Monday, September 9, 2024

హెల్త్‌సిటీగా వ‌రంగ‌ల్‌

Must Read
  • ఓరుగ‌ల్లంటే సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక ప్రేమ‌
  • 215.35 ఎకరాల్లో హెల్త్‌సిటీ నిర్మించే యోచ‌న‌
  • ఉమ్మడి జిల్లాలో 2,900 పడకలు అందుబాటులోకి..
  • రాష్ట్ర వ్యాప్తంగా టి- డయాగ్నోస్టిక్ సెంటర్లు.. పీడియాట్రిక్ ఐసీయూ యూనిట్లు
  • ఆరోగ్య తెలంగాణ‌గా తీర్చిదిద్దేందుకు కృషి
  • ఆర్థిక‌, వైద్యారోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు
  • వ‌రంగ‌ల్‌లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌
  • పాల్గొన్న మంత్రులు ఎర్ర‌బెల్లి, స‌త్య‌వ‌తి, ఎమ్మెల్యేలు విన‌య్‌భాస్క‌ర్‌, న‌రేంద‌ర్‌, ఎమ్మెల్సీ బండా ప్ర‌కాశ్‌, మేయ‌ర్ సుధారాణి

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వరంగల్ అంటే ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రేమ.. అందుకే వరంగల్‌ను హెల్త్ సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇక్కడ ఇప్పటికే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఉండగా, అత్యాధునిక వైద్య సదుపాయాలు, సూపర్ స్పెషాలిటీ సేవలతో కూడిన హెల్త్ సిటీని 215.35 ఎకరాల్లో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. 15 ఎకరాల్లో రూ. 1,100 కోట్లతో భారీ భవన సముదాయాన్ని నిర్మించబోతున్నాం. 2,000 పడకల సామర్థ్యంతో ఈ ఆస్ప‌త్రి నిర్మాణం జరగనున్నది.. అని మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌లో గురువారం ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప‌ర్య‌టించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. టీ-డయాగ్నోస్టిక్ హబ్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు, మథర్ మిల్క్ బ్యాంక్, టీబీ స్పెషాలిటీ క్లినిక్, బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఎంజీఎం ఆస్ప‌త్రిలో 42 పడకల పీడియాట్రిక్ కేర్ యూనిట్‌ను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వ‌రంగ‌ల్‌ ఎంపీ దయాకర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేష్, ఎమ్మెల్సీ బండా ప్రకాష్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మ‌న్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, గ్రేట‌ర్ వరంగ‌ల్‌ మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆయ‌న ప్రారంభించారు.

వ‌ల‌స జీవుల‌పై విషం క‌క్కిన మోడీ
ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణపై విషం కక్కిన మోడీ.. ఇప్పుడు వలస జీవులపై విషం క‌క్కాడ‌ని అన్నారు. వలస కార్మికులకు సమయం ఇవ్వలేదని, అకస్మాత్తుగా లాక్ డౌన్ పెట్టడంతో ఎంతో మంది నరకం చూసారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భోజనం పెట్టి, జేబులో డబ్బులు పెట్టి, రైళ్లు ఏర్పాటు చేసి ఇళ్లకు పంపారని, ఇలా వలస కార్మికులకు అనేక మంది, సేవా సంస్థలు సహకారం అందించాయని పేర్కొన్నారు. అందరినీ అభినందిచల్సినది పోయి.. మోడీ విమర్శలు చేస్తున్నారని, వారిని ఇంటికి పంపడం వల్లనే కరోనా పెరిగిందంటూ అవమాన పరిచారని, వలస జీవులపై ఎందుకు మోడీకి చిన్న చూపని ప్ర‌శ్నించారు. వలస కార్మికుల కష్టాలు అర్థం చేసుకోవడంలో కేంద్రం ఫెయిల్ అయ్యిందని, ట్రంప్‌ను తీసుకు వచ్చి, మీటింగ్ లు పెడితే, ఎన్నికల ర్యాలీలు పెడితే కరోనా పెరగలేదు కానీ వలస కార్మికుల వల్ల పెరిగిందా.. అంటూ హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. మొన్న తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచారు. అప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటు సక్రమంగా జరగలేదని అంటున్నారు. తెలంగాణపై ఎప్పుడూ విషం చిమ్మడమే మోడీ పని. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చింది? వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు? 157 మెడికల్ కాలేజీలు ఇస్తే ఎందుకు ఒక్కటి కూడా ఇవ్వలేదు? నవోదయ పాఠశాలలు, ఐఐఎం, ఐఐఐటీ, ఒక్కటీ ఇవ్వలేదు. అన్నింటా తెలంగాణకు మొండి చేయి చూపారు…తెలంగాణ అంటే బీజేపీకి కడుపు నిండా విషమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీకు తెలంగాణలో నూకలు చెల్లినయ్‌.. మీరు ఎన్ని అడ్డంకులు చేసినా రాష్ట్రం పురోగతిలో ఉంటది.. అభివృద్ధి ఆగదు.. అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తెలంగాణపై మోడీ చేసిన వ్యాఖ్యలు, వాళ్ల‌ తీరు పట్ల జర్నలిస్టు సంఘాలు కూడా కదలాలని, ఉద్యమంలో వరంగల్ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని అన్నారు.

జాత‌ర‌లో ప్ర‌త్యేక వైద్య‌బృందాలు
మంత్రుల కోరిక మేరకు సమ్మక్క-సారక్క జాతరలో ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేస్తామ‌ని, అరోగ్య శాఖ తరుపున పూర్తి స్థాయి ఏర్పాట్లు ఉంటాయని మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. రూ.7.5 కోట్లతో ఎమ్మారై స్కాన్, సెకెండ్ సీటీ స్కాన్ ని కూడా మంజూరు చేస్తున్నామ‌ని, త్వరలో అందుబాటులోకి వస్తాయని అన్నారు. రెండో డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేయడంలో, 15-17 ఏళ్ల మధ్య వారికి మొదటి డోసు పూర్తి చేయడంలో హన్మకొండ ముందంజలో ఉందని, మంత్రులకు, ఇక్కడి జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. వరంగల్ జిల్లా కూడా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సమ్మక్క జాతర తర్వాత ములుగు, సిరిసిల్లలో హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు మొదలవుతుందని, తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

పీడియాట్రిక్ ఐసీయూ యూనిట్లు
తెలంగాణ ఏర్పడిన తర్వాత పుట్టిన పిల్లల కోసం నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు, పెద్ద వాళ్ల కోసం అడల్ట్ ఐసీయూ, తల్లుల కోసం మెటర్నల్ ఐసీయూలను మనం ప్రారంభించుకున్నామ‌ని, ఇప్పుడు కొత్తగా చిన్నారుల కోసం పీడియాట్రిక్ ఐసీయూ యూనిట్లను మొదటి సారిగా మనం ప్రారంభించుకుంటున్నామ‌ని అన్నారు. హబ్ అండ్ స్పోక్ మోడల్లో 33 జిల్లాల్లో ప్రత్యేకంగా పీడియాట్రిక్ ఐసీయూలను అందుబాటులోకి తీసుకువస్తున్నామ‌ని, రూ.86 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామ‌ని, ఈ క్రమంలో మొదటిది ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నామ‌ని అన్నారు. 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించే టి- డయాగ్నోస్టిక్ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామ‌ని, ఇప్పటికే 20 జిల్లాల్లో ఉండగా, 13 జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నామ‌ని, ప్రతి చోట పాథాలజీ, రేడియాలజీ సేవలు ఉండేలా చూస్తున్నామని అన్నారు. దీని కోసం ఒక్కో సెంటర్‌ను రూ. 3.5కోట్లతో ఏర్పాటు చేస్తున్నామ‌ని అన్నారు.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌లో
నర్సంపేట‌లో 200, భూపాలపల్లి 300, ములుగు 200, మహబూబాబాద్‌లో 200 పడకల ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని, దీనికి తోడు వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో 2000 పడకలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి హ‌రీశ్‌రావు వెల్ల‌డించారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో 2,900 పడకలు అందుబాటులోకి రానున్నాయని ఆయ‌న తెలిపారు. వరంగల్ అంటే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ప్రేమ. అందుకే వరంగల్ ను హెల్త్ సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇక్కడ ఇప్పటికే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఉండగా, అత్యాధునిక వైద్య సదుపాయాలు, సూపర్ స్పెషాలిటీ సేవలతో కూడిన హెల్త్ సిటీని 215.35 ఎకరాల్లో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. 15 ఎకరాల్లో రూ. 1,100 కోట్లతో భారీ భవన సముదాయాన్ని నిర్మించబోతున్నాం. 2,000 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనున్నది.. అని మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. విద్యతో పాటు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఆయ‌న అన్నారు.

పల్లె ప్రజల కోసం..
పల్లె ప్రజల కోసం పల్లె దవాఖానలు, పట్టణ ప్రజల కోసం బస్తీ దవాఖానలు, జిల్లాకొక మెడికల్ కాలేజీ, హైదరాబాద్ నలువైపులా ఎయిమ్స్ తరహాలో నాలుగు టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. 8 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని.. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ పరిధిలోని మహబూబాబాద్లో కొత్త మెడికల్ కాలేజీ వస్తున్నదని ఆయ‌న తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 700 మాత్రమే ఉంటే, ఇప్పుడు వాటిని 2,850కి పెంచుకుంటున్నామ‌ని.. పీజీ సీట్లు నాడు 531 మాత్రమ ఉంటే, ఏడేండ్లలో 938కి పెంచుకున్నామ‌ని, భవిష్యత్లో వీటన్నింటిని మరింత పెంచుకొని, దేశానికే తెలంగాణ వైద్య రంగాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దబోతున్నామ‌ని అన్నారు. తెలంగాణ వైద్య రంగం దేశంలోనే అత్యుత్తమమైందని కేంద్ర ప్రభుత్వ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img