ఇది పీవో-2018 ఉత్వర్తుల స్ఫూర్తికి విరుద్ధం
స్థానికతకు ప్రాధాన్యతలేని జీవోతో టీచర్లకు అన్నీ అనర్థాలే
స్వరాష్ట్రంలోనూ ఉద్యమాలు చేయాల్సిరావడం దురదృష్టకరం
ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలి
ఉపాధ్యాయ సంఘాల సూచనలను పరిగణలోకి తీసుకోవాలి
ఎస్టీయూ హన్మకొండ జిల్లా అధ్యక్షులు యాట సదయ్య
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : ప్రభుత్వం అమలు చేస్తున్న జీవో నంబర్ 317తో ఉపాధ్యాయులకు తీరని అన్యాయం జరుగుతోంది. స్థానికతను లెక్కలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా ఉపాధ్యాయులను జిల్లాలకు కేటాయించడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా ఎలాంటి ప్రమోషన్లు లేకుండా స్థానచలనం పొందాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతేగాకుండా.. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్న పీవో-2018 ఉత్తర్వుల స్ఫూర్తికి జీవో నంబర్ 317 విరుద్ధమైనది. దీనివల్ల రూరల్ జిల్లాల్లోని స్థానిక నిరుద్యోగులకు మరో ఇరవై ఏళ్లయినా ఉద్యోగాలు లభించే పరిస్థితి లేకుండా పోతోంది.. అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎస్టీయూ హన్మకొండ జిల్లా అధ్యక్షులు యాట సదయ్య. జీవో నంబర్ 317పై ఉపాధ్యాయవర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినపడుతున్న నేపథ్యంలో అక్షరశక్తితో సదయ్య ప్రత్యేకంగా మాట్లాడారు.
ప్రశ్న : జీవో నంబర్ 317తో ఉద్యోగుల విభజన సరిగ్గా జరగడం లేదా..?
జవాబు : జిల్లాల వారీగా ఉపాధ్యాయుల విభజనకు జీవో నంబర్ 317 సరియైనది కాదు. ఎందుకంటే.. 317 అనేది ఉద్యోగులను మాత్రమే జిల్లాలకు కేటాయించడానికి తీయబడిన జీవో. కానీ.. ఉపాధ్యాయుల్లో అనేక రకాల క్యాడర్లు ఉంటాయి. సర్వీస్ రూల్స్ ఉంటాయి. దీనికి అనుగుణంగా ఉపాధ్యాయులకు 317జీవోలో మార్పులతో విభజన చేయాల్సి ఉండేది. 317 జీవో అమలు పర్చేదానికంటే ముందే ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తూ అర్హులకు స్థాన చలనం కల్పించారు. కానీ.. ఉపాధ్యాయుల విషయానికి వస్తే.. గత ఎనిమిదేళ్లుగా ప్రమేషన్లు కల్పించలేదు.
దీంతో సీనియర్, జూనియర్ ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. 317 జీవోలో ఎటువంటి మార్పు లేకుండానే స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వకుండా సీనియారిటీ ప్రకారం మాత్రమే ఉపాధ్యాయులను జిల్లాలకు కేటాయించడం వల్ల.. ఎటువంటి ప్రమోషన్లు లేకుండానే జూనియర్ ఉపాధ్యాయులు మారుమూల జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది. పీవో 2018 ప్రకారం.. మారుమూల జిల్లాల్లో స్థానిక నిరుద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలి. కానీ.. జూనియర్ ఉపాధ్యాయులను సీనియారిటీ ప్రకారం ఆ మారుమూల జిల్లాలకు కేటాయించడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇంకా 20ఏళ్ల వరకు కల్పించే పరిస్థితులు లేకుండాపోతున్నాయి. 3
17జీవో ఉపాధ్యాయులకు అమలు పర్చే క్రమంలో ఎటువంటి షెడ్యూల్ లేకుండానే.. జిల్లాల్లో జిల్లా అధికారులకు శిక్షణ ఇవ్వకుండానే.. సంఘాలను సంప్రదించకుండానే తొందరపాటుగా వ్యవహరించడం వల్ల సీనియారిటీ జాబితాలో తప్పులు దొర్లాయి. ఈ విషయాన్ని ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలు చేస్తూ మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోకుండా వారి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లాలో మూడువేలకుపైగా అప్పీళ్లు పరిష్కారంగాకుండా అలాగే ఉండిపోయాయి. దీంతో ఆ బాధిత ఉపాధ్యాయులు ఆందోళనకు దిగుతున్నారు. దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
ప్రశ్న : జీవో 317 అనేది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని అంటున్నారు.. ఎలా..?
జవాబు : తెలంగాణ ఉద్యమం పూర్తిస్థానికత ఆధారంగా ఏర్పడిన ఉద్యమం. కానీ.. ప్రస్తుతం 317 జీవో అమలులో స్థానికతకే ప్రాధాన్యతలేకుండా ఉద్యోగుల సీనియారిటీని ఆధారంగా చేసుకోవడం వల్ల ఇష్టం ఉన్నా.. ఇష్టంలేకపోయినా వారిస్థానికతకు సంబంధంలేని ప్రాంతానికి బదిలీ చేయడం జరుగుతోంది. పీవో 2018 ఉత్తర్వుల ప్రకారం.. స్థానికతకుప్రాధాన్యత ఇస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిన స్ఫూర్తి దెబ్బతింటోంది. ఇతర ప్రాంతాలకు చెందిన జూనియర్ ఉద్యోగులను ఆ జిల్లాలకు కేటాయించడం వల్ల స్థానికులకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు లేకుండాపోతున్నాయి. పీవో 2018 ఉత్తర్వులను గౌరవించాల్సిన ప్రభుత్వమే వాటికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఇది ఎంతమాత్రం మంచి పరిణామం కాదు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి.. స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వకుండా జీవో 317ను అమలు చేయడం వల్ల సిద్దిపేట జిల్లాకు చెందిన ఒక ఉపాధ్యాయురాలు, ఈరోజు జయశంకర్‌భూపాలపల్లి జిల్లాకు కేటాయించబడడం జరిగింది. తనకు అసలే పరిచయం లేని ప్రాంతంలో పనిచేయాల్సి రావడం ఆందోళన కలిగించే అంశం.
ప్రశ్న : ఉపాధ్యాయ సంఘాలను సంప్రదించకుండానే జీవో 317ను ప్రభుత్వం అమలు చేసిందా..?
జవాబు : ఉపాధ్యాయులను జిల్లాలకు కేటాయించడం అనే ప్రక్రియ చాలా పెద్ద అంశం. కానీ.. తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. నాటి ప్రభుత్వాలు సంఘాలతో చర్చించేవి. సూచనలను స్వీకరించేవి. కానీ.. స్వరాష్ట్రంలో ఆ పరిస్థితులు లేకుండా పోయాయి. ఉపాధ్యాయుల సంఘాలకు సంబంధించిన సూచనలను, సలహాలను తీసుకోకుండా ఏకపక్షంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీనివల్ల ఈరోజు ఉపాధ్యాయులు అనేక సమస్యలతో ఆందోళన చెందుతూ ఉద్యమదారిపడుతున్నారు. స్వరాష్ట్రంలో స్థానికత కోసం మళ్లీ పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి, 317జీవోను రద్దు చేస్తూ స్థానికతకు ప్రాధాన్యత ఇస్తూ విభజన చేయాల్సిన అవసరం ఉంది. సర్వీసుకు ఎటువంటి ఆటంకం కలగకుండా.. ఉపాధ్యాయులు ముందుముందు ప్రమోషన్లలోగానీ.. బదిలీలల్లో గానీ వారి స్థానిక జిల్లాలకు రావడానికి అవసరమైన హామీని ప్రభుత్వం ఇవ్వాలి.