- పీహెచ్‌డీ అడ్మిషన్లలో అవకతవకలపై విద్యార్థుల ఆగ్రహం
- ప్రిన్సిపాల్ కార్యాలయం వద్ద విద్యార్థుల నిరసన
- పోలీసుల దాడిలో పలువురికి గాయాలు
- ఫర్నిచర్ ధ్వంసం
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : కాకతీయ యూనివర్సిటీలో ఇటీవల చేపట్టిన పీహెచ్‌డీ కేటగిరీ-2 అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థితోపాటు, పలు విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అడ్మిషన్లలో సుమారు 75శాతం అడ్మిషన్లను పార్ట్‌టైం ఉద్యోగులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఎక్కడ కూడా నియమనిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వీసీ, రిజిస్ట్రార్, ఆల్ డీన్స్ కలిసి కుమ్మక్కై పెద్దమొత్తంలో డబ్బులకు అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. - మంగళవారం మధ్యాహ్నం కేయూ ప్రిన్సిపాల్ కార్యాలయంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు వచ్చారు. పీహెచ్‌డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని, తమకు అన్యాయం జరిగిందని చెబుతున్నా వినకుండా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని విద్యార్థులు ఆరోపించారు. పోలీసులు తమపై దాడి చేసి గాయపర్చారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థి నేతలకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసమైంది. చివరకు పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. ఈ ఆందోళనలో ఏబీవీపీ నేతలు అంబాల కిరణ్, ప్రశాంత్, మాచర్ల రాంబాబు, అజయ్, శ్రీకాంత్, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆల్ యూనివర్సిటీస్ ఇన్‌ఛార్జి నాగరాజు, శంకర్, మట్టెడ కుమార్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Must Read