- వరంగల్ తూర్పులో అనుమానాస్పదంగా నాయకుల కదలికలు
- ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు ముందస్తు ఒప్పందం?
- మరికొంత కాలం టీఆర్ఎస్‌లోనే ఉండేలా ప్లాన్!
- సమయం చూసి బయటకు వెళ్లే యోచన?
- పసిగట్టిన పార్టీ అధిష్ఠానం!
- పలువురి కదలికలపై నజర్
- ఏరివేసేందుకు రంగం సిద్ధం!
- అలర్ట్ అవుతున్న క్యాడర్
అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి : వరంగల్ తూర్పు గులాబీ కోటలో కోవర్టు బ్యాచ్ తయారవుతోందా..? ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు ముందస్తుగానే కొందరు ఒప్పందం చేసుకున్నారా..? మరికొంత కాలం టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ మాటలు మోసేందుకు సిద్ధమవుతున్నారా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ నీయాంశంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత రాజకీయ పరిస్థితులు వెడెక్కాయి. నేతలు మాటలు తూటాల్లా పేలుతున్నాయి. నాయకుల కదలికలు మెలికలు తిరుగుతున్నాయి. ఎవరి వెనుక ఎవరున్నారో..? ఏ మాటల్లో ఏ మర్మం దాగివుంది.? ఇటు ఉంటూనే అటు మాటలు మోసేదెవరు? అన్న ప్రశ్నల చుట్టూనే వరంగల్ తూర్పు రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎక్కడ నలుగురు కలిసినా ఇదే ముచ్చట ముందుకొస్తోంది.
- నేతల మధ్య గ్రూపు రాజకీయం
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య గ్రూపు రాజకీయాలు పలుమార్లు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసాయి. ప్రధానంగా ఎర్రబెల్లి ప్రదీప్‌రావుతోపాటు మరికొందరు నాయకులు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే టాక్ మొదటి నుంచీ ఉంది. అయితే.. ఇదే సమయంలో ఎర్రబెల్లి ప్రదీప్‌రావుతోపాటు మరికొందరు నేతలను పట్టించుకోకుండా, వారి అనుచరులకు సంబంధించి కనీస పనులు చేయకుండా ఎమ్మెల్యే నన్నపునేని వ్యవహరించారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేతో కొందరు నేతలు విభేదిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ ఇవ్వాలన్న విషయాన్ని ప్రదీప్‌రావు గులాబీ బాస్ ముందు ఉంచగా.. అందుకు నో చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. ఆయన ఏ పార్టీలోకి వెళ్తారన్న విషయంపై చర్చ జరుగుతున్న సందర్బంలోనే… గులాబీ పార్టీలో కోవర్టులున్నారా..? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. - ముందస్తు ఒప్పందం కుదిరిందా..?
తూర్పు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీలో కొందరు నాయకులు కూడా ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు ముందస్తు ఒప్పందం కుదుర్చుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇప్పుడే బయటకు వెళ్లకుండా, మరికొంత కాలం పార్టీలోనే ఉంటూ మాటలు మోయడానికి పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. దశల వారీగా వారు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వరంగల్ తూర్పుపై గులాబీ పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలువురు నాయకుల కదలికలపై నజర్ పెట్టి, పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరిస్తున్న వారిని ఏరివేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎవరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు..? ఎక్కడెక్కడ కలుసుకుంటున్నారు? అన్న దానిపై ఆరా తీసేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి, కఠినంగా వ్యవహరించనున్నట్లు సమాచారం. అయితే.. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్యాడర్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.