Tuesday, June 18, 2024

19న బీజేపీలోకి డాక్ట‌ర్ కాళీప్ర‌సాద్‌

Must Read
  • ప‌ర‌కాల ప‌ట్ట‌ణంలో బ‌హిరంగ స‌భ‌
  • రానున్న కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్‌, ఈట‌ల రాజేంద‌ర్‌
  • ఏర్పాట్లు చేస్తున్న స్థానిక నాయ‌కులు
  • నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌ప‌డుతున్న‌క‌మ‌ల‌ద‌ళం
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా అధిష్ఠానం వ్యూహం
  • స‌మ‌రోత్సాహంలో పార్టీ శ్రేణులు

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ప్ర‌ముఖ డాక్ట‌ర్ కాళీప్ర‌సాద్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో అడుగుపెడుతున్నారు. బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖ‌రారు అయింది. ప‌ర‌కాల ప‌ట్ట‌ణంలో ఆగ‌స్టు 19వ తేదీన నిర్వ‌హించ‌నున్న బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న క‌మ‌లద‌ళంతో క‌ల‌వ‌నున్నారు. కేంద్ర మంత్రి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి, జాతీయ నాయ‌కుడు బండి సంజ‌య్‌, పార్టీ ఎన్నిక‌ల క‌మిటీ నిర్వ‌హ‌ణ చైర్మ‌న్ ఈట‌ల రాజేంద‌ర్‌ల స‌మ‌క్షంలో క‌మ‌లం కండువా క‌ప్పుకోనున్నారు. కొంత‌కాలంగా డాక్ట‌ర్‌ కాళీప్ర‌సాద్ బీజేపీలో చేరుతున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకుని క‌ద‌న‌రంగంలోకి దూకేందుకు సిద్ధ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌రిణామాల‌తో నియోజ‌క‌వ‌ర్గ బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ క‌నిపిస్తోంది. ఈ ప్రాంతంలో ఎంతో పేరుప్రఖ్యాత‌లు ఉన్న ప్ర‌ముఖ వైద్యుడు, బీసీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన కాళీప్ర‌సాద్ చేరుతుండ‌డంతో పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌న్న ధీమా క‌మ‌లంశ్రేణుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

19న బ‌హిరంగ స‌భ‌
ఆగ‌స్టు 19వ తేదీన ప‌ర‌కాల ప‌ట్ట‌ణంలో వెల్లంప‌ల్లి రోడ్డులో ఉన్న ప‌శువుల సంత‌లో బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేయ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 2గంట‌ల నుంచి రాత్రి 9గంట‌ల వ‌ర‌కు స‌భ నిర్వ‌హించనున్న‌ట్లు తెలిసింది. ఈ స‌భ‌లో పార్టీ నేత‌ల కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్‌, ఈట‌ల రాజేందర్ పాల్గొన‌నుండ‌డంతో ఇప్ప‌టి నుంచే ఏర్పాట్ల‌ను ప‌క‌డ్బందీగా చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ స‌భ‌తో ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ బ‌లం చూపించే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో డాక్ట‌ర్ కాళీప్ర‌సాద్ కూడా త‌న బ‌లాన్ని నిరూపించుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ క‌మిటీ క‌న్వీన‌ర్ ఈట‌ల రాజేంద‌ర్‌కు అత్యంత స‌న్నిహితుడిగా గుర్తింపు ఉన్న డాక్ట‌ర్ కాళీప్ర‌సాద్ బీజేపీలో చేరుతుండ‌డం ప‌ర‌కాల రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

బీజేపీకి పెరుగుతున్న బ‌లం
తెలంగాణ ఉద్య‌మంలో అత్యంత కీల‌క పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్ష‌ప‌తితోపాటు చేరిక‌తో ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గ బీజేపీకి చాలా వ‌ర‌కు బ‌లం చేకూరింది. భిక్ష‌ప‌తి నిరంత‌రం నియోజ‌క‌వ‌ర్గంలో నిరంత‌రం ప‌ర్య‌టిస్తూ ముందుకు వెళ్తున్నారు. భిక్ష‌ప‌తి రాక‌తో ప‌ర‌కాల ప‌ట్ట‌ణంలో బీజేపీ మంచి ప‌ట్టుసాధించింద‌న్న ధీమాతో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ వైద్యుడు కాళీప్ర‌సాద్ కూడా బీజేపీలో చేరుతుండ‌డంతో నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని అంటున్నారు. ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో కాషాయ జెండా ఎగుర‌వేయాల‌న్న ల‌క్ష్యంతోనే బీజేపీ అధిష్టానం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ప్ర‌ధానంగా బ‌డుగుబ‌ల‌హీన‌వ‌ర్గాల ఎజెండాతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే అన్నివ‌ర్గాల్లో మంచి గుర్తింపు ఉన్న కాళీప్ర‌సాద్‌ను పార్టీలోకి తీసుకొస్తోంది.

ద‌ళిత‌బ‌హుజ‌నుల మ‌ద్ద‌తుపైనే ఆశ‌లు
ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర‌కాల‌, న‌డికూడ‌, ఆత్మ‌కూరు, సంగెం, దామెర మండ‌లాలు ఉన్నాయి. మొత్తం 2ల‌క్ష‌ల 7వేల 810మంది ఓట‌ర్లు ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ధానంగా బీసీ సామాజిక‌వ‌ర్గాల‌కు చెందిన ఓట్లు సుమారు 54 నుంచి 60శాతం ఉన్నాయి. ప్ర‌ధానంగా ముదిరాజ్ సామాజిక‌వ‌ర్గానికి సుమారు 31వేల ఓట్లు, మున్నూరు కాపుల‌కు 32వేలు, గౌడ సామాజిక‌వ‌ర్గానికి 25వేలు, యాద‌వులకు 22వేలు, ప‌ద్మ‌శాలీల‌కు 15వేల‌కు పైగా ఓటుబ్యాంకు ఉన్న‌ట్లు అంచ‌నాలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట‌కు దాదాపుగా ముదిరాజ్ సామాజిక‌వ‌ర్గం క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని, ఇదే స‌మ‌యంలో సొంత సామాజిక‌వ‌ర్గమైన మున్నూరుకాపుల నుంచి సంపూర్ణ మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌న్న న‌మ్మ‌కంతో డాక్ట‌ర్ కాళీప్ర‌సాద్ ఉన్నారు. ఇక ఇదే స‌మ‌యంలో సామాజిక బాధ్య‌త ఉన్న డాక్ట‌ర్‌గా గుర్తింపు పొందిన కాళీప్ర‌సాద్‌కు ఇత‌ర బీసీవ‌ర్గాలతోపాటు ద‌ళితులు, ప్ర‌జాసంఘాల స‌హ‌కారం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img