Saturday, July 27, 2024

ఆరోగ్య‌శ్రీ‌లో ఇద్ద‌రు ముదుర్లు!

Must Read
  • ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం జిల్లా అధికారుల‌ వ‌సూళ్ల‌ దందా

  • ట్ర‌స్ట్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న డీసీ, డీఎంలు

  • ప్రైవేట్ నెట్‌వ‌ర్క్ ఆస్ప‌త్రులతో కుమ్మ‌క్కు

  • ఎంవోయూకు ప‌డ‌క‌ల సంఖ్య వారీగా రేట్లు

  • పెర్ఫార్మెన్స్ స‌రిగా లేకున్నా ఎంవోయూల పున‌రుద్ధ‌ర‌ణ‌

  • యాజ‌మాన్యాల‌కు అనుకూలంగా ఉండాలంటూ ఆరోగ్య మిత్ర‌ల‌పై ఒత్తిడి

  • మాట విన‌కుంటే టార్గెట్ చేసి మ‌రీ వేధింపులు

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : వారు ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం జిల్లా బాస్‌లు.. ఒక‌రు జిల్లా కో ఆర్డినేట‌ర్ (డీసీ), మ‌రొక‌రు జిల్లా మేనేజ‌ర్ (డీఎం). ఇక వారు ఆడిందే ఆట‌.. పాడిందే పాట‌! పేద‌ల‌కు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఆరోగ్య శ్రీ ట్ర‌స్ట్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ.. వ‌సూళ్ల దందాకు తెర‌లేపుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఆరోగ్య‌శ్రీ సేవ‌లు అందిస్తున్న కార్పొరేట్ ఆస్ప‌త్రులతో కుమ్మ‌క్కై అందిన‌కాడికి దండుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. నిత్యం పేద‌లకు అందుబాటులో ఉంటూ.. రోగుల‌కు అందే వైద్య‌సేవ‌ల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తూ ఉండాల్సిన వీరు.. కార్పొరేట్ ఆస్ప‌త్రుల యాజ‌మాన్యాల క‌నుస‌న్న‌ల్లోనే ప‌నిచేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఆ శాఖ వ‌ర్గాల నుంచే వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక ఎంవోయూ ప్ర‌క్రియ స‌మ‌యంలోనూ ప‌డ‌క‌ల వారీగా రేట్లు నిర్ణ‌యించి మ‌రీ ఆస్ప‌త్రుల నుంచి డ‌బ్బులు లాగేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇలా ల‌క్ష‌ల రూపాయ‌లు వ‌సూలు చేస్తూ ఆరోగ్య శ్రీ అవినీతిమయంగా మారుస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

 

క‌లెక్ష‌న్ కింగ్‌లుగా టీమ్ లీడ‌ర్లు..?
పీహెచ్‌సీల నుంచి ఆరోగ్య మిత్ర‌లు కార్పొరేట్‌ ఆస్ప‌త్రుల్లోనే విధులు నిర్వ‌ర్తిస్తుండ‌డంతో టీమ్ లీడ‌ర్ల‌కు చేతిలో పెద్ద‌గా ప‌నిలేని ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. మండ‌లాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. ఆరోగ్య శ్రీ అధికారులిద్ద‌రూ టీమ్ లీడ‌ర్ల‌ను క‌లెక్ష‌న్ కింగ్‌లుగా వాడుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. నెల‌నెలా ఆస్ప‌త్రుల‌కు వెళ్ల‌డం.. ఒప్పందాల ప్ర‌కారం వ‌సూలు చేయ‌డం.. 50శాతం, 30శాతం, 20శాతంగా పంచుకోవ‌డం మామూలుగా మారిపోయిన‌ట్లు స‌మాచారం. ఇదేస‌మ‌యంలో ప్రైవేట్ నెట్ వ‌ర్క్‌ ఆస్ప‌త్రుల్లో ప‌నిచేస్తున్న ఆరోగ్య మిత్ర‌ల‌ను కూడా యాజ‌మాన్యాల‌కు అనుకూలంగా ఉండాలంటూ ఒత్తిడి తీసుకొస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఒకవేళ మాట విన‌కుంటే.. టార్గెట్ చేసి వేధించ‌డం, దూర ప్రాంతాల‌కు బ‌దిలీ చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయిన‌ట్లు తెలుస్తోంది. నిజానికి.. ఆరోగ్య శ్రీ కింద వైద్యం పొందుతున్న వారి నుంచి ఒక్క‌పైసా కూడా వ‌సూలు చేయొద్దు. కానీ.. మెరుగైన వైద్యం పేరుతో రోగుల నుంచి ఆస్ప‌త్రి యాజ‌మాన్యాలు డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నాయి. అయితే.. పై ప‌రిస్థితుల నేప‌థ్యంలో రోగి ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే స‌మ‌యంలో ధైర్యంగా గ్రీవెన్సెస్ చెప్పుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. అద‌నంగా వ‌సూలు చేసిన డ‌బ్బుల‌తో పాటు.. నెల‌వారీగా పెద్ద‌ మొత్తంలో డ‌బ్బులు జిల్లా బాస్‌లు వ‌సూలు చేస్తూ.. సైలెంట్‌గా ఉంటున్న‌ట్లు స‌మాచారం.

ఎంవోయూలో ల‌క్ష‌లు వ‌సూలు..?
ఆరోగ్యశ్రీ పరిధిలో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో సుమారు 68 ఆస్ప‌త్రులు ఉన్నాయి. ఇందులో సుమారు 21 ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు ఉండ‌గా, మిగ‌తావి ప్రైవేట్ నెట్ వ‌ర్క్ ఆస్ప‌త్రులు. ఇందులో సుమారు 30 ప్రైవేట్‌ ఆస్ప‌త్రులు ఆరోగ్య‌శ్రీ ట్ర‌స్ట్ నియ‌మ‌నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీటి పెర్ఫార్మెన్స్‌ అధ్వానంగా ఉన్న‌ట్లు స‌మాచారం. డాక్ట‌ర్లు, సిబ్బంది, సౌక‌ర్యాలు లేకున్నా ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ప‌రిధిలో ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే.. ఈ ప్రైవేట్ నెట్ వ‌ర్క్ ఆస్ప‌త్రులు ఏడాదికి ఒకసారి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌తో ఒప్పందం చేసుకోవాలి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ప్రారంభించినప్పటి నుంచి ఈ ప్రక్రియ నడుస్తోంది. ఏడాదికి ఒకసారి ఎంవోయూ చేసుకుంటేనే ఆ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలకు ట్రస్ట్‌ అనుమతిస్తుంది. అయితే.. ఎంవోయూ ప్రక్రియ స‌మ‌యంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ జిల్లా అధికారులు ఆస్పత్రుల నుంచి ల‌క్ష‌ల రూపాయలు దండుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ మేనేజ‌ర్‌, కో-ఆర్డినేటర్ల అవినీతికి అంతే లేకుండాపోయిందనే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ప‌డ‌క‌ల లెక్క‌న ఆస్ప‌త్రుల వారీగా రేటు రేటు నిర్ణయించి ఎంవోయూ ప్రక్రియ చేప‌డ‌తున్న‌ట్లు తెలుస్తోంది. పెర్ఫార్మెన్స్ స‌రిగా లేని ఆస్ప‌త్రుల యాజ‌మాన్యాల నుంచి ల‌క్ష‌ల్లో డ‌బ్బులు వ‌సూలు చేసి ఎంవోయూ పున‌రుద్ధ‌రిస్తున్న‌ట్లు స‌మాచారం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img