- రాజేంద్రా.. పద్దతి మార్చుకో..
- బీఆర్ఎస్ కార్యకర్తల జోలికస్తే ఉరుకునేది లేదు
- అభద్రతాభావంతోనే ఆరోపణలు
- అమాయకులపై కేసులు పెట్టించి
- చిత్రహింసలు పెట్టించింది రాజేందరే..
- ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి
అక్షరశక్తి, హుజురాబాద్ : బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఖబర్దార్ ఈటల … పద్ధతి మార్చుకో.. అంటూ హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోం.. అమాయకులపై కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టిన చరిత్ర నీది అంటూ కౌషిక్‌రెడ్డి దుయ్యబట్టారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈటలపై విమర్శలు గుప్పించారు. కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈటల రాజేందర్‌ను అక్కడున్న ప్రజలు ప్రశ్నిస్తే బీజేపీ గుండాలు అతి క్రూరంగా దౌర్జన్యంగా దాడి చేశారని ఆరోపించారు. ఈటల ప్రోద్బలంతోనే ప్రజలతోపాటు తమ పార్టీ కార్యకర్తలపై అకారణంగా దాడి చేశారన్నారు. తాము తలుచుకుంటే ఈటల ఒక్కరోజు కూడా నియోజకవర్గంలో తిరగలేడని హెచ్చరించారు. కానీ తాను ఎప్పుడు ప్రజాస్వామ్యయుతంగా వెళ్తున్నానని అన్నారు. ఈటల రాజేందర్ కావాలనే బీజేపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ గ్రామాల్లో ప్రశాంత వాతావరణం చెడగొడుతున్నాడని మండిపడ్డారు. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా దొంగే దొంగ దొంగ అని అరచినట్లుగా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. రోజురోజుకు నియోజకవర్గంలో ఉనికిని కోల్పోతున్నాననే అభద్రతా భావంతో ఈటల ఆరోపణలు చేస్తున్నారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.
ఈటల చరిత్ర ప్రజలకు తెలుసు
బీజేపీ నేత ఈటల రాజేందర్ గొప్ప నటుడని, ఆయనకు నంది అవార్డు ఇవ్వొచ్చని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఎద్దేవా చేసారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడారనే అక్కసుతో ఎంతో మంది అమాయకులైన దళిత, బడుగు, బలహీన వర్గాల బిడ్డలపై పోలీసు కేసులు పెట్టించి నిర్దాక్షిన్యంగా పోలీసు స్టేషన్లో పెట్టించి చిత్రహింసలు పెట్టించిన చరిత్ర ఈటలదని, ఈ విషయం ప్రజలందరికి తెలుసన్నారు. ఆయనపై గతంలో పలు హత్యలకు సంబంధించి కూడా ఆరోపణలు ఉన్న విషయం వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. అంతేగాక బడుగు, బలహీన వర్గాలు, దళితుల అసైన్డ్ భూములు ఆక్రమించారని మండిపడ్డారు. ఈ విషయాలన్నీ హుజురాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద నిరూపిస్తామని సవాల్ చేశారు. హుజురాబాద్ లో ఇటీవల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జమ్మికుంటలో నిర్వహించిన సభ పెద్ద ఎత్తున విజయవంతం కావడాన్ని ఈటలతో పాటు బీజేపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని ఆయన అన్నారు. ఈటల సొంత గ్రామం కమలాపూర్‌లో కేటీఆర్ పర్యటన విజయవంతం కావడంతో సహించలేక పోతున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈటల పోలీసు కేసుల గురించి మాట్లాడడం, దాడుల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల్లో మరోసారి సానుభూతి పొందేందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడని, నీతి మాలిన ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. భవిష్యత్తులో హుజురాబాద్ ప్రజలకు ఈటలకు తగిన బుద్ధి చెప్తారని కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు.