏకంగా ఎంతో ఘ‌న‌మైన చ‌రిత్ర ఉన్న ఆజం జాహి మిల్స్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ కార్యాల‌యం, దాని ఖాళీ స్థ‌లాన్నే కొట్టేశారు. కాశీబుగ్గ నుంచి వెంక‌ట్రామ థియేట‌ర్‌కు వెళ్లే ప్ర‌ధాన ర‌హ‌దారి ప‌క్క‌నే ఉన్న‌ అత్యంత విలువైన సుమారు 1400 గ‌జాల‌ స్థ‌లాన్ని హాయిగా ఓ నేత త‌న పేరుపై రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న‌ట్లు స‌మాచారం. ఆ క‌బ్జా నేత అక్క‌డితోనే ఆగ‌కుండా.. ఏకంగా ఆ పత్రాలతో బ్యాంకు నుంచి కూడా పెద్ద‌మొత్తంలో లోన్ కూడా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. చివ‌ర‌కు, గ‌త ఏడాది వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంలో పేరుమోసిన షాపింగ్ మాల్ వారికి అమ్మేసిన‌ట్లూ స‌మాచారం. నాలుగైదు ఏళ్లుగా కొన‌సాగుతున్న ఈ త‌తంగం.. ఇప్పుడు వెలుగులోకి వ‌స్తోంది. దశాబ్దాలుగా త‌మ కార్య‌క‌లాపాల‌కు నిల‌యంగా ఉన్న‌.. పెద్ద పెద్ద నాయ‌కుల ప్ర‌సంగాల‌కు వేదిక‌గా నిలిచిన కార్యాల‌యం నేడు క‌బ్జాకు గురికావ‌డంతో కార్మికులు షాక్‌కు గుర‌వుతున్నారు. ఏం జ‌రిగిందో.. మ‌రేం జ‌ర‌గ‌బోతోందో తెలియ‌క కార్మికులు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు.

1957లో కార్యాల‌యం ఏర్పాటు..
వ‌రంగ‌ల్ ఆజంజాహి మిల్స్‌.. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద వ‌స్త్ర‌ప‌రిశ్ర‌మ‌.. సుమారు 10వేల మందికి ఉపాధి క‌ల్పించిన ఘ‌నమైన‌ చ‌రిత్ర‌.. ఆ కార్మికులు త‌మ హ‌క్కుల కోసం పోరాడ‌డానికి.. త‌మ క‌ష్ట‌సుఖాలు మాట్లాడుకోవ‌డానికి.. త‌మ కార్య‌క‌లాపాలు కొన‌సాగించ‌డానికి 1957లో పైసా పైసా చందాలు వేసుకుని సుమారు 1400 గ‌జాల‌ స్థ‌లం కొనుక్కొని కార్యాల‌యం నిర్మించుకున్నారు. అంత‌కుముందు వ‌రంగ‌ల్ రైల్వేస్టేష‌న్ స‌మీపంలోని ఎస్ఎన్ ఎం క్ల‌బ్ స‌మీపంలో కార్యాల‌యం ఉండ‌గా… దానిని పార్క్‌గా చేర్పాటు చేస్తామ‌ని నాటి అధికారులు చెప్ప‌డంతో కాశీబుగ్గ నుంచి వెంక‌ట్రామ థియేట‌ర్‌కు వెళ్లే మార్గంలో సెంట్ర‌ల్ వేర్ హౌసింగ్ కార్పొరేష‌న్ ప‌క్క‌నే కార్మికులంతా చందాలు వేసుకుని స్థ‌లం కొనుకున్నారు. ఆ త‌ర్వాత కార్యాల‌యం నిర్మించుకున్నారు. ఇక అప్ప‌టి నుంచి ఆ కార్యాల‌యం కార్మికుల కార్య‌క‌లాపాల‌కు నిల‌యంగా మారింది. ఇప్ప‌టికీ రాజ‌కీయాల్లో ఉన్న ప‌లువురు పెద్ద నాయ‌కులు అనేక‌సార్లు ఆ కార్యాల‌యంలో కార్మికుల‌తో స‌మావేశాలు ఏర్పాటు చేసిన సంద‌ర్భాలూ ఉన్నాయి.

యూనియ‌న్ బ‌ల‌హీన ప‌డడంతో…
ఆజంజాహిమిల్స్ దెబ్బతిన‌డం.. క్ర‌మంగా కార్మికుల సంఖ్య త‌గ్గుతూ ఉండ‌డం.. చివ‌ర‌కు ఎన్‌టీసీ మిల్స్ ఆస్తుల‌ను అమ్మేయ‌డం, యూనియ‌న్ పూర్తిగా నిర్వీర్యం కావ‌డంతో కార్మికుల కార్య‌క‌లాపాలు త‌గ్గిపోయాయి. దీంతో దాదాపుగా కార్యాల‌యం ఉనికి కోల్పోయింది. ఇప్ప‌టికీ కొద్దిగొప్ప‌గా ఉన్న కార్మికులు అప్పుడో ఇప్పుడో అటువైపుగా వ‌చ్చిపోవ‌డం జ‌రుగుతోంది. అయితే.. ఇదే అద‌నుగా ఆ కార్యాల‌యంపై క‌న్నేసిన ఓ నేత‌ త‌ప్పుడు ప‌త్రాలు సృష్టించి త‌న పేరుపై 1400 గ‌జాల స్థ‌లాన్ని రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న‌ట్లు స‌మాచారం. ఈ ప‌త్రాల‌తో ఏకంగా 2018లో ఓ బ్యాంకు నుంచి పెద్ద‌మొత్తంలో లోన్ కూడా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అంతేగాకుండా, 2022 సెప్టెంబ‌ర్‌లో ఏకంగా వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంలో ప్ర‌ముఖ షాపింగ్ మాల్‌కు అమ్మేసిన‌ట్లు స‌మాచారం. అయితే.. ఇప్ప‌టికీ ఆ కార్యాల‌యం అలాగే ఉంది. కానీ.. పేప‌ర్ల‌లో మాత్రం ఈ త‌తంగం అంతా న‌డిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు ఇదే విష‌యం నాలుగైదు రోజులుగా వ‌రంగ‌ల్ ఆజంజాహిమిల్స్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ కార్మికుల్లో హాట్‌టాపిక్ న‌డుస్తోంది.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img