- నెల్లుట్ల ఫ్లైఓవర్‌పై ఘటన
- విచారిస్తున్న పోలీసులు
- అక్షరశక్తి, జనగామ : జనగామ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు నెల్లుట్ల ఫ్లైఓవర్‌పై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు టూ వీలర్స్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా అదే దారిలో వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన వాహనాన్ని ఆపి వెంటనే డీసీపీ, పోలీసులకు ఫోన్ చేసి సహాయక చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల వారి సహాయంతో గాయపడిన వారిని పక్కన కూర్చోపెట్టారు. ఈలోగా ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా, వారిని చూసిన వెంటనే ఇద్దరు యువకులు అక్కడి నుండి పరార్ అయ్యారు. అనుమానం వచ్చిన పోలీసులు పట్టుబడిన యువకుడిని విచారించారు. అతడి వద్ద ఉన్న సంచులను చెక్ చేశారు. అందులో గంజాయి ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని పట్టుకుని స్టేషన్‌కి తీసుకెళ్లారు. గాయపడిన యువకులను జనగామ హాస్పిటల్‌కి పంపారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. కాగా, ఘటన జరిగిన వెంటనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించి తమకు ఫోన్ చేయడం వల్ల సహాయక చర్యలు అందడమే గాక, గంజాయి పట్టుబడి, సరఫరా చేస్తున్న ముఠా కూడా దొరికిందని, మంత్రికి పోలీసు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
గంజాయి పట్టుబడటం ఆందోళనకరం
ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. యాదృచికంగా జరిగిన ఘటనలో గంజాయి పట్టుబడటం ఆశ్చర్యంగా, ఆందోళన గా ఉందన్నారు. అందులోనూ యువకులు పట్టుబడటం చూస్తే, ఇబ్బందిగా ఉందన్నారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడటం మంచిది కాదని, ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు మంచి దారిలో పయణించాలని అన్నారు. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మత్తు పదార్థాల వినియోగాన్ని, సరఫరా ను అరికట్టాలని అదేశించారు. తనతో సహాయక చర్యల్లో పాలు పంచుకున్న ప్రజలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.