- మే 6న రైతు సంఘర్షణ సభపై ఆసక్తికరమైన చర్చ
- రైతుసభ కాకుండా.. బహుజన సభగా నిర్వహిస్తే మేలంటూ పార్టీలో అంతర్గత చర్చ
- 2002లో సోనియా సభను గుర్తు చేసుకుంటున్న నాయకులు
అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి : తెలంగాణలో పూర్వ వైభవం సాధించేందుకు ఓరుగల్లు నుంచి పోరుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ.. కీలక దశలో తప్పటడుగు వేస్తోందా..? మే 6న హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న సభకు రైతు సంఘర్షణ సభగా నామకరణం చేసి పొరపాటు చేస్తోందా..? రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీవర్గాల్లో వస్తున్న రాజ్యాధికార ఆలోచనా విధానాన్ని పరిగణలోకి తీసుకోకుండా చేసిన తప్పే మళ్లీమళ్లీ చేస్తోందా..? అంటే పార్టీలో కొందరు నేతలు, విశ్లేషకులు ఔననే అంటున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరుకానున్న నేపథ్యంలో రైతు సంఘర్షణ సభపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 2002లో వరంగల్‌లో నిర్వహించిన బీసీ గర్జన సభలో సోనియాగాంధీ పాల్గొన్నారు. ఆ సభతో పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ఇదే వరంగల్‌లో నిర్వహిస్తున్న రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటున్నారని, పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీకాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో పార్టీలోనే కొందరు నేతలు భిన్నమైన వాదన వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కూడా బీసీ సంఘర్షణ సభ లేదా బహుజన సంఘర్షణ సభ పేరుతో నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయని అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు సమాచారం.
2002లో బీసీ గర్జన సభ…
2002లో వరంగల్‌లో బీసీ గర్జన సభ నిర్వహించారు. ఈ సభలో పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ పాల్గొని మాట్లాడారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2002లో ఓబీసీ చైర్మన్‌గా ఉన్న శివశంకర్ సలహా మేరకు సోనియా గాంధీ
బీసీవర్గాలను కేంద్రంగా చేసి చేసి ఆ సభను కొంసాగించారు. ఆ సమయంలో బీసీలతో పాటుగా ఎస్సీ, ఎస్టీలు కూడా కాంగ్రెస్‌కు అండగా నిలిచారని కొందరు నాయకులు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ రోజుల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జోరుగా నడుస్తోంది. అలాగే, బీసీల్లో రాజకీయ శూన్యత కొనసాగుతున్న కాలం. చిత్తరంజన్ దాస్ బీసీ విభాగం నాయకుడిగా మహబూబాబాద్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుండి ఎన్టీఆర్‌ను ఓడించారు. అయితే.. ఇప్పుడు టీకాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ రైతు సంఘర్షణ సభలోమాట్లాడ బోతున్నారు. ఈ సభ లో రైతు సమస్యలు ప్రధానం కాకుండా బీ సీ సమస్యలు ప్రధానం చేస్తే బాగుండేదనే టాక్ కొందరు నేతల్లో, రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది.
బలపడుతున్న బహుజన వాదం..
దేశంలో, రాష్ట్రంలో బహుజనవాదం బలపడుతోంది. తమకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం దక్కడంలేదని బహుజన వర్గాలు అసంతృప్తితో రగిలిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ. మైనార్టీ వర్గాల చేతుల్లోకి రాజ్యాధికారం రావాలని కోరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వీరందరినీ తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. బహుజనవాదాన్ని భుజానికి ఎత్తుకోకుండా, రాష్ట్రంలో మెజార్టీ వర్గాలను ఆకర్షించకుండా తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం అంత సులువు కాదనే చర్చ జరుగుతోంది. ఓరుగల్లులాంటి చైతన్యవంతమైన ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సభకు రైతు సంఘర్షణ సభగా నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో బహుజనుల సభగా పేరు పెడితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈక్రమంలోనే 2002లో హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన సోనియా గాంధీ సభను ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు చిత్తరంజన్ దాస్, శివశంకర్ సలహా మేరకు సోనియాగాంధీ బీసీ సంక్షేమాన్ని హైలెట్ చేసి సభను ఏర్పాటు చేయగా, బీసీలతోపాటుగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కూడా కాంగ్రెస్‌ను స్వాగతించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే రైతు సంఘర్షణ పేరుతో అదే ఆర్ట్స్ కళాశాల మైదానంలో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న బీసీ సభలాగా సక్సెస్ అవుతుందని కాంగ్రెస్ నేతలు అనుకోవడం పొరబాటు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆ విషయాన్ని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలి
రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ రైతు సమస్యలు ప్రధానం కాకుండా బీసీ సమస్యలను హైలెట్ చేస్తే బాగుంటుందనే విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానం ఈ విషయాన్ని జాతీయ నాయకత్వ దృష్టికి తీసుకెళ్తే పార్టీకి మరింత లాభం జరుగుతుందని అంటున్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్‌ను సక్రమంగా తెలియజేయకపోవడం వలన కాంగ్రెస్‌కు నష్టం జరుగవచ్చుననే చర్చ ముందు కొస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో రెడ్లు, వెలమలు మ్యూచువల్ ప్రయోజనం పొందుతున్నారని, వారికి దోస్తీ బాగానే ఉందిగానీ.. రాజకీయంగా ఎక్కువగా నష్టం జరిగేది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకేనని, ఈ నేపథ్యంలో రాహుల్ సభను రైతు సంఘర్షణగా కాకుండా బీసీ సంఘర్షణ సభగా కొనసాగిస్తే ప్రయోజనం ఉంటుదని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.