Monday, September 16, 2024

కమ్యూనిస్టు విప్లవ పోరుకెరటం కామ్రేడ్ రాయల చంద్రశేఖర్

Must Read

-సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పి. రంగారావు
-ఖమ్మంలో కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సంస్మరణ సభ
-హాజరై నివాళులర్పించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కమ్యూనిస్టు విప్లవ పార్టీలు, పౌర హక్కుల నాయకులు.

అక్ష‌ర‌శ‌క్తి ఖ‌మ్మం: కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఐదు దశాబ్దాల విప్లవోద్యమ చరిత్రలో ఎన్నో తుపాకీ తూటాలను ధిక్కరించి, పోలీసుల చిత్రహింసలు, జైలు నిర్బంధాలను ఎదుర్కొని, ప్రజా పంథా మార్గంలో ప్రజలను నడిపించి విప్లవోద్యమానికే వన్నె తెచ్చాడని, నేటి భూస్వామ్య లక్షణాలు కలిగిన పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చి ,దోపిడి, పీడన, అసమానతలు లేని సమ సమాజ స్థాపన కోసం జరిగే ప్రజా ,విప్లవ పోరాటంలో నిత్యం చిరస్మరణీయుడని, అరుణ పతాక రెపరెపల్లో చంద్రశేఖర్ కృషి వర్ధిల్లుతుందనీ సిపిఐ ఎం.ఎల్ మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పోటు రంగారావు అన్నారు.
ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్సార్ గార్డెన్ లో సిపిఐ ఎం.ఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కె.రమ అధ్యక్షతన అమరుడు కామ్రేడ్ రాయలచంద్రశేఖర్ సంస్మరణ సభ జరిగింది.


ఈ సందర్భంగా పోటు రంగరావు మాట్లాడుతూ
కామ్రేడ్ రాయల చంద్ర శేఖర్ 17, 18 సం||ల లేత యవ్వన కాలం నుంచి మరణించే 68 ఏండ్ల దాకా విప్లవోద్యమంలో నీతి, నిజాయితీ, నిబద్ధతతో ఉన్నాడని గుర్తు చేశారు. పార్టీలో ఉన్నత స్థాయి కమిటీలకు ఎదిగాడని, మరణించే నాటికి సి.పి.ఐ. (యం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) కేంద్ర కంట్రోల్ కమీషన్ చైర్మన్ గా కొసాగుతున్నాడని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలం నుండి నేటి విప్లవోద్యమం వరకు కుటుంబం అంతా ప్రజల కోసం అంకితమై పనిచేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. విప్లవోద్యమ అగ్రమనేత, 5 దశాబ్దాలు అజ్ఞాత జీవితం గడిపి అమరుడైన రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న ) అడుగుజాడల్లో కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ నడిచాడని గుర్తు చేశారు.
కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఉద్యమచరిత్ర, కుటుంబ చరిత్ర ఘనమైనది, 5 దశాబ్దాల ఆయన పోరాటదారి గొప్పది. ప్రజాపంథా మార్గం కోసం ఆయన తపన ఉన్నతమైనది. మొక్కవోని దీక్షతో ప్రజల వెంట నడిచిన తీరు ఆదర్శనీయమైనది. ఎర్ర జెండాకు ఔన్నత్యాన్ని తెచ్చిన ఆయన పోరాట స్మృతులు సదా స్మరించదగినవి. అవే మనకు మార్గదర్శకాలు కావాలి. కా|| రాయల చంద్రశేఖర్ ఆయన జీవితకాలంలో విప్లవోద్యమ అరుణ పతాక కింద చేసిన కృషిని ప్రజలంతా ముందుకు తీసుకుపోవాలని కోరారు

ఈ సంస్మరణ సభకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, అరుణోదయ సాంస్కృతిక సామాఖ్య తెలుగు రాష్ట్రాల కన్వీనర్ విమలక్క, నాయకురాలు నిర్మల, ఓపిడిఆర్ జాతీయ కార్యదర్శి భాస్కర్ రావు, రైల్వే యూనియన్ రాష్ట్ర నాయకులు మర్రి యాదవ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీమన్నారాయణ, సిపిఐ ఎం.ఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కేజీ రామచందర్ , చిన్న చంద్రన్న, కెచ్చల రంగన్న వి. ప్రభాకర్ , ఎం .కృష్ణారెడ్డి,గోకినపల్లి వెంకటేశ్వర్లు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ,సంతాప సందేశాన్ని ఇవ్వడం జరిగింది.
కామ్రేడ్ వై.కే, కామ్రేడ్ ఎస్.వి. నాయకత్వంలో గల సిపిఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ పార్టీలు సంతాప సందేశాన్ని పంపించి, జోహార్లు అర్పించారు.
కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సామాఖ్య కళాకారులు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ను స్మరిస్తూ రాసి, పాడిన విప్లవ గేయాలు పార్టీ కార్యకర్తలను కంటతడి పెట్టించి కర్తవ్యాన్ని గుర్తుచేశాయి. దీంతో ఒక్కసారిగా హలంతా “ఒత్తుకుంటాం కంటతడిని- ఎత్తుకుంటాం ఎర్రజెండా ను” అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తూ రాయల చంద్రశేఖర్ కు విప్లవ జోహార్లు అర్పించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img