- ఏనుమాముల మార్కెట్ పాలకవర్గం కొనసాగింపు
- జీవో విడుదల చేసిన ప్రభుత్వం
- ఎస్సీ మహిళా చైర్మన్ పదవిని దక్కించుకోవడంలో రమేష్ విఫలం
- నియోజకవర్గంలో తీవ్ర విమర్శలు
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు భారీ షాక్ తగిలింది. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పదవిని దక్కించుకోవడంలో విఫలం చెందారు. పాత పాలకవర్గాన్నే కొనసాగిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేసింది. దిడ్డి భాగ్యలక్ష్మి చైర్‌పర్సన్‌గా ఉన్న కమిటీ పదవీకాలం గత ఆగస్టు 19వ తేదీన ముగిసింది. ఆ తర్వాత చైర్మన్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వు చేస్తూ జీవో విడుదల అయింది. కానీ.. అప్పటి నుంచి కొత్తపాలకవర్గాన్ని నియమించకుండా, పాత పాలకవర్గాన్ని రెన్యూవల్ చేయకుండా ఉండడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు రెన్యూవల్ కోసం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పట్టుబట్టగా, ఎస్సీ మహిళకు రిజర్వు అయిన పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని ఎమ్మెల్యే అరూరి ప్రయత్నం చేసినట్లు తెలిసింది.
ఉత్కంఠకు తెరదించుతూ జనవరి 31వ తేదీన పాత పాలకవర్గం పదవీకాలం ముగిసినప్పటి నుంచి అంటే 19-08-2022 నుంచి ఆరు నెలలపాటు రెన్యూవల్ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కేవలం ఆరు నెలల పదవీకాలంలో మిగిలింది కేవలం 18 రోజులే కావడం గమనార్హం. ఈ రెన్యూవల్ పాలకవర్గం పదవికాలం కూడా ఫిబ్రవరి 18, 2023తో ముగుస్తుంది. అంటే మిగిలిన 18 రోజుల కోసమే రెన్యూవల్ చేయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటన్న దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. ఆ తర్వాత కూడా మరో ఆరు నెలలపాటు రెన్యూవల్ చేసుకోవడానికే ఇలా చేసినట్లు తెలుస్తోంది.
- అరూరిపై తీవ్ర విమర్శలు
ఆసియా ఖండంలో రెండో పెద్ద మార్కెట్ అయిన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. కానీ.. స్వరాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా చైర్మన్ పదవి నియోజకవర్గ నాయకులకు దక్కలేదు. రెండుసార్లు పరకాల నియోజకవర్గానికి, ఆ తర్వాత వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన దిడ్డి భాగ్యలక్ష్మికి చైర్‌పర్సన్ పదవి దక్కింది. ఈ పాలకవర్గం పదవీకాలం గత ఆగస్టు 19వ తేదీన ముగిసింది. ఆరు నెలల గడువు ముగుస్తున్న సమయంలో మంగళవారం ప్రభుత్వం రెన్యూవల్ చేసింది. అయితే.. ఈసారి పాలకవర్గం చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. ఈసారైనా వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన నాయకురాలికి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ.. చివరకు మళ్లీ నిరాశే ఎదురుకావడంతో నియోజకవర్గ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అరూరి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.