Tuesday, June 18, 2024

ల్యాండ్ పూలింగ్‌.. ఆ ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్‌!

Must Read
  • గులాబీకి పూలింగ్ దెబ్బ‌!
  • కుడా ల్యాండ్ పూలింగ్‌పై రైతుల మండిపాటు
  • టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం
  • ఐదు నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం
  • బాధిత రైతుల ప‌క్షాన ప‌లు పార్టీలు, సంఘాలు
  • ఎన్నిక‌ల ముంగిట ఇర‌కాటంలో అధికార పార్టీ

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన ప్ర‌తినిధి : కుడా ( కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ) ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ల్యాండ్ పూలింగ్ వ్య‌వ‌హారం అధికార టీఆర్ఎస్ పార్టీని ఇర‌కాటంలోకి నెడుతోందా..? రాజ‌కీయంగా తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావాన్ని తెచ్చిపెడుతోందా..? ఎన్నిక‌ల ముంగిట సుమారు ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని క‌ష్టాల్లోకి నెట్టే ప్ర‌మాదం ఉందా..? 27 గ్రామాల రైతుల నుంచి, కూలీల నుంచి, మేధావుల నుంచి ల్యాండ్ పూలింగ్‌కు వ్య‌తిరేకంగా వ్య‌క్త‌మ‌వుతున్న నిర‌స‌న‌లే ఇందుకు నిద‌ర్శ‌న‌మా..? అంటే తాజా ప‌రిణామాలు మాత్రం ఔన‌నే అంటున్నాయి. హనుమకొండ, వరంగల్‌, జనగామ జిల్లాల్లోని 27 గ్రామాల్లో ఔటర్‌రింగ్‌ రోడ్డును ఆనుకొని ఉన్న 21,510.02 ఎకరాల భూమి సమీకరణకు కుడా ఇటీవ‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. త‌మకు తెలియ‌కుండా ర‌హ‌స్యంగా స‌ర్వే చేయ‌డంపై, ఎలాంటి స‌మాచారం లే కుండానే ల్యాండ్ పూలింగ్ నోటిఫికేష‌న్‌లో త‌మ భూముల‌ స‌ర్వే నంబ‌ర్లు వేయ‌డంపై రైతులు భ‌గ్గుమంటున్నారు. త‌మ పొట్ట‌మీద కొట్ట‌వ‌ద్ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజా ప‌రిణామాలు ఎలాంటి ప‌రిస్థితుల‌కు దారితీస్తాయోన‌ని ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు లోలోప‌ల మ‌ద‌న‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

భూములు ఇచ్చేది లేదంటున్న రైతులు

హైదరాబాద్‌ తరహాలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పెద్దఎత్తున భూసమీకరణకు కుడా( కాకతీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ) కసరత్తు చేస్తోంది. ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములు ఇవ్వడానికి ఒక పక్క రైతులు నిరాకరిస్తున్నా అదేం పట్టించుకోకుండా ముందుకు వెళ్తోంది. రైతుల ఇష్ట‌పూర్వ‌కంగా తీసుకుంటామంటూనే త‌న ప్ర‌య‌త్నాలు తాను చేస్తోంది. ప్ర‌ధానంగా వ‌రంగ‌ల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఆనుకొని ఉన్న భూములను రెండు నెలల కిందటే సర్వే చేయడం పూర్తి చేసింది. ఈ భూముల్లో రియ‌ల్ ఎస్టేట్‌ వెంచర్లు చేసి ప్లాట్లుగా చేసి అమ్మితే ఎక్కువ ఆదాయం వస్తుంద‌న్న కోణంలో అత్యంత విలువైన ఈ భూములుపై దృష్టి పెట్టింది. అయితే.. కుడా తీరును రైతులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌మ భూముల‌ను ఇచ్చేది లేద‌ని తెగేసి చెబుతున్నారు. అనేక చోట్ల నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇప్ప‌టికే కుడా, జిల్లా క‌లెక్ట‌ర్లు, వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌లో విన‌తిప‌త్రాలు అంద‌జేశారు. క్ర‌మంగా ఉద్య‌మం తీవ్ర రూపం దాల్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఐదు నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం

కుడా స‌మీక‌రిస్తున్న భూములు ప్ర‌ధానంగా వ‌ర్ధ‌న్న‌పేట‌, ప‌ర‌కాల‌, స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గాల్లోని 27 గ్రామాల్లో ఉన్నాయి. ఈ భూముల‌పై ఆధార‌ప‌డి వేలాది మంది రైతులు, కూలీలు, ఇత‌రులు జీవిస్తున్నారు. ఇప్పుడీ భూముల‌ను ప్ర‌భుత్వం తీసుకుని రియ‌ల్ ఎస్టేట్ ప్లాట్లుగా చేస్తే.. త‌మ బ‌తుకు పోతుంద‌న్న భ‌యాందోళ‌న‌లో రైతులు, కూలీలు ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే త‌మ భూముల‌ను ప్ర‌భుత్వం తీసుకుంటే తామేం కావాల‌ని రైతులు ప్ర‌శ్నిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్‌తో లాభం జ‌ర‌గుతుంద‌ని అధికారులు, ఎమ్మెల్యేలు చెబుతున్నా.. రైతుల నుంచి సానుకూల స్పంద‌న రావ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో ప్ర‌శ్న‌ల‌వ‌ర్షం కురుస్తోంది. త‌మ భూముల‌పై రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేయ‌డానికి మీరెవ‌రంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఈ ప‌రిణామాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి తీవ్ర ఇక్క‌ట్లు తెచ్చిపెట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌తోపాటు గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌లో ఉన్న వ‌రంగ‌ల్ తూర్పు, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీఆర్ఎస్ పార్టీపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంద‌నే టాక్ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ముందుముందు ల్యాండ్ పూలింగ్‌పై అధికార టీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండ‌బోతుందో చూడాలి మ‌రి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img