Tuesday, June 18, 2024

ఈ – హెల్త్ ప్రొఫైల్‌.. ప్రారంభం

Must Read

ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ప్ర‌భుత్వం
ప్ర‌యోగాత్మ‌కంగా ములుగు, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో అమ‌లు
ములుగులో లాంఛ‌నంగా ప్రారంభించిన మంత్రి హ‌రీశ్‌రావు
తొలి విడతగా రూ. 9 కోట్ల 16 లక్షల నిధులు

అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : ఆరోగ్య తెలంగాణే ల‌క్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రం‌లోని 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమగ్ర సమా‌చార నివే‌దిక (హెల్త్‌ ప్రొఫైల్‌) సిద్ధం చేయా‌లని నిర్ణయిం‌చింది. ఇందుకోసం పైలట్‌ ప్రాజెక్టులుగా ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల‌ను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ములుగు జిల్లా కలెక్టరేట్‌లో హెల్త్‌ ప్రొఫైల్ ఫైల‌ట్‌ ప్రాజెక్టును మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ శ‌నివారం ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయాల‌నే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం అమలు కోసం నిర్ధారణ పరీక్షల పరికరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు తొలి విడతగా రూ. 9 కోట్ల 16 లక్షల రూపాయలను మంజూరు చేశారు. రెండో దశలో రాష్ట్రంలోని మిగతా 31 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయ‌నున్నారు.

హెల్త్‌ ప్రొఫై‌ల్‌తో లాభాలు

ములుగు జిల్లాలో దాదాపు 2 లక్షల 18 వేల 852 మంది 18 ఏండ్లు పైబడిన వారి నుంచి న‌మూనాల‌ను వైద్య‌సిబ్బంది సేకరించ‌నున్నారు. గ్రామాల్లో వైద్య సి‌బ్బంది ఇంటిం‌టికీ వెళ్లి, ప్రతి వ్యక్తి ఆరోగ్య సమా‌చా‌రాన్ని సేక‌రిం‌చ‌ను‌న్నారు. ప్రతి వ్యక్తికి ప్రత్యే‌కంగా ఒక ఐడీ నంబర్ కేటాయించ‌నున్నారు. వారి నుంచి నమూ‌నా‌లను సేక‌రించి, 30 రకాల డయా‌గ్నో‌స్టిక్‌ పరీ‌క్షలు నిర్వహించ‌నున్నారు. ఫలి‌తాల ఆధా‌రంగా వారి ఆరోగ్య సమ‌స్యలను నిర్ధా‌రించి, ఒక‌వేళ ఏవైనా సమ‌స్యలు ఉంటే వెంటనే చికిత్స ప్రారం‌భి‌స్తారు. వివ‌రా‌ల‌న్నిం‌టినీ ఎప్పటి‌క‌ప్పుడు ఆన్‌‌లైన్‌ చేస్తారు. ఈ సమా‌చా‌రంతో అనేక ప్రయో‌జ‌నాలు కలు‌గ‌ను‌న్నాయి. దీర్ఘకా‌లిక బాధి‌తు‌లను గుర్తిం‌చడం, వారికి మెరు‌గైన వైద్యం అందిం‌చడం, క్యాన్సర్‌ వంటి ప్ర‌మాద‌క‌ర రోగా‌లను ప్రాథ‌మిక దశ‌లోనే గుర్తిం‌చడం, రక్తహీ‌నత వంటి సమ‌స్యలను గుర్తించి తగిన చికిత్స అందిం‌చడం లాంటి అనేక ప్ర‌యోజ‌నాలు క‌ల‌గ‌నున్నాయి.

ఇంటి వద్ద పరీక్షలు

హెల్త్‌ ప్రొఫైల్‌ సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి 18 ఏండ్లు పైబడిన ప్రతి వ్యక్తి ఆరోగ్య సూచికలను సేకరిస్తారు. జ్వరం, రక్త పోటు, రక్తహీనత, రక్తంలో చక్కెర స్థాయి, వయసు తగ్గ ఎత్తు, బరువు, బ్లడ్ గ్రూపు, శరీర కొలతలు, రక్తంలో ప్రాణవాయువు, గుండె కొట్టుకునే తీరు, ఇతర అంశాలు, అనారోగ్య సమస్యలు నమోదుచేసుకుంటారు. రక్తం, మూత్ర నమూనాలను సేకరించి సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో పరిశీలిస్తారు. ప్రతి వ్యక్తి ఆధార్ నంబర్, ఇంటి అడ్రస్‌ వంటి వివరాలు సేకరించిన వారికి ఏకీకృత నంబర్‌ను కేటాయిస్తారు. దీంతో వ్యక్తి ఆరోగ్య వివరాలు తెలుసుకునే వీలుంటుంది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో..

కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌ (సీబీపీ), సంపూర్ణ మూత్ర పరీక్ష, మూత్రపిండాల పనితీరు తెలుసుకునేందుకు ఆల్బుమిన్, బ్లడ్ యూరియా, క్రియాటిన్ మొదలైన పరీక్షలు చేస్తారు. రక్తంలో చక్కరస్థాయి తెలుసుకొనేందుకు మూడు నెలల సగటు (హెచ్‌డీఏ 1సీ) పరీక్షలు, గుండె పనితీరును తెలుసుకునేందుకు కొలెస్ట్రాల్, కంప్లీట్‌ హెచ్డీఎల్, ట్రైగ్లిజరైడ్స్, ఈసీజీ, కాలేయ సంబంధిత పనితీరును తెలుసుకునేందుకు వివిధ కాలేయ పరీక్షలు చేయ‌నున్నారు. ఈ పథకంలో భాగంగా వైద్య పరీక్షల ఆధారంగా అనారోగ్య సమస్యలు ఉన్న వారికి వెంటనే చికిత్స అందిస్తారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి భవిష్యత్తులో ఏ విధమైన జబ్బులు రాకుండా తగిన సూచనలు చేయ‌నున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img