- ల్యాండ్ పూలింగ్ రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- రైతుల ఉద్యమంతో వెనక్కి తగ్గిన వైనం
- బాధితులతో ఎమ్మెల్యేల అంతర్గత సమావేశాలు
- భూసమీకరణను వెనక్కి తీసుకుంటామని స్పష్టం
- కేటీఆర్‌తోనే చెప్పించాలని అన్నదాతల డిమాండ్
- నేడోరేపో అధికారిక ప్రకటన
అక్షరశక్తి, వరంగల్ ప్రధాన ప్రతినిధి : కుడా (కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ) ఆధ్వర్యంలో చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం వెనక్కితగ్గింది. ప్రాణం పోయినా తమ భూములను వదులుకునే ప్రసక్తే లేదని బాధిత రైతులు తెగేసి చెప్పడంతోపాటు ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో పునారాలోచనలో పడిన ప్రభుత్వం ల్యాండ్‌పూలింగ్‌ను ఆపివేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈక్రమంలోనే బుధవారం ఉదయం పలువురు ఎమ్మెల్యేలు బాధిత రైతులతో అంతర్గతంగా సమావేశమయ్యారు. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత ల్యాండ్ పూలింగ్‌ను వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. రైతులు అధైర్యపడాల్సిన పనిలేదని, ప్రభుత్వం భూసేకరణను నిలిపివేస్తుందని హామీ ఇచ్చారు. అయితే.. ఎమ్మెల్యేల ప్రకటనను స్వాగతించిన అన్నదాతలు దీనిపై కొంత అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలతో కాకుండా స్వయంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్‌తోనే ల్యాండ్‌పూలింగ్‌ను వెనక్కి తీసుకుంటామని చెప్పించాలని కోరినట్లు సమాచారం. సానుకూలంగా స్పందించిన సదరు ఎమ్మెల్యేలు కేటీఆర్‌తోనే ప్రకటన చేయిస్తామని రైతులకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది.
నష్టపోతామనే ఆలోచనతోనే..
హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లోని 27 గ్రామాల్లో ఔటర్‌రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న 21,510.02 ఎకరాల భూమి సమీకరణకు కుడా ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. తమకు తెలియకుండా రహస్యంగా సర్వే చేయడంపై, ఎలాంటి సమాచారం లే కుండానే ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌లో తమ భూముల సర్వే నంబర్లు వేయడంపై రైతులు భగ్గుమంటున్నారు. తమ పొట్టమీద కొట్టవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఐదు నియోజకవర్గాల పరిధిలోని 27 గ్రామాల రైతుల నుంచి, కూలీల నుంచి, మేధావుల నుంచి ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం వెనక్కితగ్గినట్లు తెలుస్తోంది. దీనిపై నేడో, రేపో అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.