Monday, September 9, 2024

గురుకుల ప‌రీక్ష‌లో గంద‌ర‌గోళం

Must Read
  • నోటిఫికేష‌న్‌లో బైలింగ్వ‌ల్‌.. ప‌రీక్ష‌మాత్రం ఇంగ్లిష్‌లోనే..
  • ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్ అభ్య‌ర్థుల్లో తీవ్ర‌ ఆందోళ‌న‌
  • ప్ర‌భుత్వం, గురుకుల బోర్డ్‌పై ఆగ్ర‌హ‌జ్వాల‌లు
  • కోర్టుకు వెళ్లే యోచ‌న‌లో ఉద్యోగార్థులు

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భ‌ర్తీకి గురుకుల బోర్డ్ నిర్వ‌హించిన పోటీ ప‌రీక్ష‌లో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం, గురుకుల బోర్డు నిర్వాకంతో ల‌క్ష‌లాది మంది అభ్య‌ర్థుల భ‌వితవ్యం ఆందోళ‌న‌కంగా మారింది. గ‌తంలో టీఎస్‌పీఎస్‌సీ పేప‌ర్ లీకేజీల ఘ‌ట‌న మ‌ర‌వ‌కముందే గురుకుల బోర్డు తొలిరోజు నిర్వ‌హించిన ప‌రీక్ష అభాసుపాలుకావ‌డం రాష్ట్ర‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. త‌ల్లిదండ్రులు, పిల్లాపాప‌ల‌ను వ‌దిలేసి, వేల‌కు వేలు కోచింగ్ సెంట‌ర్ల‌లో ఫీజ‌లు క‌ట్టి, రేయింభ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి చ‌దివిన నిరుద్యోగుల జీవితాల‌తో ప్ర‌భుత్వం, గురుకుల బోర్డు చెల‌గాటం ఆడుతోంద‌ని అభ్య‌ర్థు లు తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నారు. ప‌రీక్ష బైలింగ్వ‌ల్ (తెలుగు, ఇంగ్లిష్‌) భాషల్లో రాసుకోవ‌చ్చ‌ని నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న బోర్డు ఇంగ్లిష్‌లోనే ప్ర‌శ్నాప‌త్రం ఇవ్వ‌డం ఏంట‌ని ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్ అభ్య‌ర్థులు ప్ర‌శ్నిస్తున్నారు. ఈమేర‌కు నిన్న‌టి నుంచి గురుకుల బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండ‌గా అధికారుల నుంచి స‌రైన స‌మాధానం రాక‌పోవ‌డంతో తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. ఈక్ర‌మంలోనే న్యాయం చేయాల‌ని కోరుతూ కోర్టుకు వెళ్లే యోచన‌లో అభ్య‌ర్థులు ఉన్నారు.
అస‌లేం జ‌రిగింది..
ఆగ‌స్టు 1 నుంచి 19 వ‌ర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా అభ్య‌ర్థుల‌కు గురుకుల బోర్డు ఆన్‌లైన్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తోంది. ఈ మేర‌కు 1వ తేదీన నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల్లో రావాల్సిన ప్ర‌శ్నాప‌త్రం కేవ‌లం ఇంగ్లిష్‌లోనే వ‌చ్చింది. దీంతో తెలుగు మీడియం అభ్య‌ర్థులంతా తీవ్ర అయోమ‌యానికి గుర‌య్యారు. మూడు పేప‌ర్లుగా ఉన్న ప‌రీక్ష‌లో పేప‌ర్ -1 ను తెలుగు, ఇంగ్లిష్‌లో అందిస్తామ‌ని, పేప‌ర్‌-2, 3ల‌కు మాత్రం ఇంగ్లిష్ ప్ర‌శ్రాప‌త్రం ఇస్తామ‌ని బోర్డు నోటిఫికేష‌న్‌లో స్పష్టంగా పొందుప‌ర్చింది. అయితే ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్ ప‌రీక్ష‌ల కోసం ఇంగ్లిష్ ప్ర‌శ్రాప‌త్రాన్ని ఇచ్చార‌ని, ఫ‌లితంగా తాము పూర్తిస్థాయిలో రాయ‌లేక‌పోయామ‌ని తెలుగు మీడియం అభ్య‌ర్థులు ఆందోళ‌న చెందుతున్నారు. ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్ ప‌రీక్ష‌లకు టెన్త్‌, ఇంట‌ర్‌తోపాటు సంబంధిత కోర్సుల్లో డిప్లొమా చేసిన వారు అర్హుల‌ని నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. వీరిలో ఎక్కువ మంది తెలుగు మీడియ విద్యార్థులే ఉన్నార‌ని, అలాంటిది తెలుగులో ఇవ్వ‌కుండా ఇంగ్లిష్‌లో ఇవ్వ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. దీనిపై గురుకుల బోర్డు క‌న్వీన‌ర్ మ‌ల్ల‌య్య బ‌ట్టు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని, త‌మ‌కు న్యాయంచేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. లేక‌పోతే కోర్టుకు వెళ్తామ‌ని ప‌లువురు అభ్య‌ర్థులు హెచ్చ‌రిస్తున్నారు.
మొద‌టి ప‌రీక్ష‌లోనే బోర్డు విఫ‌లం
సాగంటి మంజుల, హ‌న్మ‌కొండ
మొద‌టి పరీక్ష‌లోనే గురుకుల బోర్డు విఫ‌ల‌మైంది. మంగ‌ళ‌వారం రోజు మొదటి షిఫ్ట్‌లో గురుకుల ఆర్ట్ టీచర్ పరీక్షకు హాజర‌య్యా. తెలుగు, ఇంగ్లీష్‌తోపాటు ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష ఉంటుందని అధికారులు నోటిఫికేషన్‌లో చెప్పినప్పటికీ ఇంగ్లీష్ లోనే ప్ర‌శ్రాప‌త్రం ఇచ్చారు. భయాందోళనలకు గురైన అభ్యర్థులు నిర్వాహకులను నిలదీయగా మాకేం సంబంధం లేదని చేతులెత్తేశారు. సంబంధిత అధికారులు స్పందించక‌పోవ‌డంతో తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులు అయోమయంలో పరీక్ష పూర్తి చేశారు. పైగా జనరల్ స్టడీస్, సైకాలజీ, పెడగాజీలో ప్రశ్నలు కేవలం 20కే పరిమితం కాగా, 80 ప్రశ్నలు ఆర్ట్ ఎడ్యుకేషన్ నుంచే వ‌చ్చాయి. జనరల్ స్టడీస్ కోసం కొన్ని నెలలుగా నిద్రహారాలు మాని, కుటుంబానికి దూరంగా, ఇరుకు గదుల్ని షేర్ చేసుకుని, కష్టపడి చదివిన అభ్యర్థులు ఏం చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. 5 రూపాయల భోజనం తిని చదివిన అభ్యర్థులు రూ. 5 వేలు ఖర్చు చేసి పరీక్షలు రాయాల్సి వస్తుంది. నిరుద్యోగుల జీవితాలతో ప్ర‌భుత్వం, గురుకుల బోర్డు ఆడుకోవద్దు. కోర్టుకైనా వెళ్లి న్యాయం జరిగేలా పోరాడతాం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img