- ఈ అవినీతి పాలన కోసమా మీకు ఓటేసింది ..?
- మళ్లోసారి దొరతనం బుసలుకొట్టడానికా కష్టపడ్డది..?
- మాలో ఉద్యమ చైతన్యం ఇంకా చావలేదు..
- సమాజానికి సేవ చేయాలన్న దృక్పథం మారదు
- మాజీ మావోయిస్టు నేత, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గాజర్ల అశోక్
- వెలిశాల కార్నర్ మీటింగ్‌లో సుదీర్ఘ ప్రసంగం
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై నిప్పులుఅక్షరశక్తి, భూపాలపల్లి : భూపాలపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డిపై మావోయిస్టు మాజీ నేత, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గాజర్ల అశోక్ నిప్పులుచెరిగారు. భూపాలపల్లి నియోజకవర్గంలో అరాచకం రాజ్యమేలుతున్నదని, దీని కోసమేనా మనం త్యాగాలు చేసింది..? మళ్లోసారి దొరతనం బుసలుకొట్టడానికా మనం కష్టపడ్డది అంటూ ఫైర్ అయ్యారు. వెలిశాల కార్నర్ మీటింగ్‌లో అశోక్ సుదీర్ఘంగా ప్రసంగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే రమణారెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీ అరాచకాలు చూస్తూ ఊరుకోబోమని.. మీ పాలనకు చరమగీతం పాడుతామని ఘాటుగా హెచ్చరించారు. తన వర్గాల కోసం, తన కుటుంబం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని వంచించిండు.. దగా చేసిండు.. దోపిడీ చేసిండు అని అశోక్ మండిపడ్డారు. మేం ఈ రోజు విప్లవోద్యమంలో లేకపోవచ్చు.. బయటకొచ్చి బతుకుతున్నం కావొచ్చు.. కానీ మాలోపల ఉద్యమ చైతన్యం చావలేదు.. సమాజానికి సేవ చేయాలన్న దృక్పథం చావదు అన్నారు. ఇవాళ పరిస్థితులు చూసి ఆవేదన చెందుతున్నాం.. ఎంతో మంది మిత్రులతో చర్చించుకున్నాం.. భూపాలపల్లిలో అరాచకం పెరుగుతున్నది.. నియోజకవర్గంలో ఏ ఒక్కక్కరినీ కదిలించినా గజ్జున వణుకుతున్నరు. ఇంత అరాచక పాలన కోసమా మీకు ఓటేసింది అంటూ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై నిప్పులు చెరిగారు. మాతో ఉద్యమంలో కలిసి పనిచేసి మరణించిన అమరవీరుడి భార్య డీలర్‌షిప్‌ను ఏ కారణంలేకుండా చిట్యాల జెడ్పీటీసీ తొలగించి మరొకరికి ఇచ్చాడని, దీనిపై తాను స్వయంగా వెళ్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని కలిశానని, ఆమె ఏ తప్పూ చేయలేదని, ఇది తప్పని ఆమెకు న్యాయం చేయాలని కోరితే జెడ్పీటీసీ మాటలు విని ఆమె డీలర్షిప్ ఊడబీకించారన్నారు. ఇదా మీ న్యాయం.. అమరవీరుల కుటుంబాలకు న్యాయంచేయలేని మీరు.. ఆ పేరు చెప్పుకుని మీ సంకన బతికే వాళ్లు చేసే అరాచకాలు ప్రోత్సహించి, వాళ్లే మా బలం అనుకోని రాజ్యమేలుతున్న మిమ్మల్ని ఎందుకు చూస్తూ ఊరుకోవాలని, మీ అరాచక పాలనను ఆపకుండా ఎందుకు ఊర్కోవాలె అని ఘాటుగా హెచ్చరించారు. చిట్యాలలో సౌమ్యుడు, విద్యావంతుడు, మంచి పేరున్న సర్పంచ్ రాజన్నను మానసికంగా హింసించి హత్య చేసిండ్రని.. ఈ హత్యకు కారకులు ఎవరు అని మొత్తం చిట్యాల ప్రజలు అరిచిండ్రు.. గొంతెత్తిండ్రు.. రోడ్లమీదికి వచ్చిండ్రు అన్నారు. దానికి కారకులను కాపాడుతవ్.. వాన్నే సర్పంచ్‌ను చేస్తవ్.. వాన్ని అడ్డుపెట్టుకుని అరాచకం చేయాలని చూస్తవ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకెక్కడ ప్రజల పట్ల ప్రేమున్నది..? చావుల పట్ల నీకు కన్సర్న్ ఎక్కడుంది..? అంటూ ప్రశ్నించారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే భూపాలపల్లి నియోజకవర్గంలో అరాచకం రాజ్యమేలుతున్నదన్నారు. గూండాల్లాగ, రౌడీల్లాగా వీళ్లు రాజ్యమేలేటందుకా మనం త్యాగాలు చేసింది అంటూ ప్రశ్నించారు. భూపాలపల్లిలో అరాచక పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు అశోక్ పిలుపునిచ్చారు.
మీ అరాచకాలు చూస్తూ ఊరుకోం.. ఎమ్మెల్యే గండ్రకు గాజర్ల అశోక్ మాస్ వార్నింగ్
Must Read