Saturday, May 18, 2024

IPL 2022: ఎన్నాళ్లో వేచిన ఉదయం..! హమ్మయ్య ముంబై గెలిచిందోచ్.. సీజన్ లో తొలి విజయం

Must Read

IPL 2022: ఎన్నాళ్లో వేచిన ఉదయం..! హమ్మయ్య ముంబై గెలిచిందోచ్.. సీజన్ లో తొలి విజయం

TATA IPL 2022: ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉండి ఈ సీజన్ లో వరుసగా 8 పరాజయాలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. ఆ జట్టు సారథి రోహిత్ శర్మ పుట్టినరోజున గెలుపును కానుకగా ఇచ్చారు ముంబై ఆటగాళ్లు.

హమ్మయ్య.. ముంబై ఇండియన్స్ గెలిచింది. ఈ లీగ్ లో  వరుసగా 8 మ్యాచులు ఓడి తీవ్ర అప్రతిష్ట పాలైన రోహిత్ సేన.. ఎట్టకేలకు అపజయాల పరంపరకు అడ్డుకట్ట వేసింది.  సాధించాల్సింది మరీ భారీ లక్ష్యం కాకపోయినా ఛేదనలో ముంబై కష్టపడింది. సూర్య కుమార్ యాదవ్ (51), తిలక్ వర్మ (35) లు కీలక ఇన్నింగ్స్ కు తోడు ఆఖర్లో టిమ్ డేవిడ్, పొలార్డ్ కూడా  రాణించి  ఆ జట్టుకు ఈ సీజన్ లో తొలి విజయాన్ని అందిచారు. రాజస్తాన్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ముంబై.. 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.  ఇక ఈ ఐపీఎల్ రాజస్తాన్ కు మూడో ఓటమ కాగా.. ముంబైకి ఆడిన 9 మ్యాచుల్లో ఇది తొలి విజయం. రోహిత్ శర్మ పుట్టినరోజున ఆ జట్టు ఆటగాళ్లు కెప్టెన్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు.

ఈజీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ కు మళ్లీ నిరాశే ఎదురైంది. తన పుట్టినరోజునైనా  ఫామ్ లోకి వచ్చి మెరుపులు మెరిపిస్తాడని ఆశించిన ముంబై సారథి రోహిత్ శర్మ (2) మళ్లీ విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 26.. 4 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడినా అది కూడా కొద్దిసేపే. రోహిత్ ను అశ్విన్ ఔట్ చేయగా.. బౌల్ట్ బౌలింగ్ లో శాంసన్ కు క్యాచ్ ఇచ్చి  ఇషాన్  పెవిలియన్ కు చేరాడు.

41 పరుగులకే రెండు వికెట్లు కోల్పయిన దశలో క్రీజులోకి వచ్చిన  సూర్యకుమార్ యాదవ్ (39 బంతుల్లో 51.. 5 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (30 బంతుల్లో 35.. 1 ఫోర్, 2 సిక్సర్లు) లు ఆచితూచి ఆడారు. మిచెల్ వేసిన ఏడో ఓవర్లో సూర్య 3 ఫోర్లు కొట్టగా తిలక్ వర్మ ఓ సిక్సర్ తో  ముంబై ఇన్నింగ్స్ కు ఊపు తెచ్చారు.  ఆ తర్వాత  రాజస్తాన్ బౌలర్లు  ఊరించే బంతులు వేసి రెచ్చగొట్టినా అనవసరపు షాట్లకు పోకుండా సంయమనం పాటించారు. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే సంకల్పం వాళ్ల ఆటలో  కనిపించింది.

పది ఓవర్లు ముగిసేసరికి  ముంబై స్కోరు  75-2. ఆ తర్వాత  రెండు ఓవర్లలో వరుసగా పది పరుగులు  వచ్చాయి. అశ్విన్ వేసిన 14వ ఓవర్లో ఆఖరి బంతికి సిక్సర్ బాదిన సూర్య.. లాంగాన్ దిశగా సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే చాహల్ వేసిన 15వ ఓవర్లో  చివరి బంతిని భారీ షాట్ కు యత్నించి  లాంగాన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రియాన్ పరాగ్ కు చిక్కాడు.  దీంతో  సూర్య-తిలక్ ల 81 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సూర్య ఔట్ అయిన తర్వాత ఓవర్లోనే ప్రసిధ్ వేసిన రెండో బంతిని  భారీ షాట్ కు యత్నించి  పరాగ్ కే క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.

వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో ముంబై శిభిరంలో మళ్లీ ఒకింత ఆందోళన. అయితే పొలార్డ్ (14 బంతుల్లో 10) ఉన్నాడన్న ధైర్యంతో ఆ జట్టు దానిని పెద్దగా పట్టించుకోలేదు. అప్పటికీ చేయాల్సింది 24 బంతుల్లో 35 పరుగులు. టిమ్ డేవిడ్ ( 9 బంతుల్లో 20 నాటౌట్.. 2 ఫోర్లు, 1 సిక్సర్) తో కలిసి  పొలార్డ్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. చాహల్ వేసిన  17వ ఓవర్లో 10 పరగులు రాగా కుల్దీప్ వేసిన 18వ ఓవర్లో 13 రన్స్ వచ్చాయి. 19వ ఓవర్ వేసిన ప్రసిధ్.. 8 పరుగులే ఇచ్చినా.. ఆఖరి ఓవర్లో  ముంబై విజయానికి 4 పరుగులు కావాల్సి వచ్చాయి. కుల్దీప్ సేన్ వేసిన 20 వ ఓవర్ తొలి బంతికి పొలార్డ్ ఔటయ్యాడు. కానీ.. పొలార్డ్ స్థానంలో వచ్చిన డేనియల్ సామ్స్ (6 నాటౌట్) తొలి బంతికే సిక్సర్ బాదాడు. అంతే.. 8 పరాజయాల తర్వాత రోహిత్ తో పాటు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు, కుటుంబం, అభిమానుల్లో నవ్వులు.. తొలి విజయం ఇచ్చిన ఆనందమది.

ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్ (67) మినహా మిగిలినవారంతా  చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. అశ్విన్ (21) ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేసి రాజస్తాన్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.

సంక్షిప్త స్కోరు వివరాలు:
– రాజస్తాన్ రాయల్స్ : 20 ఓవర్లలో 158-6
– ముంబై ఇండియన్స్ :  19.2 ఓవర్లలో  161-5
– ఫలితం : 5 వికెట్ల తేడాతో ముంబై గెలుపు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img