Sunday, September 8, 2024

సేవా ల‌క్ష్మ‌ణుడు!

Must Read
  • ఆర్మీలో 16ఏళ్ల‌పాటు విధులు
  • 2019లో ఏక‌శిల‌ డిఫెన్స్ అకాడ‌మీ ఏర్పాటు
  • మూడేళ్లుగా ఉచితంగా శిక్ష‌ణ‌
  • 20మంది గ్రామీణ‌ప్రాంత‌ అభ్య‌ర్థులకు కేంద్ర ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు
  • కానిస్టేబుల్‌, ఎస్సై అభ్య‌ర్థుల‌కు ఉచితంగా ఈవెంట్స్ శిక్ష‌ణ‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : నీకు కుదిరిన‌ప్పుడు కాదు.. ఎదుటివారికి అవ‌స‌ర‌మైన‌ప్పుడు చేస్తే దానిని సాయం అంటారు. ఇప్పుడు ఏక‌శిల డిఫెన్స్ అకాడ‌మీ నిర్వాహ‌కుడు లింగంపెల్లి ల‌క్ష్మ‌ణ్‌రావు కూడా అదే చేస్తున్నారు. అమ్మానాన్నల‌ క‌ష్టం విలువు, చ‌దువు విలువ‌ తెలిసిన ఆయ‌న‌.. అవ‌స‌ర‌మైన‌ప్పుడల్లా ఉద్యోగార్థుల‌కు త‌న‌వంతు తోడ్పాడునందిస్తున్నారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌ ప్రిలిమ్స్‌లో ఎంపికైన‌ కానిస్టేబుల్‌, ఎస్సై అభ్య‌ర్థుల‌కు ఈవెంట్స్‌లో ఉచితంగా శిక్ష‌ణ అందిస్తూ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఫీజు క‌ట్టి ఈవెంట్స్ శిక్ష‌ణ పొంద‌లేక‌పోతున్న అనేక‌మంది అభ్య‌ర్థుల‌ను చేర‌దీసి ముందుకున‌డిపిస్తున్నారు. ప్ర‌స్తుతం కాక‌తీయ యూనివ‌ర్సిటీలో సుమారు 120మందికిపైగా అభ్య‌ర్థుల‌కు ల‌క్ష్మ‌ణ్‌రావు దేహ‌దారుఢ్య శిక్ష‌ణ అందిస్తున్నారు. ప్ర‌తీరోజు ఉద‌యం 6గంట‌ల నుంచి 8గంట‌ల వ‌ర‌కు, సాయంత్ర 4గంట‌ల నుంచి 6గంట‌ల వ‌ర‌కు శిక్ష‌ణ కొన‌సాగిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ను పోలీస్ ఉన్న‌తాధికారులు అభినందిస్తున్నారు.

  • ఆర్మీలో విధులు..
    లింగంపెల్లి ల‌క్ష్మ‌ణ్‌రావు, జ‌య‌శంక‌ర్‌భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌ల్హార్‌రావు మండ‌లం స్వ‌గ్రామం వ‌ల్లంకుంట‌.
    త‌ల్లిదండ్రులు లింగంప‌ల్లి రాధ-చ‌ల‌ప‌తిరావు. రెండో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు వ‌రంగ‌ల్ జిల్లా న‌ల్ల‌బెల్లి మండ‌లం రుద్ర‌గూడెంలోని కాక‌తీయ గురుకుల విద్యాల‌యంలో చ‌దువుకున్నాడు. ఇంట‌ర్ హ‌న్మ‌కొండ‌లోని వాగ్దేవి జూనియ‌ర్ క‌ళాశాల‌లో చ‌దువుకున్నాడు. అనంత‌రం 2003లో ఆర్మీలో ఉద్యోగం వ‌చ్చింది. బెంగ‌ళూరులోని మ‌ద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్(ఎంఈజీ) అండ్ సెంట‌ర్‌లో చేరాడు. 16ఏళ్ల‌పాటు ఆర్మీలో ఉద్యోగం చేసి 2019లో రిటైర‌య్యారు. ఆర్మీలో అనేక ప్రాంతాల్లో విధులు నిర్వ‌ర్తించాడు. ఈ స‌మ‌యంలోనే గ్రామీణ‌ప్రాంత పేద‌ విద్యార్థులు ఎదిగేందుకు త‌న‌వంతు సాయం అందించాల‌ని అనుకునేవాడు. రిటైర్మెంట్ త‌ర్వాత కూడా చ‌దువుమీద మ‌క్కువ‌తో కాక‌తీయ యూనివ‌ర్సిటీ ఎస్డీఎల్‌సీఈలో డిగ్రీ, కాక‌తీయ యూనివ‌ర్సిటీలో బీపీఈడీ పూర్తి చేశాడు.
  • 2019లో ఏక‌శిల డిఫెన్స్ అకాడ‌మీ..
    2019 నుంచి హ‌న్మ‌కొండ‌లో లింగంపెల్లి ల‌క్ష్మ‌ణ్‌రావు ఏక‌శిల డిఫెన్స్ అకాడ‌మీ నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉచితంగా ఫిజిక‌ల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వ‌చ్చే నిరుపేద విద్యార్థుల‌కు తోడ్పాడునందించ‌డ‌మే ల‌క్ష్యంగా ల‌క్ష్మ‌ణ్‌రావు ముందుకుసాగుతున్నారు. త‌న‌ను చ‌దివించేందుకు త‌ల్లిదండ్రులు ప‌డిన క‌ష్టాన్ని చూసిన ల‌క్ష్మ‌ణ్‌రావు.. తాను కూడా త‌న‌వంతు చేయూత‌నందించాల‌న్న త‌ప‌న‌తో శిక్ష‌ణ ఇస్తున్నారు. ఫిజిక‌ల్ ట్రైనింగ్‌తోపాటు ఏ పుస్త‌కాలు చ‌ద‌వాలి? ఎలా ప్రిపేర‌వ్వాలి..? అనే అంశాల్లోనూ వారికి నిరంత‌రం స‌ల‌హాలు సూచ‌న‌లు ఇస్తున్నారు. ఇలా ఈ మూడేళ్లలో 20మంది అభ్య‌ర్థులు ఆర్మీకి ఎంపిక‌య్యారు. ఇందులో ఎనిమిది మంది పారామిల‌ట‌రీ, సీఐఎస్ఎఫ్‌కి ముగ్గురు, బీఎస్ఎఫ్‌కు ఇద్ద‌రు, అస్సాం రైఫిల్స్‌కు ముగ్గురు ఎంపిక‌య్యారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img