Saturday, September 7, 2024

జ‌న‌గామ బీఆర్ఎస్‌లో బిగ్‌ట్విస్ట్‌!

Must Read
  • జ‌న‌గామ బీఆర్ఎస్‌లో బిగ్‌ట్విస్ట్‌!
  • టికెట్ రేసులో రెడ్డి ఉమాదేవి
  • తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర‌
  • గ‌తంలో నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా బాధ్య‌త‌లు
  • ఉద్య‌మ‌కారిణిగా ప్ర‌జ‌ల్లో గుర్తింపు
  • పార్టీ అధినేత కేసీఆర్ ప‌రిశీల‌న‌లో ఆమె పేరు?
  • వేగంగా మారుతున్న స‌మీక‌ర‌ణాలు
  • ఉత్కంఠ‌రేపుతున్న రాజ‌కీయాలు

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : జ‌న‌గామ బీఆర్ఎస్‌లో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్ ఉత్కంఠ‌లో మ‌రో బిగ్‌ట్విస్ట్ ఏర్ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి పోటీప‌డుతున్న వేళ‌.. కొత్త‌గా తెలంగాణ ఉద్య‌మ‌కారిణి రెడ్డి ఉమాదేవి పేరు తెర‌మీద‌కు వ‌స్తోంది. జ‌న‌గామ ప్రాంతంలో అత్యంత ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి తెలంగాణ ఉద్య‌మాన్ని నిల‌బెట్టిన మ‌హిళ‌గా జ‌నంలో గుర్తింపు సాధించుకున్న రెడ్డి ఉమాదేవి పేరును పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ఎస్‌లో నెల‌కొన్న గంద‌ర‌గోళ‌ ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణ‌గ‌డానికి ఆమెకు టికెట్‌ ఇచ్చే యోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు ఉమాదేవికి సానుకూల సంకేతాలు కూడా అందిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్య‌మకారిణిగా, స్థానికురాలిగా, ఒక మ‌హిళ‌గా.. ఆమెకు టికెట్ ఇస్తే.. జ‌న‌గామ‌లో బీఆర్ఎస్ గెలుపు సుల‌భం అవుతుంద‌న్న అంచ‌నాలో కేసీఆర్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

  • తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర‌..
    రెడ్డి ఉమాదేవి స్వ‌గ్రామం జ‌న‌గామ జిల్లా లింగాల‌ఘ‌న‌పురం మండ‌లం చీటూరు. కేసీఆర్ పిలుపు మేర‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌దిలి తెలంగాణ ఉద్య‌మంలోకి వ‌చ్చారు. ఈ ప్రాంతంలో 2003 నుండి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ప్ర‌ధానంగా టీఆర్ఎస్ పార్టీలో కీల‌క పాత్ర‌పోషించారు. ఈ క్ర‌మంలో గులాబీ బాస్ కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితురాలిగా గుర్తింపు పొందారు. కేసీఆర్ కుటుంబంలో ఒక‌రిగా అన్నా.. అని పిలిచే సాన్నిహిత్యం ఆమెకు ఉంది. 2007, 08 సంవత్సరాల్లో జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉమాదేవి పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. ప్ర‌ధానంగా జనగామలో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ విజ‌య‌వంతంలో స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేశారు. 2009లో ఉప్పల్ టీఆర్ఎస్ టికెట్ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినా కొన్ని సమీకరణాలతో చివ‌రినిమిషంలో ఆమెకు టికెట్ రాలేదు. అయినా తెలంగాణ రాష్ట్ర సాధ‌నే ధ్యేయంగా ఆమె ప‌నిచేస్తూ వ‌చ్చారు. అయితే.. జ‌న‌గామ టికెట్ కోరుతూ.. ఉమాదేవి కూడా ఇటీవ‌ల కేసీఆర్‌ను క‌లిసిన‌ట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో కష్టపడ్డాను.. రాత్రింబవళ్లు ఉద్యమంలో పనిచేశాను.. త‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని కోరిన‌ట్లు స‌మాచారం.
  • ప‌రిశీల‌న‌లో ఆమె పేరు కూడా..
    జ‌న‌గామ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డితోపాటు ఎమ్మెల్సీలు ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డిలు పోటీ ప‌డుతున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గ పార్టీలో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. దీంతో ఏం జ‌రుగుతుందోన‌ని పార్టీ శ్రేణులు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థుల మొద‌టిజాబితాలోనూ జ‌న‌గామ అభ్య‌ర్థి పేరును కేసీఆర్ ఖ‌రారు చేయ‌కుండా పెండింగ్‌లో ఉంచారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఈ ముగ్గురిలో టికెట్ ఎవ‌రికి ఇచ్చినా.. మ‌రో ఇద్ద‌రి నుంచి స‌హ‌కారం అంద‌డం క‌ష్టంగానే క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒక‌రి వ‌ర్గం మ‌రొక‌వ‌ర్గంతో క‌లిసి ప‌నిచేయ‌లేని, తిర‌గ‌లేని ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే.. అనూహ్యంగా రెడ్డి ఉమాదేవి పేరు ప‌రిశీల‌న‌లోకి వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. స్థానికురాలిగా, తెలంగాణ ఉద్య‌మ‌కారిణిగా, ఈ ప్రాంత ఆడ‌బిడ్డ‌గా.. ఆమెకు అవ‌కాశం ఇస్తే.. జ‌నంలోనూ సానుకూల స్పంద‌న ల‌భిస్తుంద‌ని, పార్టీలో ఎలాంటి గ్రూపుత‌గాదాలు లేకుండా గెలుపు సులువు అవుతుంద‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రికొద్ది రోజుల్లోనే ఈ విష‌యంలో మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

 

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img