Monday, July 22, 2024

భూపాల‌ప‌ల్లిలో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్

Must Read
  • కాంగ్రెస్‌లోకి ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కుల క్యూ
  • ప్ర‌తీరోజు వంద‌ల సంఖ్య‌లో చేరిక‌లు
  • అన్ని మండ‌లాల్లోనూ ఇదే ప‌రిస్థితి..
  • ఎమ్మెల్యే గండ్ర‌కు అంద‌ని సొంత‌పార్టీ స‌హ‌కారం
  • వ‌రుస షాకుల‌తో గంద‌ర‌గోళం

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాల్లోని కీల‌క నాయ‌కులు, ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులంద‌రూ కాంగ్రెస్ పార్టీలోకి క్యూక‌డుతున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ వ్యాప్తంగా వీస్తున్న కాంగ్రెస్ గాలి.. భూపాల‌ప‌ల్లిలో మ‌రింత బ‌లంగా వీస్తోంది. ఈసారి చేతికే మా ఓటు.. కాంగ్రెస్‌కే అనే మాట అంద‌రినోటా వినిపిస్తోంది. ప్ర‌ధానంగా తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మంలో కీల‌కంగా ప‌నిచేసిన నాయ‌కులంద‌రూ హ‌స్తం గూటికి చేరుతున్నారు. తాజాగా, బుధ‌వారం బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన‌ కొండాపూర్ సర్పంచ్ మామిడి రవి, బీఆర్ఎస్‌ పార్టీ జిల్లా నాయకులు లింగంపల్లి పాపారావు, గణపురం మండల సీనియర్ నాయకులు ఉపేందర్ రావు త‌దిత‌రులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ప‌రిణామాల‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి రోజురోజుకూ వెన‌క‌బ‌డిపోతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. చివ‌ర‌కు సొంత‌పార్టీ నాయ‌కుల నుంచి, ప్ర‌ధానం ఎమ్మెల్సీ సిరికొండ మ‌ధుసూద‌నాచారి వ‌ర్గం నుంచి స‌హకారం అంద‌క‌పోవ‌డంతో.. ఈ ఎన్నిక‌ల్లో గండ్ర‌కు క‌ష్ట‌కాలం మొద‌లైన‌ట్టేన‌నే వాద‌న రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో భూపాల‌ప‌ల్లిలో వార్ వ‌న్‌సైడేన‌ని, కాంగ్రెస్ అభ్య‌ర్థి గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావు గెలుపు ఖాయ‌మ‌ని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి.

వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లే..

భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. ప్ర‌ధానంగా నియోజ‌క‌వ‌ర్గంలోని భూపాల‌ప‌ల్లి ప‌ట్ట‌ణం, గ‌ణ‌పురం, మొగుళ్ల‌ప‌ల్లి, చిట్యాల‌, టేకుమ‌ట్ల‌, రేగొండ, శాయంపేట‌ మండలాల్లో బీఆర్ఎస్‌కు వ‌రుస ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. దాదాపుగా కీల‌క నాయ‌కులంద‌రూ కాంగ్రెస్ గూటికి ఇప్ప‌టికే చేరుకున్నారు. రేగొండ మండ‌లంలో పున్నం ర‌వి, మొగుళ్ల‌ప‌ల్లిలో రామ్‌న‌ర్సింహారెడ్డి, భూపాల‌ప‌ల్లి ప‌ట్ట‌ణంలో ఇప్ప‌టికే ఐదుగురు కౌన్సిల‌ర్లు కాంగ్రెస్‌లో చేరారు. ఇక గ‌ణ‌పురం మండ‌లం మొత్తం దాదాపుగా కాంగ్రెస్ అభ్య‌ర్థి గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావు వైపే ఉంద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. అదేవిధంగా, మావోయిస్టు పార్టీ కేంద్ర క‌మిటీ మాజీ స‌భ్యుడు, రెండున్న‌ర ద‌శాబ్దాలు విప్ల‌వోద్యమంలో అత్యంత కీల‌కంగా ప‌నిచేసిన గాజ‌ర్ల అశోక్ అలియాస్ ఐతు కాంగ్రెస్‌లో చేర‌డంతో చిట్యాల‌, టేకుమ‌ట్ల మండ‌లాల‌తోపాటు జిల్లా వ్యాప్తంగా పార్టీ అనూహ్యంగా మ‌రింత బ‌లం పుంజుకుంది. ఇక శాయంపేట మండ‌లంలోనూ కాంగ్రెస్ పార్టీ జోరు కొన‌సాగుతోంది. ప‌ర‌కాల వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ మాజీ చైర్మ‌న్ పోలెపాక శ్రీ‌నివాస్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

అన్ని మండ‌లాల్లో కాంగ్రెస్ గాలి…

భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో రోజురోజుకూ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు జోరందుకోవ‌డంతో ఈ ఎన్నిక‌ల్లో వార్ వ‌న్‌సైడేన‌నే టాక్ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తోంది. మ‌రికొద్ది రోజుల్లో మ‌రికొంద‌రు నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు, కార్య‌క‌ర్త‌లు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలోకి రావ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లు అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. కాంగ్రెస్‌లో చేరిన నాయ‌కులంద‌రూ ఎక్క‌డిక‌క్క‌డ విస్తృతంగా ప‌ర్య‌టిస్తూ ప్ర‌చారం చేస్తున్నారు. జ‌నంలోకి వెళ్తూ.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల‌ను వివ‌రిస్తున్నారు. ఇలా, బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌కుతోడు సొంత పార్టీ నాయ‌కుల నుంచే మ‌ద్ద‌తు లేక‌పోవ‌డంతో గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డికి భారీ షాక్ త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌పై ప్ర‌జ‌ల్లో సానుభూతి ఉంద‌ని, దీంతో ఆయ‌న గెలుపు ఖాయ‌మ‌నే చ‌ర్చ నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా సాగుతోంది.

 

 

 

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img