అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సమాజం నాయకుడు భైరి నరేశ్‌ను వరంగల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేశ్‌ను సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ట్రేస్ చేసిన వికారాబాద్ పోలీసులు ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా వరంగల్ వద్ద అరెస్ట్ చేశారు. హిందూ దేవుళ్లతోపాటు అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ కొడంగల్ లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. నరేష్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రవ్యాపంగా అయ్యప్ప భక్తులతోపాటు వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎక్కడిక్కడ ఆందోళన నిర్వహించి బైరి నరేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈక్రమంలోనే రెండు రోజులుగా కనిపించకుండా పోయిన భైరి నరేష్ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. వరంగల్‌లో శనివారం ఉదయం నరేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కొడంగల్ పోలీస్ స్టేషన్ కు తరలించనున్నట్టు తెలుస్తుంది. నరేష్ ను అరెస్ట్ చేశాం. చర్యలు తీసుకుంటాం. అయ్యప్ప స్వాములు ఆందోళనలు విరమించుకోవాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఈసందర్బంగా ఎస్పీ కోటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా మీటింగ్ లు పెట్టుకున్నప్పుడు ఇలాంటి వా రిని ప్రోత్సాహించవద్దు. అలాంటి వారిని పిలవొద్దని సూచించారు. ఇలాంటి వారిని ప్రోత్సహించే వారిని కూడా వదిలిపెట్టేది లేదన్నారు. మత విద్వేషాలను ఉపేక్షించేది లేదు. ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోటిరెడ్డి హెచ్చరించారు. ఇతరుల మనోభావాలకు ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడినా లేక ప్రవర్తించిన ఊరుకునేది లేదని ఆయన స్పష్టంచేశారు.